Begin typing your search above and press return to search.

రెండు ద‌శాబ్దాల‌కు 'స‌త్య‌గ్రాహి' కి రిపేర్లా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ `సత్యగ్రాహి` టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది.

By:  Srikanth Kontham   |   24 Sept 2026 8:15 AM IST
రెండు ద‌శాబ్దాల‌కు స‌త్య‌గ్రాహి కి రిపేర్లా?
X

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ డ్రీమ్ ప్రాజెక్ట్ `సత్యగ్రాహి` టాలీవుడ్‌తో పాటు రాజకీయ వర్గాల్లోనూ మరోసారి హాట్ టాపిక్‌గా మారింది. రెండు దశాబ్దాల క్రితం పూజ కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమై ఆ తర్వాత రద్దయిన సినిమాను మళ్లీ పట్టాలెక్కించేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు వార్తలొస్తున్నాయి. 2006లో పవన్ కల్యాణ్ స్వయంగా సొంతంగా రాసుకుని దర్శకత్వం వహించాలనుకున్న పొలిటికల్ కథను ప్రస్తుతం మళ్లీ తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నాలు ఊపందుకోవడం అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

గతంలో ఏఎమ్ రత్నం నిర్మాణంలో `సత్యగ్రాహి` సినిమాను పవన్ అప్పట్లోనే ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటించారు. నాటి రాజకీయ వ్యవస్థలోని లోపాలు, సమాజంలోని అసమానతలు, యువతలో రాజకీయ చైతన్యం తీసుకురావాలనే లక్ష్యంతో పవన్ ఈ కథను సిద్ధం చేసుకున్నారు. `ఖుషి` వంటి ఆల్ టైమ్ బ్లాక్‌బస్టర్ తర్వాత పవన్ కల్యాణ్ ఆలోచనా ధోరణిలో వచ్చిన మార్పునకు ఈ చిత్రం నిదర్శనంగా నిలిచింది. అయితే కొన్ని అనివార్య కారణాలతో ఆసమయంలో ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు . షూటింగ్ ప్రారంభం కాకుండానే నిలిచిపోయింది.

ఇరవై ఏళ్ల కాలంలో సమాజంలో రాజకీయ వ్యవస్థలో ఎన్నో మార్పులొచ్చాయి. 2006 నాటి రాజకీయ పరిస్థితులు, ప్రజల ఆలోచనా శైలి, సోషల్ మీడియా లేని ఆనాటి రోజులు వేరు. 2026 నాటి డిజిటల్ యుగంలో రాజకీయం నడిచే తీరుతెన్నులు పూర్తిగా వేరు. 20 ఏళ్ల నాటి పాత పొలిటికల్ పాయింట్‌ను అలాగే ఇప్పటి తరానికి చూపిస్తే నేటి ప్రేక్షకులు కనెక్ట్ కావడం కష్టం కాబట్టి నాటి మూల కథకు నేటి రాజకీయ పరిణామాలను ముడిపెడుతూ భారీ మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడింది.

ఈ క్రమంలోనే పవన్ కల్యాణ్ ఆత్మీయ మిత్రుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో రచయితల బృందం ఈ స్క్రిప్ట్‌పై పని చేస్తున్నట్లు తెలిసింది. పవన్ కల్యాణ్ నాటి మూల భావజాలాన్ని దెబ్బతీయకుండా 2026 రాజకీయ సమీకరణలకు, ఆధునిక సమాజ పోకడలకు అనుగుణంగా కథను తిరగరాసే బాధ్యతను త్రివిక్రమ్ టీమ్ తీసుకున్నట్లు తెలుస్తోంది. సమకాలీన అంశాలను తనదనైన పదునైన మాటలతో, కమర్షియల్ అంశాలతో జోడించడంలో త్రివిక్రమ్ దిట్ట కాబట్టి రిపేర్ల ప్రక్రియపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

2006లో పవన్ కల్యాణ్ కేవలం సామాజిక స్పృహ కలిగిన కథానాయకుడు మాత్రమే. కానీ 2026 నాటికి ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లో కీలక నాయకుడిగా ప్రభుత్వంలో బాధ్యతాయుతమైన పదవిలో కొనసాగుతున్నారు. నాడు రీల్ హీరోగా చెప్పాలనుకున్న సిద్ధాంతాలను నేడు రియల్ లైఫ్ పొలిటీషియన్‌గా అనుభవించిన పవన్ తన అనుభ వాలను కూడా ఈ కథకు జోడించే అవకాశం ఉంది. పవర్‌ఫుల్ పొలిటికల్ లీడర్ ఆలోచనల నుంచి వస్తున్న కథ కాబట్టి ప్రతి సన్నివేశం, డైలాగ్ సమాజంపై ఎంతటి ప్రభావం చూపుతుందనేది ఆసక్తికరం.

ఏది ఏమైనా రెండు దశాబ్దాల క్రితం ఆగిపోయిన మహత్తర ఆశయం `సత్యగ్రాహి` రూపంలో మళ్లీ జీవం పోసుకుంటుండటం విశేషం. ఈ కథలో పవన్ కల్యాణ్ స్వయంగా నటిస్తారా ?లేదా? ఆయన ఆలోచనలకు అనుగుణంగా మరొక హీరోతో తెరకెక్కిస్తారా? అనే దానిపై క్లారిటీ లేన‌ప్ప‌టికీ త్రివిక్రమ్ మార్క్ స్క్రిప్ట్ వర్క్ తర్వాత ఎలాంటి రూపాంతరం చెందుతుందన్న‌ది చూడాలి.