పవన్ కళ్యాణ్ ఇక అవుట్ డేటెడ్డా?
టాలీవుడ్ లో భారీ ఫ్యాన్ బేస్, ఓ రేంజ్ క్రేజ్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు పవన్ కళ్యాణ్.
By: M Prashanth | 28 April 2026 11:00 PM ISTటాలీవుడ్ లో భారీ ఫ్యాన్ బేస్, ఓ రేంజ్ క్రేజ్ గురించి మాట్లాడితే ముందుగా గుర్తుకు వచ్చే పేరు పవన్ కళ్యాణ్. పవర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేక స్థానం సొంతం చేసుకున్న ఆయన సినిమాలకు ఒకప్పుడు ఉన్న ఓపెనింగ్స్, థియేటర్లలో కనిపించే హంగామా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇప్పుడు అదే క్రేజ్ కొనసాగుతోందా? లేక పవన్ కళ్యాణ్ సినిమాలపై ఆడియన్స్ ఒపీనియన్ మారిందా? అనే చర్చ ఇప్పుడు సోషల్ మీడియాలో మొదలైంది.
ఒకప్పుడు పవన్ సినిమా రిలీజ్ అంటే బాక్సాఫీస్ వద్ద రికార్డుల వర్షం కురిసేది. గబ్బర్ సింగ్ వంటి సినిమాలు కలెక్షన్లలో సంచలనం సృష్టించాయి. ఆ సినిమా వచ్చిన సమయంలో ఫ్యాన్స్ రెస్పాన్స్, థియేటర్ల వద్ద ఉన్న ఉత్సాహం ఇప్పటికీ చాలా మందికి గుర్తుండే ఉంటుంది. అయితే తాజాగా వచ్చిన ఉస్తాద్ భగత్ సింగ్ వంటి ప్రాజెక్టులపై అదే స్థాయి హైప్ ఉన్నప్పటికీ, వసూళ్లు మాత్రం గతంతో పోలిస్తే భిన్నంగా కనిపిస్తున్నాయి.
ఇందుకు ప్రధాన కారణంగా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో బిజీ అవ్వడమేనని అనేక మంది సినీ ప్రియులు, ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన రాజకీయాలకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ప్రజల సమస్యలపై స్పందిస్తూ, సభలు, సమావేశాల్లో పాల్గొంటూ ఎక్కువగా ప్రజల మధ్యే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో సినిమాలకు అవసరమైన సమయం ఇవ్వడం కష్టమవుతోంది.
సినిమా అనేది కేవలం స్టార్ పవర్ తోనే కాదు, కథ, ప్రెజెంటేషన్, డైరెక్షన్, ముఖ్యంగా హీరో ఫోకస్ మీద ఆధారపడి ఉంటుంది. గతంలో పవన్ కళ్యాణ్ తన పాత్రలపై చూపించిన కేర్, డెడికేషన్ ఇప్పుడు కొంత మేర తగ్గిందనే అభిప్రాయం కొందరిలో వ్యక్తమవుతోంది. దీంతో ఆయన సినిమాలు ఓకే అనే స్థాయిలో నిలుస్తున్నాయి తప్ప, పెద్దగా సంచలనం సృష్టించడం లేదని టాక్ వినిపిస్తోంది.
ఇక ప్రేక్షకుల ఒపీనియన్ లో వచ్చిన మార్పు కూడా కీలకంగా మారింది. ఒకప్పుడు కమర్షియల్ సినిమాలకు పెద్ద ఎత్తున ఆదరణ ఉండేది. కానీ ఇప్పుడు ఆడియన్స్ కంటెంట్ కు ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. కథ కొత్తగా ఉంటేనే సినిమాను థియేటర్ లో చూడాలనే ఆలోచన పెరిగింది. లేకపోతే ఓటీటీ వేదికలపై చూసేయడానికే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఆ మార్పు అందరి హీరోలకూ వర్తిస్తున్నప్పటికీ, పవన్ కళ్యాణ్ సినిమాలపై కూడా ప్రభావం చూపుతోంది.
ఇలాంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ అవుట్ డేటెడ్ అయ్యారా? అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం మాత్రం లేదు. ఎందుకంటే, ఆయనకు ఇప్పటికీ ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ మాత్రం తగ్గలేదు. సరైన కథ, స్ట్రాంగ్ డైరెక్షన్, కంప్లీట్ కమిట్మెంట్ తో సినిమా చేస్తే, మళ్లీ పాత వైబ్ తీసుకురావడం ఆయనకు పెద్ద కష్టం కాదు. ఏదేమైనా ఇది పవన్ కళ్యాణ్ క్రేజ్ తగ్గిపోయిన విషయం కంటే.. జనరేషన్ కు తగ్గట్టు మారుతున్న సినిమా ట్రెండ్ రిఫ్లెక్షన్ గా చూడాలి. రాజకీయాలు, సినిమాలు రెండింటినీ ఈక్వల్ గా చూసుకుంటూ.. ప్రేక్షకుల టేస్ట్ ను అర్థం చేసుకుని ముందుకు వెళ్తే.. పవర్ స్టార్ మళ్లీ బాక్సాఫీస్ వద్ద తన సత్తా చాటే అవకాశం ఉంది.
