దసరా గిఫ్ట్: జనసేనలో రామ్ తాళ్లూరికి కీలక బాధ్యత
తాజా ప్రకటన ప్రకారం... రామ్ తాళ్లూరిని జనసేన ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి ప్రతిదీ రామ్ తాళ్లూరి పరిశీలిస్తారని తెలుస్తోంది.
By: Sivaji Kontham | 3 Oct 2025 1:05 PM ISTఏపీ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినాయకుడు పవన్ కల్యాణ్ తో సినీపరిశ్రమ వ్యక్తుల సత్సంబంధాల గురించి తెలిసిందే. ప్రముఖ సినీనిర్మాత రామ్ తాళ్లూరి దశాబ్ధ కాలంగా పవన్ కల్యాణ్ ఆస్థానంలో సేవికుడిగా కొనసాగుతున్నారు. ఆయన నిస్వార్థంగా సాగించిన సేవలను గుర్తించిన జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్, తన పార్టీలో పెద్ద బాధ్యతను అప్పగించారు. దసరా సందర్భంగా దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది.
తాజా ప్రకటన ప్రకారం... రామ్ తాళ్లూరిని జనసేన ప్రధాన కార్యదర్శిగా అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పార్టీ సంస్థాగత నిర్మాణం, అభివృద్ధికి సంబంధించి ప్రతిదీ రామ్ తాళ్లూరి పరిశీలిస్తారని తెలుస్తోంది. దాదాపు దశాబ్ధ కాలంగా రామ్ తాల్లూరి పార్టీకి స్వచ్ఛందంగా ఎన్నో సేవలందించారు. పార్టీని కింది స్థాయి నుంచి బలోపేతం చేయడంలో పవన్ కళ్యాణ్‌తో సన్నిహితంగా పని చేయడమే గాక, నిస్వార్థంగా తనవంతు విరాళాలను అందించారు. కొన్నేళ్లుగా ఆయన తెలంగాణలో పార్టీ వ్యవహారాలను చూసుకుంటున్నారు. రామ్ నిస్వార్థ సేవలు, నాయకత్వ లక్షణాలను మెచ్చిన పవన్ కళ్యాణ్ చివరకు పార్టీలో అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి బాధ్యతను అప్పగించారు.
రామ్ తాళ్లూరి ఐటి రంగంలో దిగ్గజం. ఆయన పలు రకాల వ్యాపారాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. వినోద రంగంలో థియేటర్లలో గేమింగ్ జోన్ వంటి పరిశ్రమను విజయవంతంగా నిర్వహిస్తున్నారు. సినీనిర్మాతగాను వరుస చిత్రాలను నిర్మించారు. చుట్టాలబ్బాయి చిత్రంతో పరిశ్రమలో అడుగుపెట్టి, బెంగాల్ టైగర్, నేల టికెట్, డిస్కో రాజా, మట్కా , మెకానిక్ రాకీ వంటి చిత్రాలను నిర్మించి ఇండస్ట్రీతో సత్సంబంధాలను కొనసాగిస్తున్నారు. ఎస్.ఆర్.టి ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ లో మునుముందు పలు భారీ చిత్రాలను ఆయన నిర్మించనున్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ తో సినిమా నిర్మించాలన్నది ఆయన కల. దానిని నిర్వర్తించుకునేందుకు ప్రయత్నించినా గతంలో సాధ్యపడలేదు. సినిమాని ప్రకటించినా కానీ పట్టాలెక్కలేదు. మునుముందు ఆ కలను కూడా ఆయన నెరవేర్చుకునేందుకు ఆస్కారం ఉంది.
