ఆ ఫోటోలో పవన్ కళ్యాణ్‌తో ఉన్నది నేను కాదు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి.. ముఖ్యంగా ఆయన మూడవ భార్య అన్నా లెజినోవా గురించి సోషల్ మీడియాలో నిరంతరం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది.
By: Sivaji Kontham | 16 April 2026 10:31 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి.. ముఖ్యంగా ఆయన మూడవ భార్య అన్నా లెజినోవా గురించి సోషల్ మీడియాలో నిరంతరం ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. అయితే గత దశాబ్ద కాలంగా ఒక ఫోటో విషయంలో నెటిజన్లలో ఉన్న అతిపెద్ద అపోహ ఇప్పుడు వీడిపోయింది. `తీన్ మార్` సినిమా షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ పక్కన ఒక విదేశీ భామ కూర్చుని ఉన్న ఫోటో ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్ అయ్యింది. ఆ ఫోటోలో ఉన్నది అన్నా లెజినోవా అని.. అక్కడే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అందరూ భావించారు. కానీ వాస్తవం ఏమిటంటే ఆ ఫోటోలో ఉన్నది అన్నా లెజినోవా కాదు.
చాలా కాలంగా అన్నా లెజినోవాగా ప్రచారంలో ఉన్న ఆ విదేశీ బ్యూటీ అసలు పేరు డానా మార్క్స్. `తీన్ మార్` చిత్రంలోని ఒక పాటలో పవన్ కళ్యాణ్ పక్కన డానా మార్క్స్ ప్రధానంగా కనిపిస్తారు. అయితే అదే పాటలో అన్నా లెజినోవా కూడా ఒక చిన్న పాత్రలో నటించడం విశేషం. కేవలం ఇద్దరూ విదేశీయులు కావడం.. ఒకే సినిమాలో నటించడంతో ఫోటోలో ఉన్నది అన్నాయే అని మీడియాలో .. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరిగిపోయింది. తాజాగా స్వయంగా అన్నా లెజినోవా స్పందిస్తూ.. ఆ ఫోటోలో ఉన్నది తాను కాదని ఖండించడంతో ఈ వివాదానికి తెరపడింది.
అన్నా లెజినోవా రష్యాకు చెందిన మోడల్ కం నటి.`'తీన్ మార్` సినిమా షూటింగ్ సమయంలోనే పవన్‌తో పరిచయం ఏర్పడటం.. అది ప్రేమగా మారి 2013లో వివాహానికి దారితీయడం నిజమే అయినా వైరల్ అయిన ఫోటో మాత్రం ఆమెది కాకపోవడం గమనార్హం. రష్యా మూలాలు ఉన్నా అన్నా లెజినోవా భారతీయ సంప్రదాయాలను, హిందూ ధర్మాన్ని ఎంతగానో గౌరవిస్తారు. పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రస్థానంలో తను ఒక నిశ్శబ్ద పోరాట యోధురాలిగా నిలిచారు. ఎన్నికల సమయంలో పవన్ విజయం కోసం అన్నా ప్రత్యేక పూజలు నిర్వహించిన తీరు అభిమానులను ఆకట్టుకుంది.
గ్లామర్ ప్రపంచానికి చెందిన వారైనా అన్నా లెజినోవా మీడియా హడావిడికి చాలా దూరంగా ఉండటానికి ఇష్టపడతారు. సాదాసీదా జీవనశైలి.. పద్ధతిగా చీరకట్టులో కనిపించే తీరు తనపై గౌరవాన్ని పెంచుతాయి. తన ఇద్దరు పిల్లలైన పోలెనా అంజనా పవనోవా.. మార్క్ శంకర్ పవనోవిచ్‌ల పెంపకంలో కూడా భారతీయ- రష్యన్ సంస్కృతుల కలయికను పాటిస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న సమయంలో కుటుంబ బాధ్యతలను భుజాన వేసుకుని ఆయనకు మానసిక ప్రశాంతతను అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
ఇంటర్నెట్‌లో కనిపించే ప్రతి సమాచారం నిజం కాదని ఈ అన్నా లెజినోవా ఫోటో వ్యవహారం మరోసారి నిరూపించింది. ఏళ్ల తరబడి ఒక తప్పుడు ఫోటోను అన్నా లెజినోవా పేరుతో వైరల్ చేసినా తను మాత్రం తన పని తాను చేసుకుంటూ నిశ్శబ్దంగానే ఉన్నారు. ఇప్పుడు అసలు విషయం బయటకు రావడంతో పవన్ అభిమానులు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. సెలబ్రిటీల వ్యక్తిగత ఫోటోల విషయంలో క్లారిటీ లేకుండా ప్రచారం చేయడం వల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుతుంటాయి అనడానికి ఇది ఒక చక్కని ఉదాహరణ.
