Begin typing your search above and press return to search.

ప‌వ‌న్ ప్లానింగ్ బాగానే ఉంది కానీ వ‌ర్కౌట్!

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని- సినీ కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడంలో స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది.

By:  Srikanth Kontham   |   16 March 2026 9:00 PM IST
ప‌వ‌న్ ప్లానింగ్ బాగానే ఉంది కానీ వ‌ర్కౌట్!
X

పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణాన్ని- సినీ కెరీర్‌ను బ్యాలెన్స్ చేయడంలో స్పష్టమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నట్లు కనిపిస్తోంది. అయితే ప్లానింగ్ ఎంత బాగున్నా? అది ఆచరణలో ఎంత వరకు వర్కవుట్ అవుతుందనేదే అసలైన ప్రశ్న? రాజకీయాల్లో ఉన్న చాలామంది నేతలకు రియల్ ఎస్టేట్, కాంట్రాక్టులు , ఇత‌ర వ్యాపారాలు వంటి మార్గాలు ఉంటాయి. వాటి ద్వారా ఎంతో కొంత ఆదాయం స‌మ‌కూరుతుంది. కానీ పవన్‌కు అటువంటి వ్యాపార నేపథ్యం ఏదీ లేదు. ఆయనకు తెలిసిన ఏకైక మార్గం ఒక్క‌టే. అదే అత్యధిక ఆదాయం ఇచ్చే వనరు సినిమా మాత్రమే.

అయితే ప‌వ‌న్ సినిమాలను ఒక గ్లామర్ ఫీల్డ్‌లా కాకుండా, ఆర్థిక పునాదిని బలపరిచే ఒక ప్రధాన బిజినెస్ గా భావించాల్సిన సమయం ఆసన్నమైంది. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలన్నా? పార్టీని నడపాలన్నా భారీగా నిధులు అవసరం. అందుకే, తనకు పట్టున్న సినీ రంగాన్ని ఆయన వ్యాపారంగా మార్చుకుని పని చేయాలి. అయితే ఇందులో ఆయన పాత్ర ఏమిటి? హీరోగా కొనసాగాలా లేక నిర్మాణ రంగం వైపు అడుగులు వేయాలా? అన్నది ఇప్పుడు ఆయన ముందున్న ఛాలెంజ్.

పవన్ కేవలం హీరోగా మాత్రమే కొనసాగితే పారితోషికం మాత్ర‌మే వ‌స్తుంది. ఒక సినిమాకు సంతకం చేస్తే ఆయ‌న మార్కెట్ ఆధారంగా రెమ్యునరేషన్ అందుతుంది. ఇందులో ఎలాంటి ఆర్థిక రిస్క్ ఉండదు. కేవలం డేట్స్ కేటాయిస్తే సరిపోతుంది. రాజకీయాల్లో బిజీగా ఉన్న ఆయనకు ఇది అత్యంత సురక్షితమైన , సులువైన మార్గం. ఎందుకంటే సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఆయనకు అందాల్సిన పారితోషికం అందుతుంది.

మరోవైపు నిర్మాతగా మారితే లాభాలు భారీగా ఉండే అవకాశం ఉంది. కానీ దాంతో పాటు రిస్క్ కూడా తోడవుతుంది. నిర్మాతగా సొంత డబ్బు పెట్టాలి లేదా మార్కెట్ నుండి నిధులు సేకరించాలి. సినిమా హిట్ అయితే పారితోషికం కంటే రెట్టింపు లాభాలు వస్తాయి. కానీ ఆశించిన ఫలితం రాకపోతే పెట్టిన పెట్టుబడి వెనక్కి రావడం కష్టమవుతుంది. పైగా నిర్మాణ వ్యవహారాలు చూసుకోవడానికి చాలా సమయం కేటాయించాలి. ఇది ఆయన రాజకీయ కార్యకలాపాలకు కొంత అడ్డంకిగా మారవచ్చు.

గతంలో పవన్ `పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్` ద్వారా కొన్ని చిత్ర నిర్మాణాల్లో భాగస్వామిగా ఉన్నారు. ఇప్పుడు తన స్నేహితులతో కలిసి చిన్న సినిమాలను నిర్మించడం లేదా తన సినిమాల్లో వాటా తీసుకోవడం వంటివి చేస్తున్నారు. అయితే ఒక పూర్తిస్థాయి వ్యాపారవేత్తగా మారి నిర్మాణ రంగంలో స్థిరపడతారా లేక పవర్ స్టార్ ఇమేజ్‌తో కేవలం రెమ్యునరేషన్ తీసుకుంటూనే తన ఆర్థిక అవసరాలను తీర్చుకుంటారా అనేది చూడాలి.

పవన్ కళ్యాణ్ తనకున్న క్రేజ్‌ను ఎలా క్యాష్ చేసుకుంటారనే దానిపైనే ఆయన రాజకీయ భవిష్యత్తు ఆర్థిక బలం ఆధారపడి ఉంది. ప్లానింగ్ పేపర్ మీద బాగున్నా అది కార్యరూపం దాల్చి ఆదాయాన్ని తెచ్చిపెట్టాలి. హీరోగా పారితోషికం తీసుకోవడం సురక్షితమైన మార్గమైతే, నిర్మాతగా రిస్క్ తీసుకోవడం అనేది సాహసోపేతమైన నిర్ణయం అవుతుంది. ఈ రెండింటిలో పవన్ ఏ మార్గాన్ని ఎంచుకుని తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మిస్తారో కాలమే నిర్ణయిస్తుంది.