పవన్ కల్యాణ్‌పై అవన్నీ కేవలం పుకార్లే
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆయన టీమ్ తాజాగా తెరదించింది.
By: Sivaji Kontham | 24 March 2026 9:20 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి చిత్రాల విషయంలో తీసుకుంటున్న నిర్ణయాలపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి ఆయన టీమ్ తాజాగా తెరదించింది. ఇటీవల జరిగిన 'ఉస్తాద్ భగత్ సింగ్' ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను భవిష్యత్తులో మరిన్ని సినిమాలు చేస్తానని ప్రకటించారు. ఈ వ్యాఖ్యలతో ఉత్సాహం పొందిన పలువురు దర్శకులు, నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారని... ఇప్పటికే కొన్ని ప్రాజెక్టులు ఓకే అయ్యాయని గుసగుసలు వైరల్ అయ్యాయి.
అయితే ఈ వార్తలపై పవన్ కళ్యాణ్ ప్రొడక్షన్ టీమ్ అయిన `పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్` అధికారికంగా స్పందించింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కొత్తగా ఎలాంటి సినిమాలను ఒప్పుకోలేదని .. సోషల్ మీడియాలో .. వెబ్ మీడియాలో కొత్త ప్రాజెక్టుల గురించి జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని వారు తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన బాధ్యతలతో బిజీగా ఉన్నారని..., కొత్త సినిమాలను ప్రారంభించే ఆలోచన ప్రస్తుతానికి లేదని టీమ్ వెల్లడించింది.
ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా కొత్త సినిమా ఖరారైతే దాని గురించి తామే అధికారికంగా ప్రకటిస్తామని టీమ్ స్పష్టం చేసింది. అభిమానులు, ప్రేక్షకులు అనవసరమైన ఊహాగానాలను నమ్మవద్దని పవన్ బృందం కోరింది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ నుంచి తదుపరి ప్రాజెక్టుల విషయంలో అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాలని సూచించారు.
మరోవైపు..పవన్ కళ్యాణ్ నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ ఇటీవలే థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఈ బాక్సాఫీస్ విషయానికి వస్తే `ఉస్తాద్ భగత్ సింగ్` ఓపెనింగ్ వసూళ్లు ఫర్వాలేదనిపించాయి. సినిమాలో పవన్ కళ్యాణ్ మేనరిజమ్స్ .. హరీష్ శంకర్ మార్క్ డైలాగులతో ఈ చిత్రం మాస్ ఆడియన్స్‌ను విశేషంగా ఆకట్టుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా మంచి కలెక్షన్లను రాబడుతోంది. పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఎలాంటి సినిమాకి కమిటవ్వలేదని తెలిపారు.
