నాని 'ప్యారడైజ్' స్టేజ్‌పై వకీల్ సాబ్ జ్ఞాపకం..!
నాని నటించిన 'ది ప్యారడైజ్' మూవీ విడుదలకు సిద్ధం అయింది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది.
By: Ramesh Palla | 22 Sept 2026 12:24 PM ISTనాని నటించిన 'ది ప్యారడైజ్' మూవీ విడుదలకు సిద్ధం అయింది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ వైభవంగా జరిగింది. వేలాది మంది నాని ఫ్యాన్స్ హాజరు అయిన ది ప్యారడైజ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. నానితో పాటు చిత్ర యూనిట్ సభ్యులు, ఇండస్ట్రీ వర్గాల వారు ప్రముఖులు ఈ సినిమా వేడుకలో పాల్గొన్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ సినిమా ఈవెంట్‌లో గెస్ట్‌గా పాల్గొని తన శుభాకాంక్షలు అందజేశాడు. అంతే కాకుండా ఈ సినిమాను ఒక ఏరియాలో డిస్ట్రిబ్యూట్ చేయబోతున్నట్లుగానూ ప్రకటించాడు. ఈ సినిమా గురించి మాట్లాడిన సమయంలో దిల్‌రాజు తన వకీల్ సాబ్ సినిమా రోజులను గుర్తు చేసుకున్నాడు. సినిమా ఇండస్ట్రీలో తన 25 ఏళ్ల ప్రస్థానం లో కొన్ని సంఘటనలు గుర్తుండి పోతాయని, వాటిల్లో వకీల్ సాబ్ విషయం ఒకటని దిల్ రాజు చెప్పుకొచ్చాడు.
వకీల్ సాబ్ సినిమాతో పవన్ కళ్యాణ్...
దిల్ రాజు మాట్లాడుతూ... పవన్ కళ్యాణ్ కు తాను ఎంత పెద్ద ఫ్యాన్ అనే విషయం మీ అందరికీ తెలుసు. ఆయనతో సినిమా తీయాలనే కల 'వకీల్ సాబ్'తో నెరవేరింది. ఆ సినిమాకు కోవిడ్ కారణంగా చాలా ఇబ్బందులు ఎదురు అయ్యాయి. అంతే కాకుండా ఏపీలో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం టికెట్ల రేట్ల విషయంలో విధించిన కండీషన్స్ వల్ల కూడా వకీల్ సాబ్ కి తీవ్ర నష్టం వాటిల్లింది. దాంతో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా వసూళ్లు పెద్దగా నమోదు కాలేదు. యావరేజ్ రిజల్ట్‌తో సరిపెట్టుకున్న వకీల్ సాబ్ కారణంగా తాను నష్టపోయిన విషయంను గుర్తు పెట్టుకుని పవన్ కళ్యాణ్ గారు తాను తీసుకోవాల్సిన రూ.5 కోట్ల పారితోషికంను వద్దు అన్నారు. సినిమా విడుదల తర్వాత ఇవ్వాల్సిన మొత్తంను పవన్ కళ్యాణ్ గారు తీసుకోలేదని మరోసారి దిల్ రాజు ది ప్యారడైజ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో గుర్తు చేసుకున్నారు.
దిల్ రాజు నిర్మాణంలో వచ్చిన సినిమా...
పవన్ కళ్యాణ్ కెరీర్‌లో చాలా స్పెషల్ మూవీగా నిలిచిన వకీల్ సాబ్‌తో దిల్ రాజుకు భారీ నష్టాలు అయితే రాలేదు. కానీ థియేట్రికల్ రిలీజ్ సమయంలో ఇబ్బందులు ఎదురు అయ్యాయి. కానీ ఓటీటీ మంచి రేటు చేయడం వల్ల దిల్ రాజు బయట పడ్డాడు అనే టాక్ వచ్చింది. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ కి చెల్లించాల్సిన రూ.5 కోట్లు చెల్లించే అవసరం లేకపోవడంతో దిల్ రాజుకు చాలా పెద్ద ఊరట దక్కినట్లు అయింది. ఒక నిర్మాతకు అయిదు కోట్లు అంటే చాలా పెద్ద విషయం. పవన్ కళ్యాణ్ సైతం ఆ సమయంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి, కేవలం డబ్బు కోసం సినిమా చేస్తున్నాను అన్నాడు. అలాంటి సమయంలోనూ ఏకంగా రూ.5 కోట్ల పారితోషికం వదులుకోవడం అనేది కేవలం పవన్ కళ్యాణ్ కే సాధ్యం అయిందని దిల్ రాజు వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు.
నాని, కయాదు ది ప్యారడైజ్ మూవీ రిలీజ్ డేట్...
ఇక ది ప్యారడైజ్ మూవీ విషయానికి వస్తే.. నాని కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్‌తో రూపొందిన సినిమాగా చెబుతున్నారు. అంతే కాకుండా నాని కెరీర్‌లో మొదటి రూ.100 కోట్ల బిజినెస్ చేసిన సినిమాగానూ ఈ సినిమా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకోబోతుందనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. ఈ మధ్య కాలంలో నాని నుంచి వచ్చిన ప్రతి సినిమా మినిమం గ్యారెంటీ అన్నట్లుగా ఆడుతున్నాయి. కనుక ది ప్యారడైజ్ కి భారీ ఓపెనింగ్స్ నమోదు కావడం ఖాయం. సినిమాకు ఏమాత్రం పాజిటివ్ రెస్పాన్స్ వచ్చినా బాక్సాఫీస్ వద్ద నానికి సరికొత్త నెంబర్స్ నమోదు కావడం ఖాయం. ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఏ సర్టిఫికెట్ దక్కించుకుని ఈనెల 24న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ముందు రోజు అంటే రేపు 23న సాయంత్రం తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రీమియర్ షోలు వేయబోతున్నారు. కయాదు హీరోయిన్‌గా నటించగా కీర్తి సురేష్ కీలకమైన ప్రత్యేక పాటలో కనిపించబోతుంది. మోహన్ బాబు, సంపూర్నేష్ బాబు సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు.
