పవన్ కళ్యాణ్ అంత సైలెంట్ గా మాట్లాడారా?
పవన్ లీడ్ రోల్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని తెరకెక్కిస్తున్న హరీష్ శంకర్.. ఓ ఇంటర్వ్యూలో ఆయన కోసం మాట్లాడారు.
By: M Prashanth | 6 March 2026 9:00 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సైలెంట్ గా మాట్లాడారా? మామూలుగా అలానే మాట్లాడుతారా? ఇప్పుడిదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా సభల్లో అగ్రెసివ్ గా మాట్లాడే పవన్ కళ్యాణ్ నిజ జీవితంలో మాత్రం చాలా సైలెంట్ గా మాట్లాడతారని డైరెక్టర్ హరీష్ శంకర్ ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో అంతా డిస్కస్ చేసుకుంటున్నారు.
పవన్ లీడ్ రోల్ లో ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని తెరకెక్కిస్తున్న హరీష్ శంకర్.. ఓ ఇంటర్వ్యూలో ఆయన కోసం మాట్లాడారు. బయట పబ్లిక్ మీటింగ్స్ లో, రాజకీయ సభల్లో ఆయన చాలా ఉత్సాహంగా, గట్టిగా మాట్లాడే పవన్.. సెట్స్ లో లేదా సాధారణంగా మాట్లాడేటప్పుడు మాత్రం చాలా నెమ్మదిగా, తక్కువ సౌండ్ తో మాట్లాడతారని హోస్ట్ అడిగిన ఓ ప్రశ్నకు ఆన్సర్ గా చెప్పారు.
"మామూలుగా ఆయన మాట్లాడితే వినిపించడమే కష్టం. ఆయన ఏమన్నారో అర్థం చేసుకోవాలంటే దగ్గరగా వెళ్లి వినాలి. కొన్నిసార్లు సర్.. సర్ అంటూ ముందుకు వెళ్లి అడగాల్సి వస్తుంది. లేకపోతే మాటలు సరిగ్గా వినిపించవు" అని హరీష్ శంకర్ నవ్వుతూ వివరించారు. అంతేకాదు, కొన్నిసార్లు పవన్ కళ్యాణ్ చెప్పింది సరిగ్గా వినిపించకపోవడంతో మళ్లీ అడగాల్సి వస్తుందని కూడా చెప్పారు.
కానీ మళ్లీ మళ్లీ అడగడం వల్ల కొంచెం టెన్షన్ కూడా వస్తుందని సరదాగా వ్యాఖ్యానించారు. ఏమైనా అనుకుంటారేమోనని అనిపిస్తుందని అన్నారు. అయితే హరీష్ శంకర్ కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. సోషల్ మీడియాలో అనేక మంది నెటిజన్లు రెస్పాండ్ అవుతున్నారు. చాలా మంది అభిమానులు పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వం గురించి కొత్త యాంగిల్ ను తెలుసుకున్నామని అంటున్నారు.
స్టేజ్‌పై అగ్రెసివ్ గా కనిపించే ఆయన, వ్యక్తిగతంగా మాత్రం ఎంతో స్మూత్ అండ్ స్లోగా మాట్లాడతారనే విషయం ఆసక్తికరంగా ఉందని అభిప్రాయపడుతున్నారు. ఇంకొందరు అభిమానులు అయితే ఇది పవన్ కళ్యాణ్ వ్యక్తిత్వానికి సరిపోయే విషయమేనని చెబుతున్నారు. సాధారణంగా ఆయన చాలా లోతుగా ఆలోచించే వ్యక్తి కావడంతో కొన్నిసార్లు మాటలు తక్కువగా మాట్లాడుతారని, అందుకే నెమ్మదిగా మాట్లాడటం సహజమేనని పేర్కొంటున్నారు.
మరోవైపు ఇంకొంతమంది నెటిజన్లు మాత్రం రాజకీయ సభల్లో కనిపించే ఆయన శైలి, వ్యక్తిగత మాట తీరు మధ్య తేడా ఉండటం సహజమని అంటున్నారు. ఇదిలా ఉంటే.. ఉస్తాద్ భగత్ సింగ్ పై ఇప్పటికే అభిమానుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే పవన్, హరీష్ కాంబినేషన్ లో వచ్చిన గబ్బర్ సింగ్ భారీ విజయాన్ని సాధించడంతో ఉస్తాద్ విషయంలో సేమ్ రిపీట్ అవుతుందని అంతా ఆశిస్తున్నారు. మరి ఆ సినిమా ఎలాంటి విజయం అందుకుంటుందో అంతా వేచి చూడాలి.
