మార్షల్ ఆర్ట్స్‌లో పవన్ కళ్యాణ్ రికార్డ్.. అసలు కథ ఇదే!
టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లో ఆయన స్టైల్, నటన మాత్రమే కాకుండా తెరపై చేసే విన్యాసాలకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది.
By: M Prashanth | 12 Jan 2026 2:06 AM ISTటాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైల్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సినిమాల్లో ఆయన స్టైల్, నటన మాత్రమే కాకుండా తెరపై చేసే విన్యాసాలకు కూడా మంచి ఫ్యాన్ బేస్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా ఎంట్రీ ఇచ్చినా, తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పవన్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్నారు. అయితే రాజకీయాల్లో ఎన్ని బాధ్యతలు ఉన్నా, తనకు ఇష్టమైన యుద్ధ కళల విషయంలో మాత్రం ఆయన తన ఆసక్తిని ఎప్పుడూ తగ్గించుకోలేదు.
సినిమాల్లోకి రాకముందే చెన్నైలో ఉన్న రోజుల్లో పవన్ కళ్యాణ్ కరాటే, ఇతర యుద్ధ కళల్లో శిక్షణ పొందారు. 'అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి' సినిమా నుంచి 'తమ్ముడు', 'ఖుషి', రీసెంట్ గా వస్తున్న 'ఓజీ' వరకు చాలా చిత్రాల్లో తన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని చూపించారు. తెరపై ఆయన చేసే కత్తిసాము లేదా ఫైట్స్ వెనుక దశాబ్దాల కఠిన సాధన ఉందని సినీ విశ్లేషకులు చెబుతుంటారు. లేటెస్ట్ గా ఈ అంకితభావానికి అంతర్జాతీయ స్థాయిలో ఒక అరుదైన గుర్తింపు లభించింది.
మార్షల్ ఆర్ట్స్‌లో పవన్ కళ్యాణ్ కు ప్రపంచ స్థాయి గౌరవం దక్కింది. ప్రాచీన జపనీస్ కత్తిసాము కళ అయిన 'కెంజుట్సు'లో ఆయనకు అధికారికంగా 'ఫిఫ్త్ డాన్' పురస్కారం లభించింది. జపాన్‌కు చెందిన అత్యంత గౌరవనీయమైన సంస్థ 'సోగో బుడో కన్‌రి కై' ఈ పురస్కారాన్ని అందజేసింది. ఇది మూడు దశాబ్దాలకు పైగా ఆయన చేసిన సాధనకు దక్కిన గౌరవంగా చెప్పవచ్చు. సినిమాల్లోని నటనకు మాత్రమే కాకుండా, నిజ జీవితంలో ఒక మార్షల్ ఆర్ట్స్ నిపుణుడిగా ఆయన సాధించిన ఈ ఘనత ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
ఈ గౌరవంతో పాటు పవన్ కళ్యాణ్ కు 'టైగర్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్' అనే కొత్త బిరుదును కూడా గోల్డెన్ డ్రాగన్స్ సంస్థ బహూకరించింది. అంతేకాకుండా 'సోకే మురమత్సు సెన్సై'లోని 'టకెడా షింగెన్ క్లాన్'లో ప్రవేశం పొందిన మొదటి తెలుగు వ్యక్తిగా పవన్ చరిత్ర సృష్టించారు. దీనికి సంబంధించిన వీడియోను పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో నెట్టింట వైరల్ అవుతోంది. స్టంట్ కోఆర్డినేటర్ గా గతంలో పలు చిత్రాలకు పనిచేసిన అనుభవం కూడా పవన్ కు ఈ విషయంలో బాగా కలిసి వచ్చింది.
సినిమాల విషయానికి వస్తే పవన్ ప్రస్తుతం హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' చిత్రంలో నటిస్తున్నారు. శ్రీలీల, రాశీ ఖన్నా హీరోయిన్లుగా చేస్తున్న ఈ సినిమా సమ్మర్ లో విడుదల కానుంది. దీని తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక ప్రాజెక్ట్ కి పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాజకీయ బాధ్యతలు నిర్వహిస్తూనే వీలైనంత త్వరగా పెండింగ్ లో ఉన్న సినిమాలను పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారు.
