స్టార్ కిడ్స్‌కు సింపుల్ ఫుడ్!
ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ పిల్లలైన అకీరా నందన్, ఆద్య గురించి తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది.
By: Sravani Lakshmi Srungarapu | 23 Jun 2026 4:00 PM ISTసెలబ్రిటీల పిల్లల పెంపకం, వారి జీవనశైలి గురించి అభిమానుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ పిల్లలైన అకీరా నందన్, ఆద్య గురించి తరచూ సోషల్ మీడియాలో చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా రేణు దేశాయ్ తన పిల్లల ఆహారపు అలవాట్లు, పెంపకానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించడం చర్చనీయాంశంగా మారింది.
సాధారణంగా పిల్లల ఎదుగుదల విషయంలో పోషకాహారంపై అనేక అభిప్రాయాలు వినిపిస్తుంటాయి. ముఖ్యంగా నాన్‌వెజ్ తీసుకోకపోతే పిల్లల శారీరక ఎదుగుదలపై ప్రభావం పడుతుందనే అభిప్రాయం చాలామందిలో ఉంటుంది. అయితే అలాంటి అభిప్రాయాలకు తన కుటుంబం ఒక ఉదాహరణగా నిలుస్తుందని రేణు దేశాయ్ చెప్పడం విశేషం. చిన్నప్పుడు చాలామంది తనను తన పిల్లలకు నాన్‌వెజ్ పెట్టడం లేదు.. పిల్లలు ఎలా గ్రో అవుతారని ప్రశ్నించేవారని, కానీ నాన్ వెజ్ తినకపోయినా తన ఎత్తు 5.8 అడుగులని, ఆద్య 5.11 అడుగులు, అకీరా హైట్ 6.4 అడుగులని రేణు వెల్లడించారు. దీంతో పిల్లల ఎదుగుదల కేవలం నాన్‌వెజ్‌పైనే ఆధారపడదని, సమతుల్యమైన ఆహారం కూడా కీలక పాత్ర పోషిస్తుందని ఆమె పేర్కొన్నారు.
రేణు దేశాయ్ వెల్లడించిన మరో ఇంట్రెస్టింగ్ విషయాన్ని కూడా వెల్లడించారు. తన ఇంట్లో జంక్ ఫుడ్‌కు చాలా పరిమిత స్థానం మాత్రమే ఉంటుందని, నెలకు ఒక్కసారి మ్యాగీ నూడుల్స్ చేసిపెడితే అది పిల్లలకు పండగలాగా అనిపించేదని చెప్పారు. మిగతా రోజుల్లో మాత్రం ఇంట్లో రెగ్యులర్ చేసే భోజనమే తప్పనిసరిగా ఉండేదని తెలిపారు. అన్నం, పప్పు, ఫ్రై కర్రీ, గ్రేవీ కర్రీ , పచ్చడి వంటి సంప్రదాయ ఆహారమే వారి రోజూ మెనూలో ఉండేదని వెల్లడించారు.
అంతేకాదు, చాలామంది తాను వంట చేయనని భావిస్తారని, కానీ వాస్తవానికి తాను వండిన భోజనాన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారని రేణు చెప్పారు. ముఖ్యంగా తాను చేసే సోయా బిర్యానీకి అకీరా, ఆద్య ఇద్దరూ ఫ్యాన్స్ పేర్కొన్నారు. ఫ్యామిలీగా తాము పూర్తిగా వెజిటేరియన్స్ అని, పిల్లలు కూడా ఎలాంటి ఒత్తిడి లేకుండా తమ ఇష్టంతోనే అదే జీవనశైలిని ఎంచుకున్నారని ఆమె స్పష్టం చేశారు.
ప్రస్తుతం సెలబ్రిటీల ఫ్యామిలీల్లో ఫాస్ట్ ఫుడ్, ప్రాసెస్డ్ ఫుడ్ వినియోగంపై తరచూ చర్చ జరుగుతున్న సమయంలో రేణు దేశాయ్ చెప్పిన ఈ విషయాలు ప్రత్యేకంగా నిలుస్తున్నాయి. స్టార్ కుటుంబానికి చెందిన పిల్లలైనా, మామూలు ఇంటి భోజనం, మంచి ఆహారపు అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన జీవనశైలితో పెరిగారని ఆమె వెల్లడించిన వివరాలు చాలామందిని ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం, ఎదుగుదల విషయంలో ఇంటి ఆహారం ఎంత ముఖ్యమో రేణు వ్యాఖ్యలు మరోసారి గుర్తు చేస్తున్నాయి.
