మాస్టర్స్ సరసన బుచ్చిబాబుకో చైర్!
ప్రస్తుతం ఎక్కడ చూసినా జూన్ నెలలో విడుదల కాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం `పెద్ది` గురించే చర్చ జరుగుతోంది.
By: Srikanth Kontham | 23 May 2026 11:00 PM ISTప్రస్తుతం ఎక్కడ చూసినా జూన్ నెలలో విడుదల కాబోతున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా చిత్రం `పెద్ది` గురించే చర్చ జరుగుతోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కథానాయకుడిగా రూరల్ స్పోర్ట్స్ డ్రామా బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు బుచ్చిబాబు సానా చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు. `ఉప్పెన` వంటి సెన్సేషనల్ డెబ్యూ తర్వాత బుచ్చిబాబు చేస్తున్న రెండో సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందనే అంశంపై చిత్ర పరిశ్రమతో పాటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. `పెద్ది` చిత్రం బాక్సాఫీస్ వద్ద 1000 కోట్ల భారీ వసూళ్లను టార్గెట్ చేసినట్లు తెలుస్తోంది.
ఒక సినిమా అనుభవం ఉన్న ఓ యువ దర్శకుడి ప్రాజెక్ట్‌పై ఈ స్థాయి కలెక్షన్ల అంచనాలు ఉండటం సాధారణ విషయం కాదు. ఈ చిత్రం గనుక ట్రేడ్ అంచనాలను నిజం చేస్తూ ఆ మ్యాజికల్ ఫిగర్‌ను గనుక అందుకుంటే? అది ఇండియన్ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డుగా నిలిచిపోతుంది. సోలోగా రామ్ చరణ్ మార్కెట్ స్టామినాను నిరూపించడంతో పాటు బుచ్చిబాబును ఒకే రాత్రితో మోస్ట్ డిమాండింగ్ డైరెక్టర్‌గా మార్చేయగలదు. ఈ స్థాయి భారీ విజయం సాధిస్తే? బుచ్చిబాబు గురువు, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ హోదాను సముచితంగా అందుకున్నట్లే అవుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. సుకుమార్ దగ్గర అసోసియేట్‌గా పనిచేసిన ఆయన స్క్రీన్ ప్లే శైలిని ఒంటబట్టించుకున్న బుచ్చిబాబు `పుష్ప` చిత్రంతో సుకుమార్ సృష్టించిన పాన్-ఇండియా ఇంపాక్ట్‌ను `పెద్ది`తో రిపీట్ చేయాలని చూస్తున్నారు.
1000 కోట్ల మార్క్‌ను అందుకోవడం ద్వారా గురువు గర్వపడేలా చేయడమే కాకుండా ఎమోషన్లను కమర్షియల్ హంగులతో ఎలా పండించాలో తెలిసిన సమర్థుడిగా గురువుకు తగ్గ శిష్యుడిగా గుర్తింపు సాధ్యమవుతుంది.
ఈ మెగా సక్సెస్ బుచ్చిబాబును భారతీయ చలనచిత్ర రంగాన్ని శాసిస్తున్న టాప్ లీగ్ దర్శకుల పక్కన కూర్చోబెడుతుంది. టాలీవుడ్ జెండాను ప్రపంచవ్యాప్తంగా ఎగురవేసిన రాజమౌళి ,మాస్ యాక్షన్‌కు కేరాఫ్ అడ్రస్‌గా మారిన ప్రశాంత్ నీల్ , ఇంటెన్సిటీతో బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సందీప్ రెడ్డి వంగ ల సరసన బుచ్చిబాబు పేరు కూడా మారుమోగిపోతుంది. వందల కోట్ల మార్కెట్‌ను సులువుగా హ్యాండిల్ చేయగల సత్తా ఉన్న అగ్ర దర్శకుల క్లబ్‌లో బుచ్చి సగర్వంగా అడుగుపెడతారు.
టాలీవుడ్‌లో చాలా మంది దర్శకులు ఎదుర్కొనే సెకండ్ ఫిలిం సిండ్రోమ్ (రెండో సినిమా ఫ్లాప్ అవుతుందనే సెంటిమెంట్) ను బ్రేక్ చేయడానికి కూడా ఈ విజయం బుచ్చిబాబుకు ఎంతో అవసరం. మొదటి సినిమా `ఉప్పెన`తో వంద కోట్లు సాధించిన ఆయన రెండో సినిమాతో ఏకంగా 1000 కోట్ల క్లబ్‌ను టార్గెట్ చేయడం పెద్ద సాహసమే. ఈ సాహసం గనుక పక్కాగా వర్కవుట్ అయితే నేటి తరం యంగ్ డైరెక్టర్లలో ఆయన రేంజ్ ఎవరికీ అందనంత ఎత్తుకు చేరుకుంటుంది. కథలోని ప్రాంతీయ నేటివిటీని కోల్పోకుండానే గ్లోబల్ వైడ్ ఆడియన్స్‌ను ఎలా మెప్పించవచ్చో బుచ్చిబాబు మరోసారి నిరూపించినట్లవుతుంది.
