కొత్త పవన్ కళ్యాణ్ ముచ్చట్లు.. ‘పురుష:’ వెనుక ఉన్న అసలు కథ ఇదీ
సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా పట్టుదలతో హీరోగా మారుతున్నాడు పల్నాడు కుర్రాడు పవన్ కళ్యాణ్ బత్తుల. అతను నటించిన ‘పురుష:’ సినిమా మే 22న థియేటర్లలోకి వస్తున్న సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను రివిల్ చేశారు.
By: M Prashanth | 17 May 2026 11:49 PM ISTసినీ బ్యాక్‌గ్రౌండ్ లేకపోయినా పట్టుదలతో హీరోగా మారుతున్నాడు పల్నాడు కుర్రాడు పవన్ కళ్యాణ్ బత్తుల. అతను నటించిన ‘పురుష:’ సినిమా మే 22న థియేటర్లలోకి వస్తున్న సందర్భంగా పలు ఆసక్తికర విషయాలను రివిల్ చేశారు. తన మొదటి ప్రయత్నంగానే ఒక మంచి హోమ్లీ సబ్జెక్టును ఎంచుకున్నానని, థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ సినిమా ఒక మంచి ఫీలింగ్ ఇస్తుందని ధీమాగా చెప్పాడు.
తన పేరు వెనుక ఉన్న సీక్రెట్ గురించి చెబుతూ, తండ్రికి మెగాస్టార్ సినిమాలంటే చాలా ఇష్టమని, ఆ క్రేజ్ తోనే తనకు ఈ పేరు పెట్టారని అన్నాడు. నిజానికి తనను స్క్రీన్ మీద హీరోగా చూడాలనేది తండ్రి కల అని, కాలేజీ రోజుల్లో స్టేజ్ ఈవెంట్లు చూశాక తనకు కూడా సినిమాలపై ఇష్టం పెరిగిందని వివరించాడు. హీరో అవ్వాలనే లక్ష్యంతోనే వైజాగ్‌లోని ప్రముఖ శిక్షకుడు సత్యానంద్ గారి దగ్గర చేరి, కొన్ని నెలల పాటు అక్కడే ఉండి నటనలో మెలకువలు నేర్చుకున్నట్లు తెలిపాడు.
ఈ ప్రాజెక్ట్ అసలు ఎలా సెట్ అయిందనే విషయమై స్పందిస్తూ.. కెమెరామెన్ సతీష్ గారే ఈ కథను తమ వద్దకు తీసుకువచ్చారని చెప్పాడు. ఈ కథ వినగానే ఒకప్పటి సూపర్ హిట్ ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి’ లాంటి వైబ్స్ గుర్తుకొచ్చాయని, అందుకే వెంటనే ఓకే చేశామని అన్నాడు. కేవలం ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాకుండా, ప్రతి పాత్రకు ఒక ప్రాధాన్యత ఉండేలా వీరు వులవల ఈ చిత్రాన్ని మలిచారని డైరెక్టర్ పై నమ్మకాన్ని వ్యక్తపరిచాడు.
సెట్స్‌లో తన ఎక్స్‌పీరియన్స్ గురించి చెబుతూ, తాను కొంచెం రిజర్వ్‌డ్‌గా ఉండే మనస్తత్వమని, కానీ డైరెక్టర్ వీరు తనను బాగా మోటివేట్ చేసి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు తీసుకువచ్చారని అన్నాడు. షూటింగ్ సమయంలో సప్తగిరి, కసిరెడ్డి రాజ్ కుమార్ లాంటి సీనియర్ నటులు తనకు ప్రతి సీన్ లోనూ సపోర్ట్ ఇచ్చారని, వారి వల్లే కొత్తవాడైనా ఎక్కడా ఇబ్బంది పడకుండా కెమెరా ముందుకు రాగలిగానని చెప్పుకొచ్చాడు.
ఇక తన సోదరి సరస్వతి గురించి మాట్లాడుతూ చాలా ఎమోషనల్ అయ్యాడు పవన్. తన మీద ఉన్న ఇష్టంతో ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన ప్రతి విషయంలోనూ ఆమె సపోర్టింగ్ గా నిలిచిందని, ఆమె ఇచ్చిన ధైర్యం లేకపోతే ఈరోజు తాను ఇక్కడి వరకు వచ్చేవాడిని కాదంటూ క్రెడిట్ మొత్తం సిస్టర్ కి ఇచ్చాడు. ఈ సినిమా జర్నీలోనే ఇండస్ట్రీలోని కష్టనష్టాలు ఏంటో తనకు పూర్తిగా అర్థమయ్యాయని అన్నాడు.
ఫ్రెండ్స్ అంతా మాస్ యాక్షన్ సినిమాలు చేయమని సలహాలు ఇస్తున్నా, తనకు మాత్రం ప్రేక్షకులను నవ్వించడమే ముఖ్యమని స్పష్టం చేశాడు. ఇప్పటికే ఈ సినిమా స్పెషల్ షో చూసిన వారంతా పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ ఇచ్చారని, కచ్చితంగా సినిమా పెద్ద హిట్ అవుతుందని నమ్మకం వ్యక్తం చేశాడు. మే 22న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన తర్వాతే తన తదుపరి సినిమాల ప్లానింగ్ ఉంటుందని చెబుతూ ముగించాడు.
