Begin typing your search above and press return to search.

ఉప ముఖ్య‌మంత్రి సింగ్ సాబ్ లుక్ అదుర్స్

నాందేడ్ పర్యటన ముగించుకుని ఈ సాయంత్రమే పవన్ కళ్యాణ్ తన సతీమణి శ్రీమతి అన్నా కొణిదెలతో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు.

By:  Sivaji Kontham   |   26 Jan 2026 9:15 AM IST
ఉప ముఖ్య‌మంత్రి సింగ్ సాబ్ లుక్ అదుర్స్
X

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర- నాందేడ్‌లో సిక్కు సంప్రదాయ దుస్తుల్లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆస‌క్తిక‌రంగా ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న‌తో పాటు ఆయ‌న స‌తీమ‌ణి శ్రీ‌మ‌తి అన్నా లెజ‌నోవా కొణిదెల‌ కూడా ఉన్నారు. ప‌ర్య‌ట‌న నుంచి తిరిగి వ‌స్తున్న‌ప్ప‌టి ఫోటోలు ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతున్నాయి. అయితే ఈ పర్యటనకు సంబంధించిన విశేషాలు, దాని వెనుక ఉన్న గొప్ప ఉద్దేశ్యం ప‌రిశీలిస్తే తెలిసిన సంగ‌తులు ఇలా ఉన్నాయి.

సిక్కుల తొమ్మిదవ గురువు గురు తేగ్ బహదూర్ 350వ షాహిదీ సమాగమం (బలిదాన స్మారక ఉత్సవం) లో పాల్గొనేందుకు పవన్ కళ్యాణ్ నాందేడ్ వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన తలకు సంప్రదాయ సిక్కు తలపాగా ధరించి, సిక్కు సోదరుల పట్ల తనకున్న గౌరవాన్ని చాటుకున్నారు. ఈ విభిన్నమైన లుక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.

ఆయ‌న ప‌ర్య‌ట‌న ఎలా సాగింది? అంటే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ తో కలిసి ఆయన ప్రఖ్యాత `తఖ్త్ సచ్ ఖండ్ శ్రీ హజూర్ సాహిబ్` గురుద్వారాను సందర్శించారు. గురు గోవింద్ సింగ్ సమాధి వద్ద ప్రార్థనలు చేసి, పవిత్ర చాదర్ సమర్పించారు. అనంత‌రం గురుద్వారా కమిటీ ఆయనను ఘనంగా సత్కరించి, సిక్కుల పవిత్ర ఆయుధమైన `కిర్పాన్`ను బహుకరించింది. ఈ సందర్భంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ ``గురు తేగ్ బహదూర్ సింగ్ త్యాగం కేవలం ఒక మతానికి సంబంధించింది కాదు.. అది యావత్ భారత దేశానికి స్ఫూర్తిదాయకం. దేశం కోసం, ధర్మం కోసం ఆయన ప్రాణాలర్పించారు`` అని కొనియాడారు.

గణతంత్ర వేడుకలకు సన్నద్ధం:

నాందేడ్ పర్యటన ముగించుకుని ఈ సాయంత్రమే పవన్ కళ్యాణ్ తన సతీమణి శ్రీమతి అన్నా కొణిదెలతో కలిసి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. రేపు ఉదయం అమరావతి పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగే 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఉప ముఖ్యమంత్రి దంపతులు హాజరుకానున్నారు. పవన్ కళ్యాణ్ కేవలం రాజకీయ నాయకుడిగానే కాకుండా, భారతీయ సంస్కృతిని, వివిధ మతాల గొప్పతనాన్ని గౌరవించే వ్యక్తిగా తన ప్రత్యేకతను మరోసారి చాటుకున్నారు.

నాందేడ్ గురుద్వారాలో పవన్ కళ్యాణ్ పవిత్ర కిర్పాన్ పట్టుకున్న ఫోటోలు ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఒక శిక్కు సోద‌రుని గెట‌ప్ లో ప‌వ‌న్ ఆహార్యం అభినివేశం అద్భుతంగా ఉంద‌ని, ప‌వ‌న్ ని సందీప్ వంగా `యానిమ‌ల్ పార్క్`లో ఒక ప‌వ‌ర్ ఫుల్ రాజ‌కీయ నాయ‌కుడిగానో లేదా ప‌వ‌ర్ ఫుల్ పోలీసాఫీస‌ర్ గానో చూడాల‌ని అభిమానులు కోరుకుంటున్నారు! ఒక‌వేళ సందీప్ వంగా లాంటి ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడు చ‌రిత్ర‌కారుడు, మ‌హోన్న‌త వీరుడైన‌ `భ‌గ‌త్ సింగ్` పాత్ర‌లో ప‌వ‌న్ ని ఆవిష్క‌రిస్తే చూడాల‌ని కూడా ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.