Begin typing your search above and press return to search.

పవన్ కామెంట్స్.. ఎంతవరకు కరెక్ట్?

సినిమా టికెట్‌ ధరల పెంపు కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలే.

By:  M Prashanth   |   16 March 2026 12:14 PM IST
పవన్ కామెంట్స్.. ఎంతవరకు కరెక్ట్?
X

సినిమా టికెట్‌ ధరల పెంపు కోసం ఇప్పుడు సోషల్ మీడియాలో మరోసారి పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అందుకు కారణం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలే. ఆయన నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ రీసెంట్ గా జరగ్గా.. అందులో పాల్గొన్న పవన్ టికెట్ రేట్ల పెంపు, నిర్మాతల పరిస్థితి, ప్రభుత్వ ఆదాయం వంటి అంశాలపై తన అభిప్రాయాలను వేదికపై వెల్లడించారు.

పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, సినిమా టికెట్‌ ధరల పెంపు కోసం ప్రభుత్వం దగ్గరకు వెళ్ళినప్పుడు దాన్ని తప్పుగా చూడాల్సిన అవసరం లేదన్నారు. నిర్మాతలు భారీ పెట్టుబడులు పెట్టి సినిమాలు నిర్మిస్తున్నారని, ఆ ఖర్చులను తిరిగి పొందేందుకు కొన్నిసార్లు టికెట్ ధరలు పెంచాల్సి వస్తుందని వివరించారు. ముఖ్యంగా సినిమా విడుదలైన మొదటి రోజు లేదా తొలి కొన్ని షోల సమయంలో మాత్రమే ధరలు పెంచాలని నిర్మాతలు కోరుతారని చెప్పారు.

టికెట్‌ ధరల పెంపును ఎప్పుడూ దోపిడీగా చూడకూడదని ఆయన అభిప్రాయపడ్డారు. పెరిగిన ప్రతి రూపాయిలో కూడా సుమారు 18 శాతం వరకు జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి వెళ్తుందని పవన్ కళ్యాణ్ గుర్తుచేశారు. దీంతో టికెట్ ధరలు పెరగడం వల్ల ప్రభుత్వం కూడా ఆదాయం పొందుతుందని తెలిపారు. ఇంకా టికెట్ ధరలను అధికారికంగా పెంచకపోతే, కొందరు బ్లాక్ మార్కెట్‌ లో టికెట్లు విక్రయించే అవకాశం పెరుగుతుందని ఆయన అన్నారు.

అలా జరిగితే ప్రభుత్వానికి రావాల్సిన పన్ను కూడా కోల్పోయే ప్రమాదం ఉంటుందని పేర్కొన్నారు. కాబట్టి కొంత వరకు ధరల పెంపు అవసరమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. దీంతో పవన్ వ్యాఖ్యలు ఎంతవరకు కరెక్ట్ అన్న చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. అనేక మంది నెటిజన్లు, సినీ ప్రియులు, అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.

ఒక సాధారణ ప్రేక్షకుడికి సినిమా చూడటం ఇప్పుడు ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారిందని పలువురు సినీ ప్రియులు చెబుతున్నారు. కుటుంబంతో కలిసి థియేటర్‌ కు వెళ్తే టికెట్ ధరలతో పాటు ఫుడ్, ప్రయాణ ఖర్చులు కలిపి పెద్ద మొత్తం అవుతుందని పేర్కొంటున్నారు. ఇటీవల కొన్ని పెద్ద సినిమాల విడుదల సమయంలో టికెట్ ధరలు భారీగా పెరిగిన సందర్భాలు ఉన్నాయని ప్రేక్షకులు గుర్తు చేస్తున్నారు.

అవి సాధారణ ప్రేక్షకులు స్తోమతకు మించిపోతున్నాయని వారు అభిప్రాయపడుతున్నారు. రేట్లు పెంచినా మరీ అంతలా అవసరమా క్వశ్చన్ చేస్తున్నారు. ఆడియన్స్ కోసం ఆలోచించాలని సూచిస్తున్నారు. అదే సమయంలో బడ్జెట్ తగ్గించుకోవాలని అంటున్నారు. కొందరు మాత్రం పవన్ కామెంట్స్ కు మద్దతు పలుకుతున్నారు. దీంతో టికెట్ ధరల పెంపు అంశంపై ఎవరి కోణంలో చూస్తే వారికి అదే కరెక్ట్ గా కనిపిస్తుందని చెప్పాలి.