ఉత్తరాంధ్ర నుంచే పవన్ తొలి యాక్షన్ ప్లాన్ !
జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ఫోకస్ పెడుతున్నారు. ఆయన ఉత్తర కోస్తా ప్రాంతాన్ని తమ వైపు మరింత గట్టిగా తిప్పుకోవాలనే కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు.
By: Satya P | 21 Aug 2025 8:52 AM ISTజనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఉత్తరాంధ్ర ఫోకస్ పెడుతున్నారు. ఆయన ఉత్తర కోస్తా ప్రాంతాన్ని తమ వైపు మరింత గట్టిగా తిప్పుకోవాలనే కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. గోదావరి జిల్లాల తర్వాత జనసేనకు ఉత్తరాంధ్ర రాజకీయంగా అత్యంత బలమైన ప్రాంతం అన్నది తెలిసిందే. సామాజిక సమీకరణలు అనేకం జనసేనకు కలసివచ్చేలా ఉంటాయని కూడా చెబుతారు. అంతే కాదు మెగా ఫ్యాన్స్ కి పుట్టినిల్లు ఉత్తరాంధ్ర. దాంతో జనసేన మరింత పటిష్టంగా మారేందుకు ఉత్తరాంధ్ర వేదిక మీద నుంచే తన తొలి యాక్షన్ ప్లాన్ ని స్టార్ట్ చేయబోతోంది.
అధికారంలోకి వచ్చాక తొలిసారి :
ఏపీలో టీడీపీ కూటమితో కలసి జనసేన తొలిసారి అధికారంలోకి వచ్చింది. ఉప ముఖ్యమంత్రి పదవిని కూడా పవన్ అందుకున్నారు. ఇక కూటమి పవర్ లోకి వచ్చి కూడా పదిహేను నెలలు గడచిపోయాయి. దాంతో ఇంతకాలం ప్రభుత్వం మంత్రిత్వ శాఖలు అంటూ బిజీగా గడపిన పవన్ ఇపుడు పార్టీ మీద కూడా దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ఈ క్రమంలో జనసేన కార్యకర్తల సమావేశం విశాఖ వేదికగా ఈ నెల 30న నిర్వహిస్తున్నారు. ఈ సమావేశం ద్వారా ఉత్తరాంధ్ర జనసేన పార్టీలో భారీ కదలిక తీసుకుని రావాలని నిర్ణయించారు.
ప్రాతినిధ్యం మరింతగా :
ఇక చూస్తే కనుక జనసేనకు ఉత్తరాంధ్ర జిల్లాలలో ఆరు ఎమ్మెల్యే సీట్లు ఉన్నాయి. ఉమ్మడి విశాఖలో నాలుగు విజయనగరం లో ఒకటి ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఒకటి ఉన్నాయి. రానున్న రోజులలో ఈ బలం మరింత పెంచుకోవాలని చూస్తున్నారు. అంతే కాదు పార్టీ పరంగా ద్వితీయ తృతీయ శ్రేణి నాయకత్వాన్ని ప్రోత్సహించడం ద్వారా వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో జెండా బలంగా ఎగరేయాలని చూస్తున్నారు.
నాగబాబు పర్యటన తర్వాత :
ఉత్తరాంధ్రాలోని జనసేనలో కొంత అసంతృప్తి ఉంది అని అంటున్నారు. ఎమ్మెల్సీ నాగబాబు పర్యటన తర్వాత ఆ విషయం వెల్లడి అయింది. అన్ని చోట్లా టీడీపీ ఆధిపత్యం వల్ల తాము ఇబ్బంది పడుతున్నామని కూడా నేతలు చెబుతున్నారు. అయితే సర్దుకుని పోవాలని నాగబాబు హితవు చెప్పారు. ఈ క్రమంలో పార్టీలో ఏమి జరుగుతోంది. గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ ఏమిటి అన్నది కూడా ఈ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాల ద్వారా అధినేత పవన్ తెలుసుకుంటారు అని అంటున్నారు.
పటిష్టంగా ఉంటేనే డిమాండ్:
అధినేత హోదాలో కార్యకర్తల సమస్యలు వింటూనే పార్టీని పటిష్టం చేయాలని పవన్ సూచిస్తారని ఆ విధంగా దిశా నిర్దేశం చేస్తారని అంటున్నారు. పార్టీ బలంగా ఉంటేనే పొత్తులో ఎక్కువ సీట్లు కోరగలమని కూడా ఆయన చెబుతారని అంటున్నారు.స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి అంటే ఇప్పటి నుంచే జనంలో ఉండాలని ఆయన కోరుతారని అంటున్నారు. ఏది ఏమైనా అధికారంలోకి వచ్చిన తరువాత తొలిసారిగా ఉత్తరాంధ్ర పార్టీ క్యాడర్ తో పవన్ సమావేశం జరపడం పట్ల అంతా ఆనందంగా ఉన్నారు. అజెండా కూడా క్యాడర్ ని దృష్టిలో పెట్టుకుని రూపొందిస్తున్నారు. ఈ సమావేశం తరువాత మరింత బలంగా జనసేన ఉత్తరాంధ్రాలో తయారు అయ్యే విధంగా పవన్ మార్క్ కార్యాచరణ ఉంటుందని అంటున్నారు. దాంతో జనసేన అధినాయకత్వం ఉత్తరాంధ్రా మీట్ మీద సర్వత్రా చర్చ సాగుతోంది.
