తెలుగు రాష్ట్రాల సీఎంలకు పవన్ స్పెషల్ థ్యాంక్స్.. ఎందుకంటే?
భారీ హైప్ తో మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఓజీ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు.
By: M Prashanth | 22 Sept 2025 10:34 AM ISTభారీ హైప్ తో మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఓజీ చిత్రానికి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు సహకరించాయని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చూపిన చొరవ వల్లే సినిమా పరిశ్రమకు మరింత ప్రోత్సాహం లభిస్తోందని అన్నారు.
హైదరాబాద్ లో ఆదివారం రాత్రి జరిగిన ఓజీ కన్సర్ట్ విజయవంతంగా సాగిందని పవన్ తెలిపారు. అందుకు తెలంగాణ ప్రభుత్వంతో పాటు మంత్రివర్గ సభ్యులు, డీజీపీ జితేందర్, సిటీ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, లాల్ బహదూర్ స్టేడియం నిర్వాహకులు అందించిన సహకారం అభినందనీయమని తెలిపారు.
భారీ వర్షం కురిసినా ఉత్సాహంగా.. అసంఖ్యాకంగా హాజరైన అభిమానులకు పవన్ కళ్యాణ్ ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు. అభిమానుల ఉత్సాహం మరువలేనిదని పవన్ తెలిపారు. ఓజీ కన్సర్ట్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన శ్రేయాస్ మీడియా సంస్థకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్పారు పవన్.
ఈవెంట్ కు పటిష్ట భద్రత కోసం కృషి చేసిన పోలీసు సిబ్బందికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో సహకరించిన కూటమి ప్రభుత్వ మంత్రులు, పోలీసు, రెవెన్యూ శాఖ అధికారులకు పవన్ ధన్యవాదాలు తెలిపారు. అదే సమయంలో ఓజీ చిత్రాన్ని మరింతగా ప్రజల్లోకి చేర్చిన ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా యాజమాన్యాలు, ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, విలేకర్ల కృషిని ప్రశంసించారు.
ఆ తర్వాత ఓజీ మూవీ కోసం కస్టపడి పని చేసిన దర్శకుడు సుజిత్, నిర్మాతలు డీవీవీ దానయ్య, కళ్యాణ్ దాసరి, సంగీత దర్శకుడు తమన్, నటీనటులు, రచయితలు, సాంకేతిక నిపుణులందరికీ పవన్ కళ్యాణ్ అభినందనలు తెలిపారు. అయితే సినిమాలో ఆయన పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నారు.
ఆయన సరసన హీరోయిన్ గా యంగ్ బ్యూటీ ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ నటుడు ఇమ్రాన్ హష్మీ యాక్ట్ చేస్తున్నారు. ప్రకాశ్ రాజ్, అర్జున్ దాస్, శ్రియా రెడ్డి, సిరి లెల్ల సహా అనేక మంది కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే మూవీపై ఓ రేంజ్ లో హైప్ ఉండగా.. ఓజీ కన్సర్ట్ తో మరింత పెరిగింది. మరి సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో వేచి చూడాలి.
