Begin typing your search above and press return to search.

పెద్ది కి ఆవాజ్: బోపాల్ ఈవెంట్లో రామ్‌చరణ్ మైండ్ బ్లోయింగ్ స్పీచ్

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వేదికగా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ `పెద్ది కి ఆవాజ్`లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హిందీ - తెలుగు భాష‌ల్లో చేసిన అద్భుత ప్రసంగం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

By:  Sivaji Kontham   |   24 May 2026 12:19 AM IST
పెద్ది కి ఆవాజ్: బోపాల్ ఈవెంట్లో రామ్‌చరణ్ మైండ్ బ్లోయింగ్ స్పీచ్
X

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ వేదికగా జరిగిన ప్రమోషనల్ ఈవెంట్ `పెద్ది కి ఆవాజ్`లో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హిందీ - తెలుగు భాష‌ల్లో చేసిన అద్భుత ప్రసంగం అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ చిత్రం తన కెరీర్‌లోనే నంబర్ వన్ సినిమా అని అత్యంత నమ్మకంగా ప్రకటించిన చరణ్.. వేదికపై త‌న సినిమా కోసం ప‌ని చేసిన‌ సాంకేతిక నిపుణుల గురించి... భోపాల్‌లోని తెలుగు ప్రజల గురించి .. మధ్యప్రదేశ్ సీఎం, మంత్రుల గురించి మాట్లాడిన విష‌యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ఈ సందర్భంగా రామ్ చరణ్ సినిమాకు పనిచేసిన సాంకేతిక నిపుణుల శ్రమను ప్రత్యేకంగా కొనియాడారు. ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ ఈ చిత్రానికి అందించిన ఆల్బమ్ మైండ్ బ్లోయింగ్‌గా ఉందని... ముఖ్యంగా భోపాల్ ఈవెంట్‌లో లాంచ్ చేసిన థర్డ్ సింగిల్ `హల్లల్ల ల్లో` మాస్ బీట్ యువతను పిచ్చెక్కించేలా ఉందని ప్రశంసించారు. రెహమాన్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకు అతిపెద్ద పిల్లర్ అని పేర్కొంటూనే.. సినిమాటోగ్రాఫర్ రత్నవేలు విజువల్స్, ఫైట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వంలో వచ్చిన రా అండ్ రస్టిక్ యాక్షన్ సీక్వెన్సులు వెండితెరపై ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తాయని... టెక్నికల్‌గా `పెద్ది` ఇండియన్ సినిమాలో అత్యున్నత ప్రమాణాలతో నిలుస్తుందని చరణ్ స్పష్టం చేశారు.

మరోవైపు భోపాల్ నగరానికి తాను వస్తున్నానని తెలిసి ఇక్కడ స్థిరపడిన తెలుగు ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చి చూపిస్తున్న ఆదరాభిమానాలకు రామ్ చరణ్ ఎంతో ముగ్ధులయ్యారు. మాతృభూమికి దూరంగా ఉన్నా.. తెలుగు సినిమాను తనను గుండెల్లో పెట్టుకుని ఇంత పెద్ద ఎత్తున స్వాగతం పలికిన భోపాల్‌ తెలుగు అసోసియేషన్ సభ్యులకు, స్థానిక తెలుగు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గతంలో `ఆర్ఆర్ఆర్` చిత్రానికి ఇక్కడి ప్రజలు అందించిన అపూర్వమైన ప్రేమను గుర్తుచేసుకుంటూ.. `పెద్ది` చిత్రంతో ఆ ప్రేమను వందరెట్లు తిరిగి అందిస్తానని చరణ్ ఆత్మీయంగా చెప్పారు.

ఈ మెగా ఈవెంట్‌ను భోపాల్‌లో ఇంత భారీ స్థాయిలో .. అత్యంత సురక్షితంగా నిర్వహించడానికి సహకరించిన మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కి రామ్ చరణ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే క్రీడలు, కుస్తీ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఈవెంట్‌కు అన్ని విధాలా అండగా నిలిచిన మధ్యప్రదేశ్ క్రీడల - యువజన సంక్షేమ శాఖ మంత్రికి కృతజ్ఞతలు వ్యక్తంచేశారు. స్థానిక ప్రభుత్వం, యంత్రాంగం అందించిన సపోర్ట్ వల్లే భోపాల్ చరిత్రలోనే ఇదొక బిగ్గెస్ట్ ప్రమోషనల్ ఈవెంట్‌గా రికార్డు సృష్టించిందని రామ్ చ‌ర‌ణ్‌ కొనియాడారు.