Begin typing your search above and press return to search.

పవన్ కళ్యాణ్.. దర్శకుల వేటలో ఇలా..

ప్రస్తుతం హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' లైన్ లో ఉండగా, 2029 ఎన్నికలకు ముందు పవన్ మరో రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ బలంగా వినిపిస్తోంది.

By:  M Prashanth   |   21 Nov 2025 1:00 PM IST
పవన్ కళ్యాణ్.. దర్శకుల వేటలో ఇలా..
X

ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కు డబుల్ ధమాకా దక్కింది. చాలా కాలంగా వాయిదా పడుతూ వచ్చిన 'హరిహర వీరమల్లు' ఒకవైపు, సుజీత్ కాంబినేషన్ లో వచ్చిన OG మరోవైపు ప్రేక్షకులను పలకరించాయి. ముఖ్యంగా 'ఓజీ' కమర్షియల్ గా మంచి విజయం సాధించడమే కాకుండా, ఫ్యాన్స్ కు కావాల్సిన అసలైన కిక్ ఇచ్చింది. దీంతో పవన్ సినిమాల్లో కొనసాగాలనే డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం హరీష్ శంకర్ 'ఉస్తాద్ భగత్ సింగ్' లైన్ లో ఉండగా, 2029 ఎన్నికలకు ముందు పవన్ మరో రెండు సినిమాలు చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ బలంగా వినిపిస్తోంది.

అయితే, పవన్ తో సినిమా అంటే ఇప్పుడు మామూలు విషయం కాదు. నిర్మాతలు రామ్ తళ్లూరి, టీజీ విశ్వప్రసాద్ వంటి వారు అడ్వాన్సులు ఇచ్చి గత రెండేళ్లుగా పవన్ డేట్స్ కోసం ఓర్పుతో ఎదురుచూస్తున్నారు. పవన్ బిజీ షెడ్యూల్ వల్ల ఆలస్యమవుతున్నా, వాళ్లు మాత్రం తమ అడ్వాన్స్ వెనక్కి తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. ఎప్పుడు కుదిరితే అప్పుడే సినిమా చేద్దాం అని పవన్ కు భరోసా ఇచ్చారు. పవన్ కూడా వారికి మాట ఇచ్చారు కాబట్టి, ఈ కమిట్మెంట్స్ ను పూర్తి చేయాలని డిసైడ్ అయ్యారు.

అయితే.. పవన్ ఇప్పుడు కేవలం హీరో కాదు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం. ఆయన షెడ్యూల్ చాలా టైట్ గా ఉంటుంది. ఏ రోజు షూటింగ్ కి వస్తారో, ఏ రోజు ప్రజల్లోకి వెళ్తారో కచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఇలాంటి సమయంలో పవన్ స్పీడ్ ని అందుకోవడం మామూలు దర్శకుల వల్ల అయ్యే పని కాదు. అందుకే ఇప్పుడు పవన్ కు కావాల్సింది అద్భుతమైన కథలు, స్క్రీన్ ప్లేలు రాసే క్రియేటివ్ డైరెక్టర్ల కంటే, పక్కాగా 'టైమ్ మేనేజ్మెంట్' చేసుకునే స్మార్ట్ డైరెక్టర్లు కావలి.

పవన్ షూటింగ్ కి వస్తున్నారంటే చాలు, మిగతా నటీనటులందరినీ ఆ సమయానికి సెట్ కి రప్పించడం ప్రొడక్షన్ టీమ్ కు పెద్ద టాస్క్. పవన్ లేనప్పుడు ఇతర ఆర్టిస్టుల సీన్స్ పూర్తి చేసి, పవన్ వచ్చిన ఆ కొద్ది గంటల్లోనే ఆయన సీన్స్ ను చకచకా లాగించేయాలి. ఈ మైక్రో మేనేజ్మెంట్ తెలిసిన దర్శకుడి కోసం త్రివిక్రమ్ శ్రీనివాస్ గట్టిగా వెతుకుతున్నట్లు సమాచారం. కథ బాగున్నా, నెమ్మదిగా తీసే దర్శకులు ఇప్పుడు పవన్ కు సెట్ అవ్వరు.

గతంలో సముద్రఖని లాంటి దర్శకులు తక్కువ టైమ్ లో రీమేక్ సినిమాలు పూర్తి చేసి పవన్ కు కంఫర్ట్ ఇచ్చారు. ఇప్పుడు కూడా అలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్న దర్శకుల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆ మధ్య కొన్ని పేర్లు వినిపించినా, ఎవరినీ ఇంకా ఫైనల్ చేయలేదు. పవన్ కు ఉన్న అతి తక్కువ సమయాన్ని వృథా చేయకుండా, క్వాలిటీ అవుట్ పుట్ ఇవ్వగల దర్శకుడు దొరికితేనే ఈ రెండు ప్రాజెక్టులు పట్టాలెక్కుతాయి.