పబ్లిక్ వేదికపై హీరోయిన్ నడుము గిల్లాడు
వేలాదిగా ప్రజలు గుమి గూడిన చోట, వేదికపైనే ఒక హీరోయిన్ నడుమును గిల్లడమే గాక, ఆ నడుము చుట్టూ చెయ్యి వేస్తూ పరాచికం ఆడాడు.
By: Sivaji Kontham | 28 Aug 2025 9:38 PM ISTవేలాదిగా ప్రజలు గుమి గూడిన చోట, వేదికపైనే ఒక హీరోయిన్ నడుమును గిల్లడమే గాక, ఆ నడుము చుట్టూ చెయ్యి వేస్తూ పరాచికం ఆడాడు. అతడు భోజ్ పురిలో ప్రముఖ హీరో. పేరు పవన్ సింగ్. టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కి ఉన్నంత పేరు అతడికి భోజ్ పురిలో ఉంది. అయితే అతడు తన స్టార్ పవర్ ని దుర్వినియోగం చేస్తూ నటి అంజలి నడుముపై చెయ్యి వేసాడు. యూపీ లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో అతడు నడుము మడతపై సుతారంగా తాకుతూ ఏదో మాట్లాడాడు. అతడి వెకిలి చేష్టలకు నటి అంజలికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. సదరు నటీమణి అసౌకర్యంగా ఫీలవుతూనే హీరోని సముదాయించింది.
అయితే ఈ దృశ్యాన్ని లైవ్ లో చూసిన ప్రజలు మాత్రం హీరో పవన్ సింగ్ వెకిలి వేషాలను ఖండించారు. అతడు అలా చేయడం తగదని సూచించారు. పబ్లిక్ వేదికపైనే మహిళతో అతడు ఇలా ప్రవర్తిస్తే, ఏకాంతంలో ఇంకేం చేస్తాడో! అంటూ కొందరు తీవ్రంగా విరుచుకుపడ్డారు. అతడు ఆమెకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలని నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు. అయితే పవన్ సింగ్ కి వివాదాలు కొత్తేమీ కాదు. గతంలో ప్రముఖ కథానాయిక తనపై సోషల్ మీడియాల్లో పవన్ సింగ్ తప్పుడు కామెంట్లు పోస్ట్ చేస్తున్నాడంటూ ఫిర్యాదు చేసిన ఘటన సంచలనం సృష్టించింది. ఇప్పుడు హీరోయిన్ అంజలి నడుముపై చెయ్యి వేయడం తీవ్ర విమర్శలకు తావిస్తోంది.
టాలీవుడ్ నుంచి మాలీవుడ్ వరకూ ఇటీవల షీ-టీమ్స్ పని చేస్తున్నాయి. మహిళలకు అసౌకర్యం కలిగించేలా లేదా వేధింపులకు పాల్పడినా వెంటనే మహిళా క్రమశిక్షణా కమిటీలు యాక్టివ్ అయిపోతున్నాయి. నిర్మాతల మండలి- ఫిలింఛాంబర్ పరిధిలో మహిళా స్క్వాడ్స్ జాగ్రత్తగానే పని చేస్తున్నాయి. అయితే భోజ్ పురి పరిశ్రమ చాలా చిన్నది. అక్కడ ఈ తరహా వ్యవహారాలపై నియంత్రణ కోసం కమిటీలు ఉన్నట్టు లేదు. పవన్ సింగ్ ఇటీవలి కాలంలో స్టార్ డమ్ ని విస్తరిస్తూ వేగంగా ఎదుగుతున్నాడు. అతడు బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ తో కలిసి ఓ సింగిల్ ఆల్బమ్ లో కూడా నటించాడు. హిందీ చిత్రసీమలోను ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి సమయంలో అతడు ఇలాంటి వేషాలతో దొరికిపోతే కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా హెచ్చరిస్తున్నారు.
