ఉస్తాద్ లో 'వింటేజ్' పవన్ కాదు.. 'వోల్టేజ్' పవన్!
ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా కూడా అదే దారిలో ఉంటుందని అభిమానులు భావించారు.
By: M Prashanth | 17 March 2026 2:16 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా ఆయన కొత్త సినిమా వస్తుందంటే చాలు.. అందులో వింటేజ్ పవన్ కళ్యాణ్ కనిపిస్తారా అనే చర్చ ఎక్కువగా జరుగుతుంటుంది. ఇటీవల టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోలను దర్శకులు వారి వింటేజ్ స్టైల్ లో చూపిస్తామని హామీ ఇస్తున్న నేపథ్యంలో, అదే అంచనా ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ పై కూడా నెలకొంది.
ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ గారులో చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపిస్తారని ముందే డైరెక్టర్ చెప్పారు. అలాగే చూపించారు కూడా. ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ రూపొందిస్తున్న కొత్త సినిమాలో వెంకటేష్ ను వింటేజ్ స్టైల్ లోనే చూపిస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సినిమా కూడా అదే దారిలో ఉంటుందని అభిమానులు భావించారు.
కానీ దర్శకుడు హరీష్ శంకర్ మాత్రం ఆ అంచనాలకు భిన్నంగా స్పందించారు. "మేం వింటేజ్ పవన్ కళ్యాణ్ ను చూపించలేదు. మా సినిమాలో కనిపించేది వోల్టేజ్ పవన్ కళ్యాణ్" అని స్పష్టం చేశారు. ఆ కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందరినీ ఆకట్టుకుంటోంది. దీంతో వోల్టేజ్ పవన్ కళ్యాణ్ అంటే ఏమిటనే ప్రశ్న కూడా అభిమానుల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
సాధారణంగా వింటేజ్ అంటే హీరో పాత స్టైల్, పాత మేనరిజమ్స్, పాత ఎనర్జీని గుర్తుకు తెచ్చేలా ఉండడం. కానీ హరీష్ శంకర్ చెప్పిన వోల్టేజ్ అనే పదం చూస్తే, ఇందులో పవన్ కళ్యాణ్ ను మరింత పవర్ ఫుల్ గా, ఎనర్జిటిక్ గా, హై ఇంటెన్సిటీతో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు అర్థమవుతోంది. ఇప్పటికే హరీష్- పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ ఎంత పెద్ద విజయాన్ని సాధించిందో తెలిసిందే.
ఆ సినిమాతో పవన్ కళ్యాణ్ కు మాస్ ఇమేజ్ మరింత బలపడిందని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ఇప్పుడు అదే కాంబినేషన్ రిపీట్ అవ్వడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు కూడా అదే స్థాయిలో ఉన్నాయి. హరీష్ శంకర్ మాటలు చూస్తుంటే, ఈసారి ఆయన పాత ఫార్ములాను రిపీట్ చేయకుండా, పవన్ కళ్యాణ్ ను కొత్త యాంగిల్ లో చూపించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది.
అంటే అభిమానులు కోరుకునే మాస్ ఎలిమెంట్స్ తో పాటు, మరింత హై ఎనర్జీ, యాక్షన్, స్టైల్ ను కలిపి ప్రజెంట్ చేసే అవకాశం ఉంది. మొత్తానికి వింటేజ్ అనే పదానికి బదులుగా వోల్టేజ్ అనే కొత్త ట్యాగ్ ను తీసుకురావడం ద్వారా సినిమాపై బజ్ ను మరింత పెంచారు హరీష్ శంకర్. ఇప్పుడు అభిమానులందరూ మూవీలో పవన్ కళ్యాణ్ ను ఏ రేంజ్ లో డైరెక్టర్ చూపిస్తారోనని డిస్కస్ చేసుకుంటున్నారు.
