పవన్ రంగంలోకి దిగుతారా? హరీష్ ప్లాన్ కు ఓకే చెబుతారా?
పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ప్రమోషన్ల వేగం పెరిగింది.
By: M Prashanth | 11 March 2026 11:19 PM ISTపవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ విడుదలకు సమయం దగ్గరపడుతున్న వేళ.. ప్రమోషన్ల వేగం పెరిగింది. మార్చి 19వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి ఆ సినిమా సిద్ధమవుతుండగా.. మేకర్స్ ప్రమోషన్లు మరింత స్ట్రాంగ్ గా చేపట్టాలని ఫిక్స్ అయ్యారు. ముఖ్యంగా దర్శకుడు హరీష్ శంకర్ ఇప్పటికే వరుస ఇంటర్వ్యూలు ఇస్తుండగా.. పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగాలని కోరుకుంటున్నారట.
భారీ అంచనాల మధ్య తెరకెక్కిన ఆ చిత్రంపై పవన్ కళ్యాణ్ అభిమానుల్లోనే కాకుండా ఆడియన్స్ లో రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. అయితే అభిమానులను మించిన స్థాయిలో సాధారణ ప్రేక్షకులను థియేటర్లకు ఆకర్షించాలంటే ప్రత్యేకమైన ప్రమోషన్ అవసరమని నిర్మాతలు భావిస్తున్నారు! ఆ నేపథ్యంలో స్పెషల్ ఇంటర్వ్యూ ప్లాన్ చేస్తున్నారని ఇప్పుడు చర్చ జరుగుతోంది.
హరీష్ శంకర్ తో కలిసి పవన్ ప్రత్యేకంగా ఒక ఇంటర్వ్యూ నిర్వహించాలని నిర్మాతలు నవీన్ ఎర్నేని, రవిశంకర్ ఎలమంచిలి కోరుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఇంటర్వ్యూలో సినిమా, స్టోరీ లైన్, మూవీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడితే ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ సాధారణంగా సినిమా ప్రమోషన్లలో ఎక్కువగా పాల్గొనరని చెప్పాలి.
ముఖ్యంగా వ్యక్తిగతంగా ఇంటర్వ్యూలు ఇవ్వడం కూడా తక్కువ. ఇటీవల కాలంలో ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలు చాలా పరిమితంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడు హరీష్ శంకర్ తో కలిసి ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ చేస్తే అది సినిమాకు పెద్ద ఎత్తున ఉపయోగపడుతుందని అనుకుంటున్నారట. ఇప్పటికే సినిమాకు సంబంధించిన డబ్బింగ్ పనులు పవన్ కళ్యాణ్ పూర్తి చేశారు.
అలాగే తనకు సంబంధించిన ఇతర ఫార్మాలిటీలు ముగించారని సమాచారం. అయితే ఆ ప్రత్యేక ఇంటర్వ్యూ విషయంలో మాత్రం కొంత సమయం ఇవ్వాలని పవన్ కోరినట్లు తెలుస్తోంది. తన షెడ్యూల్ ను పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తే అది సోషల్ మీడియాలో మాత్రం భారీ చర్చకు దారి తీయడం ఖాయం.
ఆయన మాట్లాడే ప్రతి మాట అభిమానులకు మాత్రమే కాకుండా సాధారణ ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగిస్తుంది. ముఖ్యంగా హరీష్ తో ఆయనకు ఉన్న ఫ్రెండ్షిప్, ఇద్దరి మధ్య జరిగే కన్వర్జేషన్ హైలైట్ గా నిలవడం పక్కా అనే చెప్పాలి. ఇప్పటికే ఉస్తాద్ పై భారీ అంచనాలు ఉన్నాయి. పవన్- హరీష్ కాంబోలో గతంలో వచ్చిన గబ్బర్ సింగ్ మంచి విజయాన్ని అందుకోవడంతో.. ఉస్తాద్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందుకే పవన్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇస్తే సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యే అవకాశం ఉంది. మరి పవన్.. హరీష్ తో ఇంటర్వ్యూకు ఓకే చెప్తారో లేదో అనేది చూడాలి.
