Opinion : ఎక్స్పోజింగ్ కాదు..పెద్ది సినిమాలో పెద్ద సమస్య ఇదే…!
పెద్దిలో హీరో మొదట హీరోయిన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, ఆ తర్వాత అదే నాకు తెలిసిన ప్రేమ అని సమర్థించుకోవడం.
By: Priya Chowdhary Nuthalapti | 30 Oct 2026 10:20 AM ISTపెద్ది సినిమా గురించి సోషల్ మీడియాలో ప్రస్తుతం ఎంతమంది చర్చించుకుంటున్నారు. కొంతమంది ఈ సినిమాని సపోర్ట్ చేస్తూ ఉండగా.. మరి కొంతమంది జాన్వీ కపూర్ పై నెగిటివ్ కామెంట్స్ లో చేస్తున్నారు. ఇంకొంతమంది మాత్రం జాన్వి కపూర్ ని సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు. ఏదేమైనా ఇక్కడ అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం ఒకటి ఉంది. చాలా సినిమాలో హీరోయిన్ ఎక్స్పోజింగ్ చేస్తారు. కానీ పెద్ది సినిమాకి మాత్రమే ఈ సమస్యలు ఎందుకు వచ్చాయి అంటే.. ఈ సినిమాలో సమస్య అసలు ఎక్స్పోజింగ్ కాదు. మరి ఈ చిత్రంలో అసలు వచ్చిన సమస్యలతో ఒకసారి చూద్దాం..
రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో.. ఉప్పెన సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు బుచ్చిబాబు సాన, హీరోయిన్గా జాన్వీ కపూర్.. ఇలాంటి కాంబినేషన్లో సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉంటాయి. ముఖ్యంగా హీరోయిన్ పాత్రకు కూడా మంచి ప్రాధాన్యత ఉంటుందని అందరూ భావిస్తారు. హీరోయిన్‌కు ఎక్కువ స్క్రీన్ టైమ్ లేకపోయినా పర్లేదు. కానీ ఆమె పాత్రను ఎలా చూపిస్తున్నారు అనేదే ముఖ్యం.
పెద్ది సినిమా విషయంలో సమస్య కేవలం గ్లామర్ లేదా అందాల ప్రదర్శన మాత్రమే కాదు. కథలో హీరోయిన్ పాత్రను తీర్చిదిద్దిన విధానంలో లోపాలు కనిపించడం. ముఖ్యంగా అమ్మాయి ఇష్టం లేకపోయినా హీరో బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, దానిని ప్రేమగా చూపించడం ఎంతవరకు కరెక్ట్? ఒక అమ్మాయి అంగీకారం లేకుండా చేసే పనిని ప్రేమగా ఎలా చూపిస్తారు? ఇలాంటి విషయాల గురించి దర్శకుడు చాలా జాగ్రత్త చూసుకొని ఉండాలి.
అయితే ఇక్కడ మరో ప్రశ్న కూడా సోషల్ మీడియాలో వినిపిస్తోంది. జాన్వీ కపూర్ గతంలో దేవర సినిమాలో నటించింది. అందులో ఆమె పాత్రను ఎలా చూపించారు? అలాగే ది ప్యారడైజ్ సినిమాలో కయాదు లోహర్ పాత్రను ఎలా ప్రెజెంట్ చేస్తున్నారు? బాలీవుడ్ సినిమాల్లో కూడా హీరోయిన్లను గ్లామర్ కోసమే ఉపయోగించే సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి వాటి గురించి ఎందుకు ఇంత పెద్ద చర్చ జరగడం లేదు? ఇలాంటి ప్రశ్నకు వినిపిస్తూనే ఉన్నాయి. దీనికి సమాధానం కూడా ఒకటే.. పెట్టి సినిమా మెయిన్ గా టార్గెట్ అవ్వడానికి కారణం బుచ్చిబాబు రాసుకున్న హీరోయిన్ పాత్ర అలానే దాని చుట్టూ తిరిగే కథ.
పెద్దిలో హీరో మొదట హీరోయిన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం, ఆ తర్వాత అదే నాకు తెలిసిన ప్రేమ అని సమర్థించుకోవడం. అక్కడ తప్పు హీరో పాత్ర చిత్రణలో, కథను రాసిన విధానంలో ఉంది. స్టాకింగ్, బలవంతపు ముద్దులు, మహిళలపై వేధింపులను ప్రేమగా చూపించడం తప్పే. అలాంటి సన్నివేశాలు ఉన్న ప్రతి సినిమాను ప్రశ్నించాలి. తెలుగు, తమిళ, హిందీ అనే తేడా ఉండకూడదు.
పెద్ది సినిమాలో తప్పులు ఉంటే తప్పకుండా ప్రశ్నించాలి. అలానే మహిళలను సినిమాల్లో చూపించే విధానంపై అన్ని పరిశ్రమల్లో ఒకే విధమైన ప్రశ్నలు రావాలి. ఒక సినిమాను మాత్రమే టార్గెట్ చేయడం వల్ల అసలు సమస్యకు పరిష్కారం దొరకదు.
