Begin typing your search above and press return to search.

జాన్వీ ఎఫెక్ట్.. ఇక ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే..

పెద్దిలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ రోల్ పై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ప్రేక్షకులు ఆ పాత్రను కేవలం గ్లామర్ యాంగిల్ లోనే డిజైన్ చేశారని విమర్శించారు.

By:  M Prashanth   |   23 July 2026 1:00 AM IST
జాన్వీ ఎఫెక్ట్.. ఇక ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే..
X

టాలీవుడ్‌ లో హీరోయిన్ల రోల్స్ పై మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్ల పాత్రలు ఎక్కువగా పాటలు, గ్లామర్‌ సీన్స్ ను పరిమితమయ్యేవి. కానీ ఇప్పుడు ప్రేక్షకుల టేస్ట్ మారుతోంది. కథలో భాగమైన, ఎమోషన్స్ ఉన్న, యాక్టింగ్ కు అవకాశం ఇచ్చే పాత్రల్లో హీరోయిన్లను చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు. ఇటీవల పెద్ది సినిమాలో జాన్వీ కపూర్ పాత్రపై వచ్చిన విమర్శల నేపథ్యంలో ఆ అంశంపై చర్చ మరింత పెరిగింది.

పెద్దిలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చియమ్మ రోల్ పై సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది ప్రేక్షకులు ఆ పాత్రను కేవలం గ్లామర్ యాంగిల్ లోనే డిజైన్ చేశారని విమర్శించారు. దీంతో తెలుగు సినిమాల్లో హీరోయిన్ల క్యారెక్టరైజేషన్ ఎలా ఉండాలి? అనే చర్చ మరోసారి తెరపైకి వచ్చింది. అయితే ఇదే సమయంలో విడుదలైన కొన్ని సినిమాలు మాత్రం హీరోయిన్ల పాత్రలకు సరైన ప్రాధాన్యం ఇస్తే ప్రేక్షకులు ఎలా ఆదరిస్తారో చూపించాయి.

హీరోయిన్లు కేవలం హీరోకు జోడీగా కాకుండా.. కథను ముందుకు నడిపించే కీలక పాత్రల్లో కనిపిస్తే సినిమాకు ప్రత్యేక గుర్తింపు వస్తుందని ఆ చిత్రాలు నిరూపించాయి. ముఖ్యంగా సమంత నటించిన మా ఇంటి బంగారం సినిమా ఇందుకు ఉదాహరణగా నిలిచింది. ఆ చిత్రంలో సమంత ఒక సాధారణ మహిళ జీవితంలోని ఎమోషన్స్, కుటుంబ బాధ్యతలు, ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే పాత్రలో కనిపించింది. తన నటనతో రోల్ కు మరింత బలం తీసుకొచ్చింది.

స్టార్ హీరోయిన్ అనే ఇమేజ్‌ ను పక్కన పెట్టి, కథకు అవసరమైన పాత్రలో నటించడం వల్ల ఆ సినిమాకు మంచి రెస్పాన్స్ లభించింది. అలాగే అఖిల్ అక్కినేని సరసన భాగ్యశ్రీ బోర్సే నటించిన లెనిన్ కూడా హీరోయిన్ పాత్ర విషయంలో ప్రత్యేకంగా నిలిచింది. ఇందులో ఆమె పోషించిన భారతి పాత్ర కేవలం అందం చూపించే క్యారెక్టర్‌ గా కాకుండా.. సొంత ఆలోచనలు, నిర్ణయాలు ఉన్న యువతిగా సాగింది. కథలో ఆమె పాత్రకు ఉన్న ప్రాధాన్యం, నటనకు అవకాశం ఉండటం వల్ల భాగ్యశ్రీకి మంచి గుర్తింపు వచ్చింది.

ఇక ప్రస్తుతం ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్న మరో చిత్రం చెన్నై లవ్ స్టోరీ. బేబీ సినిమా తర్వాత అదే టీమ్ నుంచి వస్తున్న ఆ మూవీలో శ్రీ గౌరీ ప్రియ కీలక పాత్రలో కనిపించనుంది. ఆమె పాత్ర కేవలం గ్లామర్‌ కే పరిమితం కాకుండా, ఎమోషన్స్, న్యాచురల్ యాక్టింగ్ కు ప్రాధాన్యం ఇచ్చేలా ఉంటుందని ప్రచారం జరుగుతోంది. జాన్వీ ఎఫెక్ట్ తో హీరోయిన్ల పాత్రలపై చర్చ మొదలైనప్పటికీ, అసలు మార్పు మాత్రం ప్రేక్షకుల టేస్ట్ లో కనిపిస్తోంది.

ఇప్పుడు ప్రేక్షకులు హీరోను మాత్రమే కాకుండా, కథలో ప్రతి పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ ను గమనిస్తున్నారు. స్ట్రాంగ్ క్యారెక్టర్లు ఉంటే హీరోయిన్ల సినిమాలను సక్సెస్ చేస్తున్నారు. ఇదే ట్రెండ్ టాలీవుడ్‌ లో కొనసాగితే ఫ్యూచర్ లో హీరోయిన్ల కోసం స్పెషల్ గా రాసే పాత్రలు మరింత పెరిగే అవకాశం ఉంది. గ్లామర్‌ కంటే కథ, యాక్టింగ్, పాత్రకు ఇంపార్టెన్స్ ఇచ్చే సినిమాలు ఎక్కువగా వస్తే తెలుగు సినిమా స్టోరీల్లో మరో కొత్త మార్పు కనిపించడం ఖాయం.