Begin typing your search above and press return to search.

అన్నయ్యతో ఫెయిల్.. తమ్ముడితో పాస్ అవుతారా?

మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీసిన అనుభవం ఉన్న ఈ దర్శకుడు, ఇప్పుడు తమ్ముడితో కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

By:  M Prashanth   |   17 March 2026 1:15 PM IST
అన్నయ్యతో ఫెయిల్.. తమ్ముడితో పాస్ అవుతారా?
X

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన తదుపరి సినిమాను 'గాడ్ ఫాదర్' దర్శకుడు మోహన్ రాజాతో చేసే అవకాశం ఉందనే వార్త ఇప్పుడు ఫిలిం నగర్లో హాట్ టాపిక్‌గా మారింది. మెగాస్టార్ చిరంజీవితో సినిమా తీసిన అనుభవం ఉన్న ఈ దర్శకుడు, ఇప్పుడు తమ్ముడితో కలిసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, పవన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కడం ఖాయమని సమాచారం.

అయితే, ఈ కాంబినేషన్ పై అటు ఇండస్ట్రీలో, ఇటు అభిమానుల్లో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. నిజానికి మోహన్ రాజాకు సౌత్ లో మంచి గుర్తింపు ఉంది. కానీ, చిరంజీవితో తీసిన 'గాడ్ ఫాదర్' బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. మలయాళ హిట్ 'లూసిఫర్' రీమేక్ అయినప్పటికీ, తెలుగు ఆడియన్స్‌ను పూర్తిస్థాయిలో ఆకట్టుకోవడంలో ఈ చిత్రం తడబడింది.

స్టైలిష్ మేకింగ్ ఉన్నా, కమర్షియల్ గా పెద్ద సక్సెస్ కాలేదు. ఆ తర్వాత రామ్ చరణ్‌తో ఒక సినిమా చేయాలని మోహన్ రాజా గట్టిగానే ప్రయత్నించారు కానీ, అది కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు ఏకంగా పవన్ కళ్యాణ్‌ను లైన్లోకి తీసుకురావడం విశేషం. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్' విడుదలకు సిద్ధమైంది. ఇక మోహన్ రాజా ఒక పక్కా స్క్రిప్ట్ సిద్ధం చేసి పవన్‌ను ఒప్పించే పనిలో ఉన్నారు.

ఒకవేళ ఈ సినిమా ఓకే అయితే, అది రీమేక్ అవుతుందా లేక స్ట్రెయిట్ కథా అనేది ఇంకా తేలలేదు. అన్నయ్యతో సక్సెస్ కొట్టలేకపోయిన ఈ దర్శకుడు, తమ్ముడితోనైనా బ్లాక్ బస్టర్ అందుకుంటాడో లేదో చూడాలి. మెగా అభిమానుల్లో మాత్రం ఈ కాంబినేషన్ పట్ల మిక్స్ డ్ రియాక్షన్ కనిపిస్తోంది. పవన్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మోహన్ రాజా కథను మలచగలరా అనే సందేహాలు కొందరు వ్యక్తం చేస్తుంటే, వైవిధ్యమైన సినిమాలు తీసే దర్శకుడు కాబట్టి కొత్తగా ఉంటుందని మరికొందరు భావిస్తున్నారు.

పవన్ కళ్యాణ్ తన పొలిటికల్ షెడ్యూల్స్ మధ్యలో ఈ సినిమాకు డేట్స్ ఎలా అడ్జస్ట్ చేస్తారనేది కూడా ఒక సవాలే. అన్నీ కుదిరితే ఈ ఏడాది ఆఖర్లో ఈ ప్రాజెక్టుపై అధికారిక ప్రకటన వచ్చే వీలుంది. ఏదేమైనా మోహన్ రాజా టాలెంట్ మీద మెగా ఫ్యామిలీకి నమ్మకం ఉన్నట్లు కనిపిస్తోంది. అందుకే ఒకరి తర్వాత ఒకరు ఆయనకు అవకాశం ఇస్తున్నారు. చరణ్ చేజారిన ప్రాజెక్ట్ ఇప్పుడు పవన్ వద్దకు చేరింది. మరి ఈ క్రేజీ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్లి మెగా ఫ్యాన్స్‌ను అలరిస్తుందో లేదో తెలియాలంటే కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.