పవన్ OG.. ఈసారైనా ఫ్యాన్స్ కోరిక తీరుతుందా?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మూవీ ఓజీ (They Call Him OG) ఎట్టకేలకు రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 29 Sept 2025 3:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న మూవీ ఓజీ (They Call Him OG) ఎట్టకేలకు రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ పడగా, ఆ తర్వాత రోజు వరల్డ్ వైడ్ గా మూవీ విడుదలవ్వగా.. ఫ్యాన్స్ ఓ రేంజ్ లో సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి.
రిపీట్ మోడ్ లో థియేటర్స్ కు వెళ్తూ.. ఫుల్ గా సందడి చేస్తున్నారు. సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్ సుజీత్ పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. గుడి కట్టినా తప్పులేదంటూ.. తాము పవన్ ను ఎలా చూడాలనుకున్నామో అంతకుమించి చూపించారని చెబుతున్నారు. థ్యాంక్యూ మాస్టర్ అంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
కానీ ఓ విషయంలో మాత్రం పవర్ స్టార్ ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారని చెప్పాలి. అది సినిమా విడుదలకు ముందు జరిగిన ప్రమోషన్స్ గురించే. ఎందుకంటే గత మూవీ హరిహర వీరమల్లు సమయంలో పవన్.. ఒకే రోజు అనేక మీడియాలకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. దీంతో సినిమాల పరంగా చిన్న గ్యాప్ తర్వాత ఫ్యాన్స్ కు కనెక్ట్ అయ్యారు.
కానీ ఆ సినిమా రిజల్ట్ ఏంటో అందరికీ తెలిసిందే. దాన్ని పక్కన పెడితే ఇప్పుడు ఓజీ మూవీ విషయంలో కూడా పవన్ ప్రమోషన్స్ తో సందడి చేస్తారని, మళ్ళీ తమతో కనెక్ట్ అవుతారని అంతా అనుకున్నారు. కానీ ఆయన ఇంటర్వ్యూలు ఇవ్వలేదు. కేవలం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మాత్రమే వచ్చారు. ఓజీ కన్సర్ట్ పేరుతో జరిగిన ఆ కార్యక్రమం.. వర్షార్పణం అయింది.
పవన్ అనేక విషయాలు పంచుకుంటారని, ఫుల్ గా మాట్లాడతారని ఆశిస్తే.. వర్షం వల్ల ఫ్యాన్స్ ఆశ తీరలేదు. ఆ తర్వాత మేకర్స్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయగా.. అందులో పవన్ పాల్గొనలేదు. ఎందుకంటే.. ఆ సమయంలో ఆయన తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నారు. అలా జరగడంతో ఫ్యాన్స్ కోరిక అలానే ఉండిపోయింది.
అయితే ఇప్పుడు పవన్.. అభిమానుల ముందుకు త్వరలోనే రానున్నారని తెలుస్తోంది. మరికొద్ది రోజుల్లో ఓజీ సక్సెస్ మీట్ ను మేకర్స్ గ్రాండ్ గా ఏర్పాటు చేస్తారని సమాచారం. అందుకు గాను ఇప్పటికే ఏర్పాట్లు కూడా మొదలయ్యాని టాక్ వినికిడి. అందులో పవన్ సహా ఓజీ క్యాస్టింగ్, టెక్నీషియన్స్ అంతా పాల్గొనున్నారని వార్తలు వస్తున్నాయి. దీంతో అదే జరిగితే ఫ్యాన్స్ కోరిక నెరవేరనుంది. మరేం జరుగుతుందో వేచి చూడాలి.
