'పెద్ది' వల్ల ఇంకా ఎన్ని ఎఫెక్ట్ కావాలి?
రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా రూపొందుతున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి.
By: Ramesh Palla | 17 April 2026 11:19 AM ISTరామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్‌గా రూపొందుతున్న 'పెద్ది' సినిమాపై అంచనాలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. సాధారణంగా సినిమా ఆలస్యం అవుతున్న కొద్ది అంచనాలు తగ్గుతాయి అంటారు. కానీ పెద్ది విషయంలో అది రివర్స్‌లో ఉంది. దర్శకుడు బుచ్చిబాబు ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ కోసం, స్క్రిప్ట్ వర్క్ కోసం దాదాపుగా ఏడాది టైం తీసుకున్నాడు. అయినా కూడా షూటింగ్ ఆలస్యం అయింది. పైగా రామ్ చరణ్‌కి గాయం, ఇతర వ్యక్తిగత విషయాల కారణంగా సినిమా ఆలస్యం అవుతూ వచ్చింది. షూటింగ్ దాదాపుగా పూర్తి అయినప్పటికీ వీఎఫ్‌ఎక్స్ వర్క్ విషయంలో దర్శకుడు, యూనిట్ సభ్యులు ఎక్కడా రాజీ పడటం లేదట. అందుకే సినిమా విడుదల వాయిదా పడ్డా పర్వాలేదు కానీ క్వాలిటీ బెస్ట్‌గా ఉండాలని, ప్రేక్షకులకు అద్భుతమైన విజువల్ వండర్‌ను ఇవ్వాలనే పట్టుదలతో దర్శకుడు బుచ్చిబాబు ఉన్నాడని ఆయన సన్నిహితులు అంటున్నారు.
పెద్ది సినిమా విడుదల వాయిదా...
ఈ ఏడాది మార్చిలో విడుదల చేయాలని భావించిన పెద్ది సినిమాను మొదటి సారి వాయిదా వేశారు. ఆ సమయంలో పవన్ కళ్యాణ్ సినిమాను విడుదల చేయడం జరిగింది. మార్చి చివరి వారంలో విడుదల కావాలి అనుకున్న సినిమాలు పెద్ది కారణంగా వాయిదా పడ్డాయి. కానీ పెద్ది వాయిదా పడ్డా కూడా ఆ సినిమాలను విడుదల చేయలేక పోయారు. మీడియం రేంజ్ హీరోల సినిమాలు కొన్ని పెద్ది సినిమాకు రెండు వారాల ముందు కానీ, రెండు వారాల తర్వాత కానీ రావాలి అనుకోవడంతో చాలా సినిమాలను వాయిదా వేయాల్సి వచ్చింది. ఇప్పుడు పెద్ది సినిమాను మరోసారి వాయిదా వేయడం జరిగింది. ఈసారి రెండు నెలల గ్యాప్ తీసుకోవాలని దర్శకుడు ప్లాన్ చేశాడు. దాంతో ఏప్రిల్ చివర్లో రావాలి అనుకున్న సినిమాలన్నీ పెద్ది కారణంగా వాయిదా పడ్డాయి. వాటి వర్క్‌ను మెల్లగా నడిపిస్తున్నారు. ఇప్పుడు పెద్ది వాయిదా పడ్డ అవి వచ్చే పరిస్థితి లేదు.
రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబో...
పెద్ది సినిమాను ఈనెల 30న విడుదల చేయాలని నిర్ణయించారు. కానీ పరిస్థితులు అనుకూలించని కారణంగా వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త తేదీని దర్శకుడు, నిర్మాతలు ప్రకటించలేదు. దాంతో ఇప్పుడు తమ సినిమాలను ఎప్పుడు విడుదల చేసుకోవాలి అనే విషయం తెలియక చాలా సినిమాల విడుదల తేదీల విషయంలో కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతోంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమాకు పెద్ది ఎఫెక్ట్ తప్పదనే వార్తలు వస్తున్నాయి. గత రెండేళ్లుగా అదుగో ఇదుగో అంటూ వాయిదా వేస్తూ వస్తున్న విశ్వంభర సినిమాను జూన్‌లో విడుదల చేయాలని భావించారు. కానీ పెద్ది సినిమా వస్తే కచ్చితంగా విశ్వంభర సినిమాను మరో రెండు నెలల పాటు వాయిదా వేయాల్సి రావచ్చు. ఇలా చాలా సినిమాలు సైతం పెద్ది కారణంగా వాయిదా పడే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.
జాన్వీ కపూర్ హీరోయిన్...
పెద్ద హీరోల సినిమాల విడుదల విషయంలో క్లారిటీ లేకుంటే ఇలాగే జరుగుతుందని, చిన్న సినిమాలు, మీడియం రేంజ్ హీరోల సినిమాల విడుదల గందరగోళంలో పడుతుందని గతంలో పలు సార్లు నిరూపితం అయ్యింది. అయినా కూడా పెద్ది మేకర్స్ ఒక ప్లానింగ్ లేకుండా చాలా సినిమాలను ఎఫెక్ట్ చేస్తున్నారు అంటూ ఇండస్ట్రీలో కొందరు ఆఫ్ ది రికార్డ్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. రామ్ చరణ్ సినిమా అంటే సహజంగానే అంచనాలు భారీగా ఉంటాయి. పైగా ఉప్పెన వంటి సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక జాన్వీ కపూర్ ఈ సినిమాలో చరణ్ కి జోడీగా నటించిన కారణంగా మరింత అంచనాలు పెరిగాయి. ఇప్పటికే విడుదలైన పాటలు సైతం సినిమాపై అంచనాలు పెంచాయి. అందుకే సినిమాను అభిమానులతో పాటు, అందరూ ఎప్పుడు ఎప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు.
