అజ్ఞాతవాసి రికార్డు.. ఓజీతో 10 రోజుల ముందే బ్రేక్
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో రూపొందుతున్న ఓజీ.. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే.
By: M Prashanth | 15 Sept 2025 4:15 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లీడ్ రోల్ లో రూపొందుతున్న ఓజీ.. మరికొద్ది రోజుల్లో విడుదల కానున్న సంగతి తెలిసిందే. గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఆ సినిమా కోసం అభిమానులు మాత్రమే కాదు, సినీ ప్రియులంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఎప్పుడు సిల్వర్ స్క్రీన్ పై పవన్ ను చూస్తామా అని ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.
దసరా సందర్భంగా సెప్టెంబర్ 25వ తేదీ సినిమా విడుదల కానుండగా.. వరల్డ్ వైడ్ గా ప్రీమియర్స్ వేయనున్నారు మేకర్స్. అందుకు గాను ఓవర్సీస్ ప్రీమియర్స్ కు ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ మొదలయ్యాయి. హాట్ కేకుల్లా టిక్కెట్లు కొనుగోలు చేస్తున్నారు సినీ ప్రియులు. దీంతో ప్రీమియర్స్ ప్రీ బుకింగ్స్ తోనే కొత్త రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. పాతవి బద్దలవుతున్నాయి.
అయితే అమెరికాలో ఓజీ ప్రీమియర్ షోల కోసం ఇప్పటికే 50,000 టికెట్లు అడ్వాన్స్ బుకింగ్ లో అమ్ముడుపోయాయి. రిలీజ్ కు ఇంకా పది రోజులు ఉండగానే ఆ ఫీట్ సాధించడం మామూలు విషయం కాదు. నార్త్ అమెరికాలోనే వేగంగా 50 వేల టికెట్లు సేల్ అయిన తెలుగు సినిమాగా ఓజీ నిలిచింది. దీంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేశారు.
అదే సమయంలో ఇప్పుడు పవన్ తన మూవీ రికార్డును తానే బద్దలు కొట్టారు. పవర్ స్టార్ గతంలో నటించిన అజ్ఞాతవాసి చిత్రం 1.51 మిలియన్ డాలర్లు ప్రీమియర్ల వసూళ్లతో సంచలనం సృష్టించింది. ఉత్తర అమెరికాలో ప్రీమియర్ల పరంగా నాన్-బాహుబలి రికార్డును బద్దలు కొట్టింది. ఇప్పుడు, పవన్ కళ్యాణ్ OG చిత్రం విడుదలకు 10 రోజుల ముందు ఆ రికార్డును బ్రేక్ చేసి సత్తా చాటింది.
ఇప్పటివరకు అజ్ఞాతవాసి చిత్రం పవన్ కళ్యాణ్ కు అతిపెద్ద ప్రీమియర్ వసూళ్లు తెచ్చిన మూవీగా నిలవగా.. ఇప్పుడు ఆ ప్లేస్ ను ఓజీ భర్తీ చేసింది. ప్రీమియర్లకు ఇంకా 10 రోజులు మిగిలి ఉండగా, కేవలం ప్రీ సేల్స్ తోనే ఆ రికార్డును బద్దలు కొట్టి పవన్ కు అతిపెద్ద ఉత్తర అమెరికా ప్రీమియర్ వసూళ్లు తెచ్చిన మూవీగా నిలిచింది. ఇప్పుడు 2 మిలియన్ డాలర్ క్లబ్ వైపు పరుగులు పెడుతోంది.
ప్రమోషనల్ కంటెంట్, ముఖ్యంగా సెప్టెంబర్ 18న విడుదలవుతున్న ట్రైలర్, సినిమాపై మరింత బజ్ క్రియేట్ చేస్తే ప్రీమియర్ల ద్వారా 3.5 మిలియన్ల వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రత్యేక ప్రీమియర్లు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.
