పొలిటికల్ ఎంట్రీపై ఇన్నాళ్లకు క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్!
పవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ఓజీ. సాహో చిత్రంతో తనను తాను ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.
By: Madhu Reddy | 22 Sept 2025 1:05 PM ISTపవన్ కళ్యాణ్ తాజాగా నటిస్తున్న చిత్రం ఓజీ. సాహో చిత్రంతో తనను తాను ప్రూవ్ చేసుకున్న డైరెక్టర్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాలో ఆయనకు జోడిగా ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డీవీవీ దానయ్య నిర్మించిన ఈ చిత్రం సెప్టెంబర్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ లో ప్రీమియర్ షోలకు అనుమతి రాగా.. ఆంధ్ర ప్రదేశ్ లో అప్పుడే టికెట్ బుకింగ్ కూడా మొదలయ్యాయి.
విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్ వస్తుందని అభిమానులను వూరించారు చిత్ర బృందం.అందులో భాగంగానే నిన్న హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం వేదికగా ఓజీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఘనంగా నిర్వహించారు. ఈవెంట్లో ట్రైలర్ రిలీజ్ చేస్తామన్నారు. కానీ ఈవెంట్ లో ట్రైలర్ రిలీజ్ చేశారు. అయితే అఫీషియల్ గా విడుదల చేయలేదు. దీంతో అభిమానులు నిరాశ వ్యక్తం చేయగా.. పవన్ కళ్యాణ్ ఎందుకు ట్రైలర్ రిలీజ్ చేయలేదు అని సుజీత్ ని అడగగా.. ఆయన ఎడిటింగ్ పూర్తి కాలేదని క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ వేదికను అలంకరించిన పవన్ కళ్యాణ్ సినిమా విషయాలతో పాటు తన రాజకీయ ఎంట్రీపై కూడా క్లారిటీ ఇచ్చారు.
రాజకీయాల్లోకి రావడం పై ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేస్తూ.. దర్శకుడు సుజీత్ లాంటివాళ్ళు అప్పట్లో ఉండుంటే తాను రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదు అంటూ వ్యాఖ్యానించడం వైరల్ గా మారింది. అసలు విషయంలోకి వెళ్తే.. నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ కి కత్తితో స్టేజ్ పైకి ఎంట్రీ ఇచ్చి.. ఊర మాస్ లుక్ లో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.." నేను సినిమా ప్రేమికుడిని. సినిమా చేసేటప్పుడు సినిమా తప్ప నాకు ఎలాంటి ఆలోచన ఉండదు. రాజకీయాల్లో కూడా నా ప్రవర్తన అలాగే ఉంటుంది. నాకు జపనీస్ రాదు. దర్శకుడు సుజిత్ పట్టుబట్టి మరీ నాకు జపనీస్ నేర్పించారు. ఆయన దర్శకత్వంలో టీం అద్భుతంగా పనిచేస్తుంది. ఇలాంటి టీం నేను దర్శకత్వం చేసే సమయంలో ఉండుంటే బహుశా రాజకీయాల్లోకి వచ్చేవాడిని కాదేమో" అంటూ పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
పవన్ కళ్యాణ్ తదుపరి సినిమాల విషయానికి వస్తే.. హరీష్ శంకర్ దర్శకత్వంలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతోంది. ఇందులో శ్రీ లీల హీరోయిన్గా నటిస్తూ ఉండగా రాశి ఖన్నా కీలకపాత్ర పోషిస్తుంది. ఈ సినిమా తర్వాత 'హరిహర వీరమల్లు 2' సినిమా కూడా పూర్తి చేయబోతున్నారు. మరి ఈ సినిమాల తర్వాత పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాలలో నటిస్తారా? లేక రాజకీయ జీవితానికి అంకితం అవుతారా? అన్నది చూడాలి.
