పవన్ తో ఇంకొకటి అంటే..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది.
By: M Prashanth | 23 March 2026 12:00 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మాస్ డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. గతంలో వీరిద్దరి కలయికలో వచ్చిన గబ్బర్ సింగ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించి, అభిమానుల్లో ఎప్పటికీ గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. అదే జోష్ తో ఇటీవల వీరి కాంబోలో తెరకెక్కిన ఉస్తాద్ భగత్ సింగ్ విడుదలైంది.
అయితే ఆ చిత్రం ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ ను రాబట్టలేకపోయింది. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మిక్స్ డ్ టాక్ రావడంతో సినిమాపై సోషల్ మీడియాలో చర్చలు కొనసాగుతున్నాయి. భారీ అంచనాల మధ్య వచ్చిన ఆ ప్రాజెక్ట్ కు క్లియర్ హిట్ రిజల్ట్ రాకపోవడం అభిమానులను కొంత నిరాశకు గురిచేసింది. అయినప్పటికీ సినిమాలో పవన్ కళ్యాణ్ స్టైలిష్ ప్రెజెన్స్, హరీష్ శంకర్ మాస్ టేకింగ్ వంటి అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మరో ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఇటీవల అభిమానులతో జరిగిన ఓ ఇంటరాక్షన్ లో హరీష్ శంకర్, పవన్ తో మరో సినిమా చేయనున్నట్లు ప్రకటించారు. దాని కథ పూర్తిగా భిన్నంగా ఉండి, కేవలం ఫ్యాన్స్ కే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని ఆయన తెలిపారు. దీంతో ఇప్పుడు సినీ ప్రియుల్లో కొన్ని డౌట్స్ వస్తున్నాయి.
ముఖ్యంగా పవన్ డేట్స్ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ఉస్తాద్ భగత్ సింగ్ ప్రాజెక్ట్ పూర్తయ్యేందుకు చాలా కాలం పట్టింది. మొదట ఆ సినిమా భవదీయుడు భగత్ సింగ్ పేరుతో ప్రారంభమై, కథలో మార్పులతో ఉస్తాద్ భగత్ సింగ్ గా మారింది. సినిమా షూటింగ్ కూడా పలుమార్లు ఆగిపోయింది. పవన్ పొలిటిక్స్ లో బిజీ కారణంగా షూటింగ్ నిలిచిపోయి మళ్లీ ప్రారంభమైంది.
ముఖ్యంగా హరిహర వీరమల్లు, ఓజీ వంటి సినిమాల షూటింగ్స్ కు సమయం కేటాయిస్తూ ఉస్తాద్ ను పూర్తి చేశారు పవన్. ఇప్పుడు మరోసారి హరీష్ శంకర్ తో సినిమా అంటే అదే పరిస్థితి తిరిగి వస్తుందోనన్న చర్చ జరుగుతోంది. అంతేకాదు, పవన్ ఇప్పటికే దర్శకుడు సురేందర్ రెడ్డితో కొత్త ప్రాజెక్ట్ కు కమిట్ అయ్యారు. ఆ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది.
అలాగే మరికొన్ని ప్రాజెక్ట్‌లు కూడా లైన్ లో ఉన్నాయని తెలుస్తోంది. ఇక హరీష్ శంకర్ విషయానికి వస్తే.. పవన్ కోసం ఆయన చాలా కాలం వెయిట్ చేసిన విషయం తెలిసిందే. ఆ గ్యాప్ లో మిస్టర్ బచ్చన్ సినిమాను తెరకెక్కించి విడుదల కూడా చేశారు. అయినప్పటికీ పవన్ తో మరో సినిమా చేయాలనే ఆసక్తిని ఆయన వదులుకోలేదని చెప్పాలి. ఏదేమైనా పవన్ కళ్యాణ్- హరీష్ శంకర్ కాంబోలో మరో ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుంది? పవన్ డేట్స్ ఎలా సెట్ అవుతాయి? కథ ఏ రేంజ్ లో ఉంటుంది? వంటి ప్రశ్నలకు మాత్రం సమాధానం రావాల్సి ఉంది.
