పాలిటిక్స్‌లో ఉన్నా నా గుండెల్లోంచి సినిమాని తీసేయలేరు: పవన్ కల్యాణ్
తన రాజకీయ ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగినా.. తన బలం , బలగం ఎప్పుడూ అభిమానులేనని పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో చెప్పారు.
By: Sivaji Kontham | 16 March 2026 9:56 AM ISTహైదరాబాద్‌లో జరిగిన `ఉస్తాద్ భగత్ సింగ్` ప్రీ-రిలీజ్ వేడుకలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగం ఒక నటుడి ఆవేదనను, ఒక నాయకుడి ఆలోచనను ప్రతిబింబించింది. రాజకీయాల్లో బిజీగా ఉన్నా కానీ.. తన మూలాలు ఎక్కడున్నాయో స్పష్టం చేస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ముఖ్యంగా ``రాజకీయాల్లో ఉన్నా నా గుండెల్లోంచి సినిమాను ఎవరూ తీసేయలేరు`` అని ఆయన చెప్పిన డైలాగ్ సినీ పరిశ్రమపై ఆయనకున్న చెక్కుచెదరని మక్కువను చాటిచెప్పాయి.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ సమాజంలో సినిమా పాత్రను విశ్లేషిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దక్షిణాది రాష్ట్రాల ప్రజల జీవితాల్లో సినిమా కేవలం వినోదం మాత్రమే కాదు..అది ఒక సంస్కృతి అని ఆయన పేర్కొన్నారు. ఒకవేళ సమాజంలో సరైన వినోదం లేకపోతే.. ప్రజల్లో అసహనం పెరిగి క్రైమ్ రేటు విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. సినిమా అనేది మనిషిలోని ఒత్తిడిని తగ్గించి.. సమాజాన్ని ప్రశాంతంగా ఉంచే ఒక శక్తివంతమైన సాధనమని ఆయన అభిప్రాయపడ్డారు.
దర్శకుడు హరీష్ శంకర్ పనితీరుపై పవన్ కళ్యాణ్ ప్రశంసల వర్షం కురిపించారు. ఒక అభిమాని తన హీరోని వెండితెరపై ఎంత మాస్‌గా.. పవర్‌ఫుల్‌గా చూడాలనుకుంటాడో అంతకంటే గొప్పగా హరీష్ తనను ఈ సినిమాలో చూపించారని ఆయన వెల్లడించారు. తనలోని మాస్ ఇమేజ్‌ను ఒడిసిపట్టడంలో హరీష్ శంకర్ శైలి విలక్షణమని, ఈ సినిమాలో వచ్చే డైలాగులు ప్రస్తుత సామాజిక పరిస్థితులకు అద్దం పడుతూ అభిమానులకు కన్నుల పండుగగా ఉంటాయని భరోసా ఇచ్చారు.
సినిమా నిర్మాణంలో మైత్రీ మూవీ మేకర్స్ వహించిన బాధ్యతను.. వారి ప్యాషన్‌ను పవన్ ప్రత్యేకంగా కొనియాడారు. క్వాలిటీ విషయంలో ఎక్కడా వెనకడుగు వేయకుండా అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ చిత్రాన్ని నిర్మించారని ప్రశంసించారు. అలాగే హీరోయిన్లు శ్రీలీల ఎనర్జీ, రాశీ ఖన్నా నటన సినిమాకు అదనపు ఆకర్షణలని.. దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం ఈ సినిమాకు ప్రాణం పోసిందని ఆయన సర్టిఫికేట్ ఇచ్చారు. షూటింగ్ సమయంలో సాంకేతిక నిపుణులు పడిన కష్టాన్ని ఆయన గుర్తు చేసుకున్నారు.
తన రాజకీయ ప్రయాణం ఎన్ని మలుపులు తిరిగినా.. తన బలం , బలగం ఎప్పుడూ అభిమానులేనని పవన్ కళ్యాణ్ భావోద్వేగంతో చెప్పారు. సినిమాల ద్వారా కేవలం వినోదాన్ని పంచడమే కాకుండా.. సమాజానికి ఏదో ఒక మంచి సందేశాన్ని అందించాలన్నదే తన నిరంతర తపన అని పేర్కొన్నారు. హోదా ఏదైనా అభిమానుల మధ్య నిలబడి మాట్లాడటమే తనకు లభించే అతిపెద్ద గౌరవం.. ఆనందం అని ఆయన వినమ్రంగా చెప్పుకొచ్చారు.
చివరగా `ఉస్తాద్ భగత్ సింగ్`కేవలం బాక్సాఫీస్ వసూళ్ల కోసం తీసిన సినిమా కాదని.., ఇది ప్రేక్షకులపై ఉన్న ప్రేమతో చేసిన ప్రయత్నమని ఆయన ముగించారు. `ఎత్తరా కాలర్` వంటి పాటలు ప్రతి అభిమానికీ గూస్‌బంప్స్ తెప్పిస్తాయని 2026లో రాబోతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ చేసిన ఈ సుదీర్ఘ ప్రసంగం ఆయనలోని నిబద్ధతను, సినిమా రంగం పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావాన్ని మరోసారి రుజువు చేసింది.
