పవన్ బర్త్ డే: అన్నా కొణిదెల పోస్ట్‌కు అభిమానుల నీరాజనం
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (2 సెప్టెంబర్) సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
By: Sivaji Kontham | 2 Sept 2026 9:13 AM ISTఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు (2 సెప్టెంబర్) సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానుల నుండి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన భార్య అన్నా కొణిదెల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ.. షేర్ చేసిన ఒక ఎమోషనల్ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. `పవర్ స్టార్ ఎంతోమంది జీవితాలను తన ఆత్మీయ స్పర్శతో తాకారని.. ఎందరో ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నారంటూ అన్నా లెజినోవా చేసిన పోస్ట్‌కు లక్షలాది మంది నెటిజనులు ప్రతిస్పందిస్తున్నారు. ముఖ్యంగా ఆలు మగలు ఇలా ఆహ్లాదంగా ఆదర్శవంతంగా ఉన్న ఫోటోగ్రాఫ్ ని షేర్ చేయగా దానికి లవ్, హార్ట్ ఈమోజీలతో అభిమానులు ప్రేమను కురిపిస్తున్నారు. ముఖ్యంగా అన్నా షేర్ చేసిన ఫోటోగ్రాఫ్ లో పవన్ తెల్ల కుర్తాలో ఎంతో సింపుల్ గా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షించింది.
సినిమా రంగంలో పవర్ స్టార్‌గా కోట్లాదిమంది అభిమానాన్ని గెలుచుకున్న పవన్ కళ్యాణ్.. రాజకీయాల్లోకి వచ్చి ప్రజా నాయకుడిగా మారిన తీరును అభిమానులు ఎంతో గర్వంగా స్మరించుకుంటున్నారు. నెటిజన్లు కామెంట్లలో ఆయనను కేవలం ఒక నటుడిగానే కాకుండా తమకు మార్గదర్శిగా, ఒక భావోద్వేగంగా అభివర్ణిస్తున్నారు. ``సినిమాతో పరిచయమై... రాజకీయంలో మార్గదర్శకుడివి అయ్యావు`` అంటూ కామెంట్ల రూపంలో తమ గుండెల్లోని అభిమానాన్ని చాటుకుంటున్నారు.
తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా విదేశాల నుంచి కూడా పవన్ కళ్యాణ్‌కు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. కామెంట్లలో ఒక అభిమాని స్పందిస్తూ... పవన్ కళ్యాణ్ జీవితంలో అన్నా కొణిదెల తోడుగా నిలవడంపై కృతజ్ఞతలు తెలిపారు. ఒక గొప్ప ఆశాకిరణంగా నిలిచే నాయకుడికి జీవిత భాగస్వామిగా సరైన మద్దతు ఇస్తున్నారని కొనియాడారు. భాషలు, ప్రాంతాల సరిహద్దులు దాటి పవన్ కళ్యాణ్‌కు ఉన్న ప్రజాదరణకు ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయి.
కేవలం శుభాకాంక్షలతోనే ఆగిపోకుండా.. పవన్ కళ్యాణ్ ప్రజా సేవకుడు కావడంతో కొందరు తమ సమస్యలను, విజ్ఞప్తులను కూడా ఈ పోస్ట్ ద్వారా పవన్ దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. అరుదైన డిఎండి వ్యాధితో బాధపడుతున్న తన కుమారుడి వైద్యం కోసం సహాయం చేయాలని ఒక తండ్రి చేసిన విజ్ఞప్తి అందరినీ కలచివేస్తోంది. పవన్ కళ్యాణ్ ఉదార హృదయంతో స్పందిస్తారనే నమ్మకంతోనే అభిమానులు ఇటువంటి అత్యవసర సాయం కోసం ఆయనను ఆశ్రయిస్తున్నారు.
మొత్తానికి అన్నా కొణిదెల చేసిన ఈ ఒకే ఒక్క పోస్ట్ పవన్ కళ్యాణ్‌పై ఉన్న అపారమైన అభిమానాన్ని, నమ్మకాన్ని మరోసారి స్పష్టం చేసింది. అభిమానులు ఆయనను `అన్నయ్య`, `జనసేనాని`, `పిఠాపురం ఎమ్మెల్యే`, `ఉపముఖ్యమంత్రి` అని పిలుస్తూ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని దేవుడిని ప్రార్థిస్తున్నారు. ఈ జన్మదిన వేడుకలు కేవలం ఒక నటుడి పుట్టినరోజుగా మాత్రమే కాకుండా.. ఒక ప్రజా నాయకుడికి ప్రజలు అందిస్తున్న ఘన నీరాజనంగా నిలిచాయి.
