పీపుల్స్ మీడియాతో పవర్ స్టార్ పవర్ఫుల్ ప్లాన్
పవన్ కళ్యాణ్ కేవలం నటనకే పరిమితం కాకుండా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే ఇతర సినిమాలకు క్రియేటివ్ గైడెన్స్ ఇవ్వనున్నారు.
By: M Prashanth | 8 Dec 2025 11:45 PM ISTడిప్యూటీ సీఎంగా బిజీగా ఉంటూనే, సినిమాల విషయంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు ఇప్పుడు ఇండస్ట్రీని ఆశ్చర్యపరుస్తున్నాయి. కేవలం హీరోగా సినిమాలు చేయడమే కాకుండా, తన నిర్మాణ సంస్థ 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' ద్వారా ఇండస్ట్రీలో ఒక స్ట్రాంగ్ ఇంపాక్ట్ క్రియేట్ చేయాలని ఆయన డిసైడ్ అయినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీతో ఒక భారీ ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు టాక్.
ఈ డీల్ ప్రకారం పవన్ కళ్యాణ్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి భవిష్యత్తులో పలు భారీ ప్రాజెక్టులను చేపట్టనున్నారు. ఇందులో ప్రధానంగా పవన్ కళ్యాణ్ హీరోగా రెండు భారీ సినిమాలు తెరకెక్కే అవకాశం ఉంది. అయితే ఈ డీల్ లో అసలు హైలైట్ పవన్ హీరోగా చేసే సినిమాలు మాత్రమే కాదు, ఆయన వెనుక ఉండి నడిపించే ప్రాజెక్టులు కూడా ఉండటం విశేషం.
పవన్ కళ్యాణ్ కేవలం నటనకే పరిమితం కాకుండా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించే ఇతర సినిమాలకు క్రియేటివ్ గైడెన్స్ ఇవ్వనున్నారు. అంటే కథల ఎంపిక, కంటెంట్ వాలిడేషన్, ప్రమోషనల్ స్ట్రాటజీ వంటి కీలక విషయాల్లో పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ పాత్ర ఉంటుంది. పవన్ బ్రాండ్ ఇమేజ్ ను ఆ సినిమాలకు యాడ్ చేయడం ద్వారా మార్కెట్ రేంజ్ ను పెంచాలనేది ఈ ఒప్పందం వెనుక ఉన్న అసలు వ్యూహం.
నిజానికి పవన్ కళ్యాణ్ కు, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ కు మధ్య మంచి అనుబంధం ఉంది. వీరి కాంబినేషన్ లో వచ్చిన 'బ్రో' సినిమా నుంచే ఈ బాండింగ్ బలపడింది. ఇటీవల 'హరి హర వీర మల్లు' సినిమా రిలీజ్ విషయంలో ఏర్పడిన చిక్కుముడులను విప్పడంలో కూడా పీపుల్ మీడియా సంస్థ అందించిన ఆక్టివ్ సపోర్ట్ ఈ కొత్త డీల్ కు పునాది వేసినట్లు తెలుస్తోంది.
మార్కెట్ పరంగా చూస్తే ఇదొక సాలిడ్ కాంబినేషన్. పవన్ కళ్యాణ్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్, గ్లోబల్ క్రేజ్ కు.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణ విలువలు తోడైతే వచ్చే అవుట్ పుట్ వేరే లెవెల్ లో ఉంటుంది. పాన్ ఇండియా మార్కెట్ ను, అంతర్జాతీయ మార్కెట్ ను టార్గెట్ చేస్తూ భారీ సినిమాలను నిర్మించడానికి ఈ అలయన్స్ ప్లాన్ చేసింది.
రాబోయే రోజుల్లో ఈ బ్యానర్స్ నుంచి ఫ్రాంచైజీ తరహా సినిమాలు వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. కేవలం రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా, విజువల్ స్పెక్టాకిల్స్ గా ఉండే ప్రాజెక్టులను డిజైన్ చేస్తున్నారని తెలుస్తోంది. మొత్తానికి రాజకీయాల్లోనే కాదు, సినిమాల్లో కూడా పవన్ కళ్యాణ్ తనదైన స్ట్రాటజీతో దూసుకుపోతున్నారని అర్థమవుతుంది.
