Begin typing your search above and press return to search.

'OG 2' కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?

పవన్ కళ్యాణ్‌తో కొత్త సినిమా చర్చలు జరిగాయని, అంతా సానుకూలంగా ఉందని నిర్మాత దిల్ రాజు వెల్లడించారు. త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందన్నారు. రాజకీయ బాధ్యతల నేపథ్యంలో నెలకు 10-15 రోజుల చొప్పున షూటింగ్ పూర్తి చేయాలని పవన్ భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుజీత్ 'బ్లడీ రోమియో'తో బిజీగా ఉండటంతో ఈలోపు దిల్ రాజు సినిమా పట్టాలెక్కే అవకాశం కనిపిస్తోంది.

By:  M Prashanth   |   13 Nov 2026 7:30 PM IST
OG 2 కంటే ముందే పవన్ సినిమా.. ఆ ప్లాన్ సెట్టయ్యేనా?
X

ఏపీ డిప్యూటీ సీఎంగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్, మళ్లీ మేకప్ ఎప్పుడు వేసుకుంటారా అని ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అందరూ 'OG 2' కోసం ఎదురుచూస్తుంటే, అంతకంటే ముందే పవన్ మరో సినిమా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. లేటెస్ట్ గా నిర్మాత దిల్ రాజు చేసిన కామెంట్స్ తో మళ్ళీ ఆశలు చిగురించాయి. శుక్రవారం జరిగిన 'రామాయణం', 'సీన్' సక్సెస్ మీట్‌లో దిల్ రాజు ఈ విషయంపై స్పందించారు.

పవన్ కళ్యాణ్‌తో కొత్త సినిమా గురించి చర్చలు జరిగాయని, అంతా పాజిటివ్‌గా ఉందని ఆయన స్వయంగా వెల్లడించారు. అన్నీ కుదిరితే త్వరలోనే అధికారిక ప్రకటన ఉంటుందని చెప్పారు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన 'వకీల్ సాబ్' బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు మొదలయ్యాయి. ఈ కొత్త సినిమా విషయంలో పవన్ ఒక క్లియర్ ప్లాన్‌తో ఉన్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో మరో టాక్ వినిపిస్తోంది.

రాజకీయ బాధ్యతల వల్ల ఎక్కువ రోజులు కేటాయించే పరిస్థితి లేకపోవడంతో, నెలకు పది నుంచి పదిహేను రోజుల చొప్పున నాలుగు నెలల్లో తన పార్ట్ పూర్తి చేయాలని భావిస్తున్నారట. అంటే దాదాపు నలభై నుంచి అరవై రోజుల కాల్షీట్లతో పూర్తయ్యే కథ, దర్శకుడి కోసం సెర్చింగ్ మొదలైందట. నిజానికి 'OG 2' కంటే ముందు ఈ సినిమా వైపు మొగ్గు చూపడానికి బలమైన కారణమే ఉంది.

దర్శకుడు సుజీత్ ప్రస్తుతం నాని హీరోగా 'బ్లడీ రోమియో' తెరకెక్కిస్తున్నారు. సీక్వెల్ స్క్రిప్ట్ పనులు జరుగుతున్నా, నాని సినిమా షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పూర్తయితేనే సుజీత్ ఫ్రీ అవుతారు. అప్పటివరకు ఖాళీగా ఉండకుండా ఈ గ్యాప్‌ను వాడుకోవాలని పవన్ చూస్తున్నారు. ఇటు నాని 'బ్లడీ రోమియో' షూటింగ్ కూడా వేగంగానే సాగుతోంది. నవంబర్ 19 నుంచి హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో తదుపరి షెడ్యూల్ ప్రారంభం కానుంది.

సుజీత్ ఆ ప్రాజెక్ట్‌ను పూర్తి చేసేలోపు దిల్ రాజు బ్యానర్‌లో పవన్ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. ఈ మధ్యంతర ప్రాజెక్ట్ వల్ల 'OG 2' ఆలస్యమవుతుందే తప్ప ఆగిపోయే ప్రసక్తే లేదని చెప్పవచ్చు. గతంలో పెండింగ్ సినిమాలను విడతలవారీగా పూర్తి చేసిన పవన్, ఈసారి కొత్త సినిమాను పక్కా ప్లానింగ్‌తో తక్కువ రోజుల్లో ముగించాలని చూస్తున్నారు. మరి దిల్ రాజు, పవన్ కాంబినేషన్‌లో రాబోయే ఈ చిత్రానికి ఏ దర్శకుడు ఫిక్స్ అవుతారో, ఎప్పుడు సెట్స్‌పైకి వెళ్తుందో చూడాలి.