పవన్ ఉస్తాద్.. ఆ క్లబ్ లోకి చేరకపోయినట్లేనా?
అయితే ఆ అంచనాలకు తగ్గ ఫలితాన్ని ఉస్తాద్ బాక్సాఫీస్ వద్ద సాధించలేకపోయింది.
By: M Prashanth | 31 March 2026 2:22 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా.. ఆ సినిమాపై మొదటి నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా గబ్బర్ సింగ్ మూవీ బ్లాక్ బస్టర్ తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ తో మరోసారి పవన్ వర్క్ చేయడం అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. అయితే ఆ అంచనాలకు తగ్గ ఫలితాన్ని ఉస్తాద్ బాక్సాఫీస్ వద్ద సాధించలేకపోయింది.
మార్చి 19న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆ చిత్రం ఓపెనింగ్స్ బాగానే సాధించినప్పటికీ, ఆ తర్వాత కలెక్షన్లు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. ఇప్పుడు థియేటర్లలో రెండు వారాలు పూర్తయ్యేలోపు సినిమా రన్ దాదాపు ముగిసే పరిస్థితికి చేరుకుంది. కంటెంట్ పరంగా వీక్ గా ఉండటం, కథలో కొత్తదనం లేకపోవడం ప్రధాన కారణాలుగా అంతా చెబుతున్నారు.
అయితే ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ కనీసం రూ.100 కోట్ల మార్క్ దాటుతుందనే అంచనాలు ఉన్నప్పటికీ, ఇప్పటివరకు సుమారు రూ.92 కోట్ల గ్రాస్ వసూళ్లకే పరిమితమైందని సమాచారం. ఆదివారం రోజు కేవలం రూ.1.03 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే నమోదు కావడం, సోమవారం నాటికి అవి మరింత పడిపోవడం గమనార్హం. ముఖ్యంగా అర్బన్ సెంటర్లు, మల్టీప్లెక్సుల్లో సినిమా ప్రభావం చాలా తక్కువగా కనిపించింది.
అదే సమయంలో బాలీవుడ్ యాక్షన్ చిత్రం ధురంధర్: ది రివెంజ్ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతుండడం కూడా ఉస్తాద్ భగత్ సింగ్ కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం చూపినట్లు తెలుస్తోంది. అయితే పాత మాస్ ఫార్ములా సన్నివేశాలు ఎక్కువగా ఉండటంతో ప్రేక్షకులు ఆశించినంతగా స్పందించలేకపోయారు. హరీశ్ శంకర్ తన స్టైల్ లో మాస్ ఎలిమెంట్స్‌పై ఎక్కువ దృష్టి పెట్టినప్పటికీ, ప్రస్తుత ప్రేక్షకుల అభిరుచులకు తగ్గట్టు కంటెంట్ లేకపోవడం మైనస్ గా మారింది.
ఫ్యాన్స్‌కు కొంతవరకు ఎంటర్టైన్మెంట్ ఇచ్చినా, సాధారణ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో సినిమా విఫలమైందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, వై రవిశంకర్ నిర్మించారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. అలాగే పార్థిబన్, అశుతోష్ రాణా, నవాబ్ షా, గౌతమి, రాజీవ్ కనకాల, చమ్మక్ చంద్ర, పోసాని కృష్ణమురళి, రావు రమేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందించగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను తమన్ సమకూర్చారు.
ఏదేమైనా భారీ అంచనాల మధ్య విడుదలైన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. పవన్ కళ్యాణ్ రేంజ్ కు తగ్గ రికార్డులు నమోదు చేయడంలో విఫలమవడంతో, ఆ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరుతుందా అన్న ఆశ నెరవేరినట్లు కనిపించడం లేదు. ఇకపై వచ్చే ప్రాజెక్టులతో పవన్ కళ్యాణ్ తిరిగి స్ట్రాంగ్ గా రీబౌండ్ అవుతారా అన్నది వేచి చూడాలి.
