పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్'.. ఇంకాస్త కలిసొస్తే..
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద స్టేబుల్ రన్ ను కొనసాగిస్తోంది.
By: M Prashanth | 26 March 2026 10:24 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన తాజా చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ బాక్సాఫీస్ వద్ద స్టేబుల్ రన్ ను కొనసాగిస్తోంది. విడుదలైన తొలి వారంలో మంచి కలెక్షన్లు సాధించిన ఆ సినిమా, ఇప్పుడు కీలకమైన శ్రీరామ నవమి వీకెండ్ కోసం ఎదురుచూస్తోంది. ఆ వీకెండ్ కలెక్షన్స్.. సినిమాను రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరేలా చేస్తుందా లేదా అన్నది నిర్ణయించే అవకాశం ఉంది.
ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ సినిమాలు టాక్ ఎలా ఉన్నా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధిస్తున్నాయని చెప్పాలి. ఉదాహరణకు హరిహర వీరమల్లు చిత్రానికి డిజాస్టర్ టాక్ వచ్చినప్పటికీ సుమారు రూ.115 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. అదే ట్రెండ్ ను ఉస్తాద్ భగత్ సింగ్ కూడా కొనసాగిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. అయితే ఉస్తాద్ డిజాస్టర్ కాకుండా.. మిక్స్ డ్ టాక్ అందుకుంది.
ప్రస్తుతం ఆ సినిమా సుమారు రూ.90 కోట్ల గ్రాస్ ను అందుకోగా.. రూ.100 కోట్ల మార్క్ కు దగ్గరగా నిలిచింది. అదే సమయంలో మార్చి 19వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఆ సినిమా, మార్చి 25వ తేదీతో తొలి వారాన్ని పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింది. మొదటి వారంలో మంచి ఓపెనింగ్స్ సాధించినప్పటికీ, తర్వాతి రోజుల్లో కలెక్షన్లు కొంత స్టేబుల్ గా మారాయి.
అయితే ఇప్పుడు వచ్చే శ్రీరామ నవమి పండుగ సెలవులు సినిమాకు పెద్ద ప్లస్ గా మారనున్నాయి. శుక్రవారం సెలవు కాగా.. ఆ తర్వాత వీకెండ్ కలిసి రానుంది. దీంతో కుటుంబ ప్రేక్షకులు థియేటర్లకు వచ్చే అవకాశం ఉండటంతో, వీకెండ్ లో వసూళ్లు పెరుగుతాయని అంచనాలు వెలువడుతున్నాయి. దీంతో వీకెండ్ లో ఎంత వసూళ్లు సాధిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక సినిమాను హరీష్ శంకర్ తెరకెక్కించగా, ఇందులో శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా నటించారు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి చిత్రాన్ని నిర్మించారు. మూవీలో కీలక పాత్రల్లో ఆర్. పార్తీబన్, అశుతోష్ రాణా, నవాబ్ షాహ్, గౌతమి, రాజీవ్ కనకాల, రావు రమేష్ తదితర నటీనటులు యాక్ట్ చేశారు.
సంగీతాన్ని దేవిశ్రీ ప్రసాద్ అందించగా, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను తమన్ అందించారు. సినిమాటోగ్రఫీ బాధ్యతలను అయానంక బోస్ నిర్వహించగా, ఎడిటింగ్ ను చోటా.కె. ప్రసాద్ చేపట్టారు. ఏదేమైనా ప్రస్తుతం రూ.100 కోట్ల మార్క్ కు అంచున నిలిచిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి శ్రీరామ నవమి వీకెండ్ కీలకంగా మారింది. ఆ పండుగ రోజుల్లో కలెక్షన్లు పెరిగితే, మరో సారి పవన్ కళ్యాణ్ బాక్సాఫీస్ స్టామినా ప్రూవ్ అవ్వనుందనే చెప్పాలి. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.
