Begin typing your search above and press return to search.

చరణ్ 'పెద్ది'.. 'దంగల్' రేంజ్ కోసమా..

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది.

By:  M Prashanth   |   14 April 2026 10:00 PM IST
చరణ్ పెద్ది.. దంగల్ రేంజ్ కోసమా..
X

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్దిపై ఆసక్తి రోజురోజుకీ పెరుగుతోంది. ఉప్పెన ఫేమ్ దర్శకుడు బుచ్చిబాబు సానా ఆ సినిమాను తెరకెక్కిస్తుండగా.. బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటిస్తోంది. సంగీతాన్ని ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా భారీ బడ్జెట్‌ తో ఆ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి.

గ్రామీణ నేపథ్యంలో స్పోర్ట్స్ బ్యాక్‌ డ్రాప్‌ తో రూపొందుతున్న ఆ సినిమాలో జగపతి బాబు, కన్నడ స్టార్ శివ రాజ్‌ కుమార్, బాలీవుడ్ నటుడు దివ్యేండు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ షాట్ గ్లింప్స్, పాటలు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్నాయి. మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా పహిల్వాన్ గ్లింప్స్‌ ను విడుదల చేశారు.

ఆ వీడియో కూడా అందరినీ ఆకట్టుకుంది. అయితే ఆ గ్లింప్స్ రిలీజైనప్పటి నుంచి ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ఇందులో చరణ్ లుక్‌ లో వచ్చిన మార్పులు అభిమానుల్లో కొత్త సందేహాలకు దారితీశాయి. ముందుగా విడుదలైన గ్లింప్స్‌ లో చరణ్ చెవి, ముక్కుకు పోగులతో కనిపించగా.. తాజా పహిల్వాన్ గ్లింప్స్‌ లో అలాంటి లుక్ కనిపించలేదు.

దీంతో ఆ సినిమాలో చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారా? అనే ప్రశ్నలు నెటిజన్లలో మొదలయ్యాయి. తండ్రీకొడుకుల పాత్రల్లో కనిపిస్తారా? లేక ఒక పాత్రలో క్రికెటర్‌ గా, మరో పాత్రలో రెజ్లర్‌ గా కనిపిస్తారా? అన్న చర్చలు సోషల్ మీడియాలో జోరుగా సాగుతున్నాయి. ఇక సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికర విషయం ఇటీవల బయటకు వచ్చింది.

పెద్ది కోసం రామ్ చరణ్ తీవ్రంగా శ్రమిస్తున్నట్లు ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ సినిమా కోసం దాదాపు ఏడాదిన్నరగా ప్రత్యేకంగా శిక్షణ తీసుకుంటున్నట్లు చెప్పారు. ముఖ్యంగా రెజ్లర్ పాత్ర కోసం ఆయన కుస్తీ నేర్చుకున్నారు. ఈ సందర్భంగా చరణ్ చెప్పిన వివరాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. సుల్తాన్, దంగల్ వంటి చిత్రాలకు పనిచేసిన కోచ్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలిపారు.

ఆ పాత్ర కోసం ఐదు నెలల పాటు కఠినమైన శిక్షణ పొందినట్లు చెప్పారు. ఆ కోచ్ తనను బాగా కష్టపెట్టాడని, ఒక దశలో ఆ శిక్షణ తట్టుకోలేక 'సర్‌ జీ… నేనేమీ రెజ్లింగ్ నేషనల్స్ కోసం వెళ్లట్లేదు' అని సరదాగా చెప్పిన సందర్భాన్ని కూడా గుర్తుచేసుకున్నారు. అయితే ఆ కష్టం మొత్తం వృధా కాలేదని చరణ్ స్పష్టం చేశారు. సినిమాలో రెజ్లింగ్ ఎపిసోడ్ చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని తెలిపారు. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇస్తుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు. మొత్తానికి పెద్ది చిత్రం స్టోరీ, చరణ్ లుక్స్, పాత్రలపై వస్తున్న ఊహాగానాలు.. అన్నీ కలిసి సినిమాపై భారీ అంచనాలు పెంచుతున్నాయి. ముఖ్యంగా ద్విపాత్రాభినయం అంశం నిజమా కాదా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ విషయంపై అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.