ఓజిలో ఆ యాంగిల్ కూడా ఉందా?
ముంబై బేస్డ్ మాఫియా డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే.
By: Sravani Lakshmi Srungarapu | 10 Aug 2025 11:00 PM ISTఎంతో కసి మీదున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆకలిని హరి హర వీరమల్లు సినిమా తీర్చలేకపోయింది. రెండేళ్ల తర్వాత పవన్ ను స్క్రీన్ పై చూశామనే తృప్తిని తప్పించి, ఫ్యాన్స్ పవన్ ను చూడాలనుకుంటున్న విధంగా ఆ సినిమాలో చూపించలేకపోయారు. దీంతో పవన్ ఫ్యాన్స్ ఆశలన్నీ ఓజిపైనే ఉన్నాయి. ఓజిలో తాము కోరుకున్నవన్నీ దొరుకుతాయని పవర్ స్టార్ ఫ్యాన్స్ చాలా బలంగా నమ్ముతున్నారు.
ఓజీపై భారీ అంచనాలు
సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓజిపై డే1 నుంచే భారీ అంచనాలున్నాయి. పవనే కాదు, ఆ సినిమాకు సంబంధించిన ఎవరు ఎక్కడ కనిపించినా సమయం, సందర్భంతో పన్లేకుండా పవన్ ఫ్యాన్స్ ఓజి పేరుని జపిస్తూనే వస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పూర్తి కాగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో చిత్ర యూనిట్ బిజీగా ఉంది.
ఫస్ట్ సాంగ్ కు మంచి రెస్పాన్స్
రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఫైర్ స్టార్మ్ అంటూ సాగే ఫస్ట్ లిరికల్ ను మేకర్స్ రివీల్ చేయగా ఆ సాంగ్ కు ఫ్యాన్స్ నుంచి విపరీతమైన రెస్పాన్స్ వస్తోంది. చాలా ఏళ్లుగా పవన్ ను ఫ్యాన్స్ ఎలాగైతే చూడాలని ఆశపడ్డారో, ఈ సినిమాలో సుజిత్ అలానే చూపించారని ఫస్ట్ సాంగ్ తోనే క్లారిటీ వచ్చేసింది. తమన్ కంపోజిషన్ లో వచ్చిన ఈ సాంగ్ లో పవన్ ఎంతో స్టైలిష్ గా కనిపించారు. సాంగ్ లో పవన్ లుక్స్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచాయి.
త్వరలోనే ఓజి సెకండ్ సాంగ్
ముంబై బేస్డ్ మాఫియా డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఆల్రెడీ ఫస్ట్ సాంగ్ తో మంచి రెస్పాన్స్ ను అందుకున్న ఓజి చిత్ర యూనిట్, ఇప్పుడు ఓజి నుంచి సెకండ్ సాంగ్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఓజి నుంచి తర్వాత వచ్చే సాంగ్ రొమాంటిక్ మెలోడీ సాంగ్ అని, ఆ పాటను లెజెండరీ సింగర్ చిత్ర ఆలపించారని తెలుస్తోంది. త్వరలోనే మేకర్స్ ఆ సాంగ్ ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు ఓజిను కేవలం ముంబై బేస్డ్ మాఫియా డ్రామాగానే అనుకుంటున్న టైమ్ లో మెలోడీని రిలీజ్ చేసి ఓజిలోని మరో యాంగిల్ ను చూపించాలని మేకర్స్ భావిస్తున్నారట. ప్రియాంక అరుళ్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ నెగిటివ్ రోల్ లో కనిపించనున్నారు.
