Begin typing your search above and press return to search.

రామ్ చరణ్ 'పెద్ది'.. టాప్ గ్రాసర్‌ గా నిలుస్తుందా?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి.

By:  M Prashanth   |   24 May 2026 12:01 AM IST
రామ్ చరణ్ పెద్ది.. టాప్ గ్రాసర్‌ గా నిలుస్తుందా?
X

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న భారీ చిత్రం పెద్దిపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. స్పోర్ట్స్, గ్రామీణ నేపథ్యంలో రూపొందిన ఆ సినిమా జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్, పాటలు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి రేకెత్తించాయి. దీంతో 2026లో టాలీవుడ్ నుంచి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీల్లో పెద్ది ఒకటిగా నిలిచింది.

ఇటీవల గేమ్ ఛేంజర్ మూవీ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోకపోవడంతో ఈసారి రామ్ చరణ్ భారీ హిట్‌పై దృష్టి పెట్టారు. అందుకే పెద్ది సినిమాను ఎంతో జాగ్రత్తగా ప్లాన్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది. మాస్, ఎమోషన్, స్పోర్ట్స్ అంశాలను కలిపి దర్శకుడు బుచ్చిబాబు సనా సినిమాను రూపొందించినట్లు ప్రచారం జరుగుతోంది. గ్రామీణ వాతావరణం, చరణ్ లుక్, యాక్షన్ ఎపిసోడ్లు ఇప్పటికే అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

సినిమాలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్‌ గా నటిస్తుండగా.. కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు. అలాగే జగపతిబాబు, దివ్యేందు శర్మ, విజి చంద్రశేఖర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండటం సినిమాపై మరింత హైప్ పెంచుతోంది. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు, ఎడిటర్ నవీన్ నూలి వంటి టెక్నీషియన్లు వర్క్ చేయడంతో టెక్నికల్‌ గా కూడా సినిమా భారీ స్థాయిలో ఉండబోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

పెద్ది చిత్రాన్ని వృద్ధి సినిమాస్, ఐవీవై ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌ తో నిర్మిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పిస్తున్నాయి. ఇప్పటికే ప్రమోషన్స్‌ కు కూడా భారీ రేంజ్ లో ఖర్చు చేస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా నార్త్ మార్కెట్‌ పై కూడా ఫోకస్ పెట్టడంతో పాన్ ఇండియా స్థాయిలో మంచి ఓపెనింగ్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే 2026 సంవత్సరానికి సంబంధించి వరల్డ్ వైడ్ హైయెస్ట్ గ్రాసర్ జాబితాలో ధురంధర్ 2 టాప్‌ లో కొనసాగుతోంది. అంతకుముందు 2025లో ధురంధర్, 2024లో పుష్ప 2, 2023లో జవాన్, 2022లో ఆర్ఆర్ఆర్, 2021లో పుష్ప, 2020లో తాన్హాజీ వంటి సినిమాలు భారీ వసూళ్లతో రికార్డు సృష్టించాయి. ఇప్పుడు ఆ జాబితాలో పెద్ది చేరుతుందా అన్నది సినీ అభిమానుల్లో ఆసక్తికర చర్చగా మారింది.

ట్రేడ్ పండితుల అభిప్రాయం ప్రకారం.. సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే పెద్ది బాక్సాఫీస్ వద్ద సంచలన వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలతో పాటు హిందీ మార్కెట్‌ లో కూడా సినిమా క్లిక్ అయితే వెయ్యి కోట్ల దిశగా దూసుకెళ్లే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఇంకా మిగిలి ఉండటంతో మరో కొన్ని భారీ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే బోలెడు సెట్స్ పై ఉన్నాయి. అందువల్ల పెద్ది రికార్డు సృష్టించినా.. ఆ స్థానాన్ని ఏడాది చివరి వరకు నిలబెట్టుకుంటుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.