ఓజీ కథ కంచికి..
ఓజీ థియేట్రికల్ రన్ ఇంతటితో ముగిసినట్లే భావించాలి. ఇకపై వచ్చే షేర్‌ను లెక్కల్లోకి తీసుకునే పరిస్థితి లేదు.
By: Garuda Media | 15 Oct 2025 8:00 PM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానుల్లో చాలా ఏళ్ల తర్వాత మంచి జోష్ నింపిన సినిమా.. ఓజీ. దీనికి రిలీజ్ ముంగిట వచ్చిన హైప్ వేరు. అది ఓపెనింగ్స్ రూపంలోనూ ప్రతిఫలించింది. సినిమాకు ఎబోవ్ యావరేజ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర ఏమాత్రం నిలుస్తుందో.. న్యూట్రల్ ఆడియన్స్ ఏమేర ఆదరిస్తారో అన్న సందేహాలు కలిగాయి. కానీ ఈ చిత్రం అంచనాలను మించే వసూళ్లు రాబట్టింది. మూడో వీకెండ్ వరకు సినిమా మంచి వసూళ్లు రాబట్టింది.
తొలి వీకెండ్ తర్వాత డౌన్ అయినా.. వీకెండ్ వచ్చేసరికి సినిమా పుంజుకుంది. సమయానికి టికెట్ల ధరలు తగ్గించడం కూడా కలిసొచ్చింది. గత వీకెండ్లో కొత్త సినిమాలేవీ ప్రభావం చూపకపోవడంతో కాంతారతో పాటు ఓజీ కూడా అడ్వాంటేజ్ తీసుకున్నాయి. శని, ఆదివారాల్లో ఓజీ మంచి ఆక్యుపెన్సీలతో నడిచింది. ఐతే మూడో వీకెండ్ తర్వాత మాత్రం ఓజీ బాగా డౌన్ అయిపోయింది. సోమవారం నుంచి నామమాత్రపు వసూళ్లు వస్తున్నాయి.
ఓజీ థియేట్రికల్ రన్ ఇంతటితో ముగిసినట్లే భావించాలి. ఇకపై వచ్చే షేర్‌ను లెక్కల్లోకి తీసుకునే పరిస్థితి లేదు. బుధవారం నుంచే దీపావళి సినిమాల సందడి మొదలైపోతుంది. మిత్రమండలి ప్రిమియర్స్ పడుతున్నాయి. మూడు రోజుల వ్యవధిలో నాలుగు కొత్త సినిమాలు వస్తుండడంతో ఇక ప్రేక్షకులు ఓజీని పట్టించుకునే పరిస్థితి ఉండకపోవచ్చు. కానీ కాంతార మాత్రం ఇంకా కొన్ని రోజులు ప్రభావం చూపేలాగే ఉంది. వీక్ డేస్‌లో కూడా ఈవెనింగ్, నైట్ షోలకు ఆ సినిమా జనాలను థియేటర్లకు బాగానే రప్పిస్తోంది.
విజువల్ అప్పీల్ ఉన్న భారీ చిత్రం కావడం దానికి ప్లస్ పాయింట్. దీపావళి సినిమాల పోటీని కూడా తట్టుకుని కాంతార నిలబడే అవకాశాలున్నాయి. ఓజీ థియేట్రికల్ రన్ మాత్రం ముగిసినట్లే. ఈ సినిమా ఈ నెల 23న ఓటీటీలోకి కూడా వచ్చేయబోతోంది కాబట్టి ఇంతటితో ఓజీ కథ కంచికి చేరినట్లే. యుఎస్‌లో భారీ లాభాలు అందుకున్న ఈ సినిమా.. నైజాంలోనూ ప్రాఫిట్స్ తెచ్చిపెట్టింది. ఏపీలో చాలా ఏరియాలు బ్రేక్ ఈవెన్ అయ్యాయి. కొన్ని ఏరియాలు మాత్రం స్వల్ప నష్టాలతో ముగియనున్నాయి.
