కొత్త ప్రాజెక్టులు.. పవన్ టీమ్ పెట్టిన కండిషన్ ఇదే!
ఇలాంటి మిక్స్ డ్ ఫలితాల మధ్య, నాసిరకం కమర్షియల్ సినిమాలు చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురికావడం పవన్ కు ఇష్టం లేదట.
By: M Prashanth | 25 March 2026 10:48 PM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఇప్పుడు సినిమాల ఎంపికలో రూట్ మారుస్తున్నారు. రాజకీయాల్లో బిజీగా ఉంటూనే, మరోవైపు తన ఇమేజ్‌కు తగ్గట్టుగా పక్కా కథలను సెట్స్ పైకి తీసుకెళ్లాలని చూస్తున్నారు. గతంలో కేవలం లైన్ వినో లేదా దర్శకుల ట్రాక్ రికార్డును చూసో ఓకే చెప్పిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పవన్ కోసం ఒక ప్రత్యేక క్రియేటివ్ టీమ్ రంగంలోకి దిగింది. ఇకపై ఏ దర్శకుడైనా పవన్‌ను కలవాలంటే కేవలం ఐడియాతో వస్తే సరిపోదు, చేతిలో పక్కాగా రాసుకున్న ఫస్ట్ డ్రాఫ్ట్ ఉండాల్సిందేనని ఆ టీమ్ స్పష్టం చేస్తోంది.
నిజానికి పవన్ కల్యాణ్ కెరీర్ లో గత కొన్ని సినిమాలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. రీసెంట్ గా వచ్చిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కు ఆడియన్స్ నుంచి అంతగా పాజిటివ్ టాక్ రాలేదు. అలాగే భారీ అంచనాలతో వచ్చిన ‘హరిహర వీరమల్లు’ బాక్సాఫీస్ వద్ద ఫెయిల్ అయ్యింది. అయితే ‘OG’ చూసిన తర్వాత అభిమానుల్లో మళ్ళీ ఆ పాత పవర్ స్టార్ క్రేజ్ కనిపించింది.
ఇలాంటి మిక్స్ డ్ ఫలితాల మధ్య, నాసిరకం కమర్షియల్ సినిమాలు చేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురికావడం పవన్ ఫాన్స్ కు ఇష్టం లేదట. రాబోయే 2029 ఎన్నికల లోపు పవన్ కల్యాణ్ నుంచి వచ్చే సినిమాలు చాలా పవర్‌ఫుల్ గా ఉండాలని ఆయన టీమ్ భావిస్తోంది. అందుకే దర్శకులు పంపే కథలను ముందుగా ఈ క్రియేటివ్ గ్యాంగ్ క్షుణ్ణంగా చదువుతుంది. అందులో దమ్ముందని నమ్మకం కలిగితేనే ఆ స్క్రిప్ట్ పవన్ దగ్గరికి వెళ్తుంది. కేవలం ఫైట్లు, పాటలు మాత్రమే కాకుండా, కథలో బలం ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేలా ప్లాన్ చేస్తున్నారు. పవన్ రాజకీయ హోదాకు భంగం కలగకుండా, ఆయన ఇమేజ్ ను పెంచేలా ఉండే పాత్రలకే ఇప్పుడు ప్రాధాన్యత ఇస్తున్నారు.
ప్రస్తుతం పవన్ చేతిలో సురేందర్ రెడ్డి ప్రాజెక్టు ఉంది. ఈ ప్రాజెక్టు పూర్తి కావడానికే కొంత సమయం పట్టేలా ఉంది. ఇక కొత్త కథల విషయంలో ఏమాత్రం తొందరపడకుండా, క్వాలిటీగా ఉండాలని చూస్తున్నారు. ఓజీ ఇచ్చిన కాన్ఫిడెన్స్ తో మిగిలిన చిత్రాలు కూడా అదే రేంజ్‌లో ఉండాలని పవన్ డిసైడ్ అయ్యారు. పక్కాగా బౌండ్ స్క్రిప్ట్ తో వచ్చే దర్శకులకు మాత్రమే పవన్ అపాయింట్‌మెంట్ దొరికే అవకాశం ఉంది. ఈ మార్పు వల్ల అనవసరమైన రీమేక్ లు లేదా రొటీన్ మాస్ మసాలా కథలు తగ్గే ఛాన్స్ కనిపిస్తోంది.
అభిమానులు కూడా పవన్ నుంచి ఒక సాలిడ్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. రాజకీయాల్లో ఎంత బిజీగా ఉన్నా, వెండితెరపై ఆయన కనిపిస్తే వచ్చే ఆ ఊపు వేరు. అందుకే దర్శకులు కూడా పవన్ టీమ్ పెట్టిన ఈ కండిషన్ ను సీరియస్ గా తీసుకుంటున్నారు. పక్కా కథతో వెళ్తేనే పవన్ కాల్షీట్లు దొరుకుతాయని అర్థం చేసుకున్న దర్శకులు, ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ లో నిమగ్నమయ్యారు. మరి ఈ కొత్త నిబంధన వల్ల పవన్ కెరీర్ లో మరిన్ని పవర్‌ఫుల్ సినిమాలు వస్తాయో లేదో చూడాలి.
