పవన్ OG.. ఇది కిక్కిచ్చే రికార్డ్!
టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో రూపొందిన ఓజీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
By: M Prashanth | 6 Oct 2025 6:21 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబినేషన్ లో రూపొందిన ఓజీ మూవీ రీసెంట్ గా రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ముంబై బ్యాక్ డ్రాప్ లో గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కిన ఆ సినిమా సెప్టెంబర్ 25వ తేదీన వరల్డ్ వైడ్ గా విడుదలైంది. కానీ ముందు రోజు ప్రీమియర్స్ నుంచే సందడి మొదలైంది.
అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు క్రియేట్ చేసుకున్న ఓజీ మూవీ.. బాక్సాపీస్ వద్ద భారీ ఓపెనింగ్స్ సాధించింది. అడ్వాన్స్ బుకింగ్స్ ఓ రేంజ్ లో జరగడంతో తొలి రోజు రూ.154 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఇప్పుడు రిలీజ్ అయిన 11 రోజుల్లో రూ.308 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రూ.300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
అయితే తాజాగా ఓజీ మూవీ మరో అరుదైన ఘనత సాధించింది. రిలీజ్ అయిన సెకెండ్ వీకెండ్.. క్రేజీ ఫీట్ ను అందుకుంది. 2025లో అత్యధిక గ్రాస్ వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 11 రోజుల్లో రూ.308 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేశారు. కలెక్షన్ల వివరాలు పంచుకున్నారు.
రూల్స్ లేవు. చట్టాలు లేవు. గంభీర ‘లా’ మాత్రమే ఉంది. ఇతడే ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటూ పోస్ట్ చేశారు. నిజానికి.. టాలీవుడ్ సీనియర్ హీరో, విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ.. ఇప్పటి వరకు ఈ ఏడాదిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఆ మూవీ ఫుల్ రన్ లో రూ.303 కోట్లు సాధించింది.
దాన్ని ఇప్పుడు ఓజీ మూవీ.. 11 రోజుల్లోనే అధిగమించింది. తద్వారా 2025లో హైయెస్ట్ గ్రాస్ కలెక్షన్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఇప్పుడు ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారగా.. పవర్ స్టార్ అభిమానులు స్పందిస్తున్నారు. మేకర్స్ కు కంగ్రాట్స్ చెబుతున్నారు. ఇది కదా పవన్ మూవీ అంటూ సందడి చేస్తున్నారు.
కాగా, సినిమా విషయానికొస్తే.. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య, కళ్యాణ్ దాసరి నిర్మించారు. తమన్ మ్యూజిక్ అందించారు. పవన్ సరసన ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించారు. శ్రియా రెడ్డి, అర్జున్ దాస్, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్, అభిమన్యు సింగ్, ఇమ్రాన్ హష్మీ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
