Begin typing your search above and press return to search.

విజయాలు, అపజయాలను దాటి నిలిచిన పవనిజం!

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన శకం, లక్షలాది మంది యువతను కదిలించిన ఒక భావోద్వేగం `పవనిజం`.

By:  Srikanth Kontham   |   12 Oct 2026 7:42 PM IST
విజయాలు, అపజయాలను దాటి నిలిచిన పవనిజం!
X

తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ప్రత్యేకమైన శకం, లక్షలాది మంది యువతను కదిలించిన ఒక భావోద్వేగం `పవనిజం`. టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద తనదైన ముద్ర వేసి నటుడిగానే కాకుండా ఒక శక్తిగా ఎదిగిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ సినీ రంగ ప్రవేశం చేసి నేటికి సరిగ్గా 30 ఏళ్లు పూర్తయింది. ఆయన హీరోగా పరిచయమైన తొలి చిత్రం `అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి` 1996 అక్టోబర్ 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పట్లో ఓ సాధారణ యువకుడిగా తెరపైకి అడుగుపెట్టిన మెగా హీరో అనతికాలంలోనే తెలుగు రాష్ట్రాల రాజకీయ, సాంస్కృతిక రంగాలను శాసించే స్థాయికి ఎదిగారంటే ఆ వెనుక ఆయన ముఫై ఏళ్ల ప్రయాణం ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు.

తొలి సినిమాతోనే తనలోని మార్షల్ ఆర్ట్స్ ప్రతిభను, విభిన్నమైన ఈజ్ ను ప్రదర్శించిన పవన్ కల్యాణ్ తొలి సినిమాతోనే యూత్‌ను ఆకట్టుకున్నారు. అయితే తొలి సినిమా అనంత‌రం ప‌వ‌న్ కెరీర్ ఒక్కసారిగా ఊపం దుకుంది. `గోకులంలో సీత` వంటి కుటుంబ కథా చిత్రాలతో పాటు, ఎస్‌జె సూర్య దర్శకత్వంలో వచ్చిన `ఖుషి`..అటుపై `త‌మ్ముడు` వంటి సినిమాలు ప‌వ‌న్ ను టాలీవుడ్ లో తిరుగులేని ఐకాన్‌గా నిలబెట్టాయి. ముఖ్యంగా `ఖుషి` సినిమా సృష్టించిన ట్రెండ్.. అప్పట్లో యూత్ ఫాలోయింగ్ తెలుగు సినిమా చరిత్రలోనే మైలురాయిగా నిలిచిపోయాయి.

అయితే 30 ఏళ్ల ప్రయాణం విజయాల పూలబాట మాత్రమే కాదు. కెరీర్‌లో ఎన్నో హెచ్చుతగ్గులను, భారీ పరాజయాలను కూడా పవన్ కల్యాణ్ ఎదుర్కొన్నారు. కొన్ని సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలను అందుకోకపోయినా? ఆయనపై అభిమానుల ఆదరాభిమానాలు మాత్రం ఎప్పుడూ తగ్గలేదు. ప్రతి అపజయం నుంచి కొత్త పాఠాలు నేర్చుకుంటూ మరింత పట్టుదలతో విభిన్న కథలతో ముందుకు సాగారు. `జల్సా`, `అత్తారింటికి దారేది` వంటి చిత్రాలు బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసి ఆయన స్టామినా ఏంటో? మరోసారి నిరూపించాయి.

నటుడిగా మాత్రమే కాకుండా దర్శకుడిగా `జానీ` సినిమాతో ప్రయోగానికి తెరలేపడం, నిర్మాతగా వ్యవహరించడం ఆయనలోని బహుముఖ ప్రజ్ఞకు నిదర్శనం. సినిమాల్లో ప‌వ‌న్ బాడీ లాంగ్వేజ్, నడక, సంభాషణల శైలి, సింప్లిసిటీ నేటికీ ఎంతోమంది యువ నటులకు ఇన్‌స్పిరేషన్‌గా నిలుస్తున్నాయి. సినిమాలకు అతీతంగా సమాజంపై, ప్రజా సమస్యలపై ప‌వ‌న్ మాన‌వ‌తా వాదం.. `పవనిజం` అనే భావజాలాన్ని ప్రజల్లోకి బలమైన రీతిలో తీసుకెళ్లింది. సినిమాలతో పాటు.. రాజకీయ ర‌ణ‌రంగంలోనూ ప్రత్యేక ముద్ర వేసుకుని ప్రజా నాయకుడిగా విజయ వంతమైన జ‌ర్నీని సాగిస్తున్నారు.

అంతిమంగా హీరోగా ఎంట్రీ ఇచ్చి బాక్సాఫీస్ వ‌ద్ద బాద్‌షాగా కోట్ల మంది హృదయాలను ఏలే పవర్‌స్టార్‌గా పవన్ కల్యాణ్ సాగించిన మూడు ద‌శాబ్దాల ప్రయాణం తెలుగు సినిమా చరిత్రలో అపురూప అధ్యాయం. విజయాలు, అపజయాలను సమానంగా స్వీకరిస్తూ నిత్యం శ్రమించే ప‌వ‌న్ తత్వమే నేడు ఈ మైలురాయికి అర్ధం తెచ్చింది. భ‌విష్య‌త్లో నూ ప‌వ‌న్ మరిన్ని విజయాలను అందుకోవాలని అభిమానులు మ‌న‌సారా కోరుకుంటున్నారు.