ఉస్తాద్ తెలుగు రాష్ట్రాల వరకే..!
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
By: Ramesh Palla | 12 March 2026 12:13 PM ISTపవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మార్చి 19న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఉగాది కానుకగా విడుదల కాబోతున్న ఈ సినిమాకు హాలీడేస్ కలిసి వస్తాయనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. రంజాన్, ఉగాదితో పాటు లాంగ్ వీకెండ్ కారణంగా ఉస్తాద్ భగత్‌సింగ్‌కి భారీ ఓపెనింగ్స్ నమోదు కావడం ఖాయం అంటూ బాక్సాఫీస్ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. తాజాగా వచ్చిన సెన్సార్ రిపోర్ట్ సినిమాపై అంచనాలు మరింతగా పెంచిన విషయం తెల్సిందే. మరో రెండు రోజుల్లో ట్రైలర్ విడుదలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఆ వెంటనే భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించబోతున్నారు. ఈ సమయంలో ధురంధర్ 2 సినిమాకు ఈ సినిమా పోటీ అనే ప్రచారం జరుగుతోంది.
ఉస్తాద్ భగత్ సింగ్ వర్సెస్ ధురంధర్ 2
ధురంధర్ సినిమా గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రతి ఒక్క ఇండియన్ చూడాలి అంటూ ధురంధర్ గురించి ప్రచారం జరిగింది. ధురంధర్ సినిమాకు వచ్చిన రెస్పాన్స్ నేపథ్యంలో ఏమాత్రం ఆలస్యం చేయకుండా ధురంధర్ 2 ను బరిలోకి దించబోతున్నారు. మార్చి 19న ధురంధర్ 2 సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈసారి మన సౌత్ ఇండియన్ భాషల్లో కూడా ధురంధర్ 2 సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో చాలా కాలం ముందే ఫిక్స్ అయిన యశ్ టాక్సిక్ మూవీ వాయిదా పడ్డ విషయం తెల్సిందే. అడ్వాన్స్ బుకింగ్ కూడా ప్రారంభం అయిన తర్వాత టాక్సిక్ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా మేకర్స్ ప్రకటించారు. అందుకు కారణం ధురంధర్ 2 అనేది అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు ఒక వారం ఆలస్యంగా రావాల్సిన ఉస్తాద్ ను ముందే ధురంధర్ 2 కి పోటీగా తీసుకు రావడం వెనుక ఉద్దేశం ఏంటంటూ దర్శకుడు హరీష్ శంకర్‌ను పలు ఇంటర్వ్యూల్లో ప్రశ్నిస్తున్నారు.
హరీష్ శంకర్ దర్శకత్వంలో...
తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉస్తాద్ భగత్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ మాట్లాడుతూ... ఆదిత్య ధర్ గొప్ప దర్శకుడు, ఆయన నుంచి వచ్చిన ఉరి : ది సర్జికల్ స్ట్రైక్ సినిమాను చూశాను. ఆయన సినిమాలు గొప్పగా ఉంటాయి. ధురంధర్ 2 సినిమా కూడా తప్పకుండా అద్భుతంగా ఉంటుందనే విశ్వాసం ఉంది అన్నట్లుగా వ్యాఖ్యలు చేశాడు. అంతే కాకుండా ధురంధర్ 2 సినిమాకు తాము పోటీగా ఉస్తాద్ భగత్ సింగ్‌ను విడుదల చేస్తున్నట్లుగా కొందరు ప్రచారం చేస్తున్నారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదు. మేము ఉస్తాద్ ను కేవలం తెలుగు రాష్ట్రాల వరకే పరిమితం చేస్తున్నాము. ధురంధర్ 2 సినిమా పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. పైగా ధురంధర్ 2 సినిమాతో ఏమాత్రం సంబంధం లేని విధంగా ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఉంటుంది. కనుక రెండు సినిమాలకు ఎక్కడ పోటీ అనేది లేదని ఆయన చెప్పుకొచ్చారు.
పవన్ కళ్యాణ్ మార్క్ మ్యానరిజం..
గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన కాంబో కావడంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమా ఒక తమిళ మూవీకి రీమేక్ అనే వార్తలు మొదట్లో వచ్చాయి. కానీ పూర్తిగా కొత్త కథతో దర్శకుడు హరీష్ శంకర్ ఈ సినిమాను రూపొందించాడని యూనిట్ సభ్యుల ద్వారా తెలుస్తోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటించగా ఇంకా రాశి ఖన్నా సైతం ముఖ్య పాత్రలో కనిపించబోతుంది. ఈ సినిమాలోని పవన్ కళ్యాణ్ లుక్ పట్ల ఇప్పటికే అభిమానులు చాలా సంతోషంగా ఉన్నారు. హరీష్ శంకర్ మార్క్ క్యారెక్టర్‌తో పాటు, పవన్ కళ్యాణ్ మార్క్ మ్యానరిజంతో సినిమా ఉంటే కచ్చితంగా మరో రేంజ్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ ఉండబోతుంది అనే నమ్మకం వ్యక్తం అవుతోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా ఓపెనింగ్ కలెక్షన్స్ పై అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే తెలుగు రాష్ట్రాల్లో ధురంధర్ 2 ప్రభావంను బట్టి ఉస్తాద్ వసూళ్లు ఉండే అవకాశం ఉంది. రెండు సినిమాలకు కొంత మేర నష్టం ఉంటుందని, అయితే ధురంధర్ 2 కి ఎక్కువ నష్టం ఉండే అవకాశం ఉంది అనేది విశ్లేషకుల అంచనా.
