అటు షూటింగ్స్.. ఇటు పాలిటిక్స్.. పవన్ సేమ్ ప్లాన్..
ఆ సెట్లు పవన్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది.
By: M Prashanth | 30 Jan 2026 4:14 PM ISTటాలీవుడ్ పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు సినిమాలు.. ఇటు రాజకీయాలు రెండింటినీ సరైన రీతిలో బ్యాలెన్స్ చేసుకుని కెరీర్ లో ముందుకు వెళ్లేలా ప్రత్యేక ప్లాన్ తో ఉన్నట్లు మరోసారి క్లియర్ గా తెలుస్తోంది. ఇప్పుడు ఆ విషయంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తాజాగా మంగళగిరిలోని ఆయన డిప్యూటీ సీఎం కార్యాలయం సమీపంలో మూడు ప్రత్యేక సెట్లు ఏర్పాటు చేస్తున్నారని సమాచారం.
ఆ సెట్లు పవన్ హీరోగా టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డి తెరకెక్కిస్తున్న కొత్త సినిమా కోసం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ప్రభుత్వ బాధ్యతల్లో ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రజా సమస్యలు, అధికారిక సమావేశాలు, పార్టీ కార్యక్రమాలు ఇలా రోజువారీ షెడ్యూల్ బిజీగా ఉంది. దీంతో షూటింగ్ ల కోసం హైదరాబాద్ వంటి ప్రాంతాలకు తరచుగా వెళ్లడం కష్టంగా మారుతోంది.
అందుకే టైమ్ సేవ్ చేసుకునేందుకు తన కార్యాలయానికి దగ్గర్లోనే షూటింగ్ సదుపాయాలు కల్పించుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీనిలో భాగంగా మంగళగిరి ఆఫీస్ పరిసరాల్లో ఒక భారీ సెట్ తో పాటు మరో రెండు చిన్న సెట్లు నిర్మిస్తున్నారు. ప్రధాన యాక్షన్ సన్నివేశాలు, కీలక సీక్వెన్స్ ల కోసం పెద్ద సెట్ ఉపయోగపడనుండగా, మిగతా రెండు సెట్లు ఇతర సన్నివేశాల చిత్రీకరణకు వినియోగించనున్నట్లు సమాచారం.
ఇలా సెట్లు దగ్గర్లో ఉండటం వల్ల అవసరమైనప్పుడు వెంటనే షూటింగ్ కు హాజరై, మిగతా సమయం పాలనాపరమైన పనుల్లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఇది పవన్ కళ్యాణ్ కు కొత్త విషయం కాదు. ఇంతకుముందు తెరకెక్కిన హరి హర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాల సమయంలో కూడా ఇలాంటి పద్ధతినే అనుసరించారు.
అప్పట్లో కూడా షూటింగ్ షెడ్యూల్ ను ఆయన రాజకీయ కార్యక్రమాలకు అనుగుణంగా ప్లాన్ చేసి, దగ్గర్లోనే సెట్లు ఏర్పాటు చేసి పనులు పూర్తి చేశారు. ఇప్పుడు అదే విధానాన్ని మరోసారి అమలు చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇక సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుందని సమాచారం. పవన్ కళ్యాణ్ పాత్ర పవర్ ఫుల్ గా, అభిమానులను అలరించేలా ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
కథ, యాక్షన్ ఎలిమెంట్స్, కమర్షియల్ మాస్ సన్నివేశాలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నట్లు సమాచారం. ఒకవైపు ప్రజాసేవ, మరోవైపు సినిమాలు రెండింటినీ ఈక్వల్ గా నడిపిస్తూ ముందుకు సాగుతున్న పవన్ కళ్యాణ్ ప్లాన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. మంగళగిరినే షూటింగ్ హబ్ గా మార్చే ప్రయత్నంతో సినిమా పనులు వేగంగా పూర్తవుతాయని అభిమానులు భావిస్తున్నారు. త్వరలోనే మూవీ షూటింగ్ స్టార్ట్ కానుందని వినికిడి.
