Begin typing your search above and press return to search.

2026 టాప్ సీట్.. చరణ్ దగ్గరే ఉండిపోయేలా ఉందే..

కానీ టాప్ స్థానానికి వెళ్లాలంటే చైతూ మార్కెట్ ఇప్పటివరకు చూడని స్థాయిలో పెరగాలి. వృషకర్మ టాప్ 5లోకి రావడం ఒక టార్గెట్ అయితే, పెద్ది దాటడం మాత్రం చాలా పెద్ద టాస్క్.

By:  M Prashanth   |   29 Sept 2026 9:00 PM IST
2026 టాప్ సీట్.. చరణ్ దగ్గరే ఉండిపోయేలా ఉందే..
X

2026 ముగియడానికి ఇంకా మూడు నెలలు ఉన్నాయి. కానీ తెలుగు బాక్సాఫీస్‌లో నెంబర్ వన్ స్థానానికి రామ్ చరణ్ ‘పెద్ది’ ఇప్పటికైతే మిగతా సినిమాల కంటే ముందే ఉంది. ట్రేడ్ వర్గాల ప్రకారం సినిమా వరల్డ్‌వైడ్‌గా సుమారు రూ.335 నుంచి 342 కోట్ల మధ్య గ్రాస్ చేసింది. ‘మన శంకర వరప్రసాద్ గారు’ రూ.300 కోట్ల మార్క్ దాటినా, పెద్ది ముందు ఇంకా గ్యాప్ ఉంది. ఇప్పుడు చివరి మూడు నెలల్లో ఆ నంబర్‌ను ఎవరు టచ్ చేస్తారన్నదే అసలు ఇంట్రెస్ట్.

ప్రస్తుత లిస్ట్ చూస్తే రెండో స్థానంలో ‘మన శంకర వరప్రసాద్ గారు’, తర్వాత ‘ఇరుముడి’ రూ.240 కోట్లకు పైగా, ‘ది రాజా సాబ్’ రూ.200 కోట్లకు పైగా ఉన్నాయి. ‘ది ప్యారడైజ్’ నాలుగు రోజుల్లోనే పెద్ద గ్రాస్ తెచ్చుకున్నా, వీక్‌డే ట్రెండ్ బట్టి అది ఐదో స్థానం దగ్గర సెటిల్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. అంటే టాప్ 5లో ఎక్కువ భాగం ఇప్పటికే ఒక షేప్‌కు వచ్చేసింది.

చరణ్‌కు ఇప్పుడు పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే, 2026లో రావాల్సిన రెండు భారీ సినిమాలు రేసు నుంచి దాదాపు బయటపడ్డాయి. డిసెంబర్ 3న రావాల్సిన ప్రభాస్ ‘ఫౌజీ’ వాయిదా పడింది. కొత్త రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు. చిరంజీవి ‘విశ్వంభర’ కూడా ఈ ఏడాది వస్తుందనే పక్కా క్లారిటీ లేకుండా పెండింగ్‌లో ఉంది. ఈ రెండు సినిమాలు సైడ్ కావడంతో పెద్ది టాప్ స్థానంపై ఒత్తిడి తగ్గిపోయింది.

అయితే రేసు పూర్తిగా ముగిసిపోయిందని చెప్పలేం. విజయ్ దేవరకొండ ‘రణబాలి’ అక్టోబర్ 16న వస్తోంది. రష్మిక మందన్న హీరోయిన్‌గా, రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో వస్తున్న ఈ పీరియడ్ యాక్షన్ డ్రామాపై మంచి అంచనాలు ఉన్నాయి. కానీ పెద్ది నంబర్‌ను దాటాలంటే విజయ్ కెరీర్‌లోనే భారీ బాక్సాఫీస్ జంప్ కావాలి. మంచి ఓపెనింగ్ ఒక్కటే సరిపోదు. ఇండియా, ఓవర్సీస్ రెండింట్లోనూ లాంగ్ రన్ అవసరం.

డిసెంబర్ 4న నాగచైతన్య ‘వృషకర్మ’ కూడా ఉంది. ‘విరూపాక్ష’ తర్వాత కార్తీక్ దండు చేస్తున్న అడ్వెంచర్ ఫాంటసీ కావడంతో ఈ సినిమాపై కూడా క్యూరియాసిటీ ఉంది. సుకుమార్ రైటింగ్స్, బీవీఎస్‌ఎన్ ప్రసాద్ కలిసి నిర్మిస్తున్నారు. కానీ టాప్ స్థానానికి వెళ్లాలంటే చైతూ మార్కెట్ ఇప్పటివరకు చూడని స్థాయిలో పెరగాలి. వృషకర్మ టాప్ 5లోకి రావడం ఒక టార్గెట్ అయితే, పెద్ది దాటడం మాత్రం చాలా పెద్ద టాస్క్.

2026 తెలుగు సినిమాల టాప్ 5 వరల్డ్‌వైడ్ గ్రాస్ (అంచనా)

పెద్ది: రూ.335-342 కోట్లు

మన శంకర వరప్రసాద్ గారు: రూ.300 కోట్లకు పైగా

ఇరుముడి: రూ.240 కోట్లకు పైగా

ది రాజా సాబ్: రూ.200 కోట్లకు పైగా

ది ప్యారడైజ్: ఇప్పటివరకు రూ.155 కోట్లకు పైగా

ప్రస్తుతం 2026 బాక్సాఫీస్ టాప్ ప్లేస్ అంటే చరణ్ ఒక్కడే కనిపిస్తున్నాడు. అయితే పెట్టుబడి పరంగా భారీ లాభాలు తెచ్చిన సినిమా మాత్రం కాదు. అత్యధిక వరల్డ్‌వైడ్ గ్రాస్ అనే ఒక్క లిస్టులో మాత్రమే. ఈ ఏడాది ఇరుముడి అత్యధిక ప్రాఫిట్స్ ఇచ్చిన సినిమాల్లో టాప్ లిస్టులో ఉంది. మిగిలిన మూడు నెలల్లో రణబాలి, వృషకర్మ ఏ స్థాయికి వెళ్తాయన్నది చూడాలి. పెద్ది పెట్టిన 330 కోట్లకు పైగా మార్క్ దాటాలంటే వాటిలో ఏదో ఒకటి హీరోల కెరీర్ బెస్ట్ రన్ ఇవ్వాల్సిందే.