Begin typing your search above and press return to search.

ఓజీ స్పెషల్‌ : 33 అవతార్‌లో పవన్‌ కళ్యాణ్‌..!

హైదరాబాద్‌ కూకట్‌పల్లి విశ్వనాథ్‌ థియేటర్‌ వద్ద ఏకంగా 33 కటౌట్‌లను పవన్‌ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయబోతున్నారు.

By:  Ramesh Palla   |   10 Sept 2025 4:16 PM IST
ఓజీ స్పెషల్‌ : 33 అవతార్‌లో పవన్‌ కళ్యాణ్‌..!
X

పవన్‌ కళ్యాణ్ అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులు అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం 'ఓజీ'. ఈ సినిమా షూటింగ్‌ పూర్తి అయ్యి చాలా రోజులు అవుతోంది. సినిమాను సెప్టెంబర్‌ 25న విడుదల చేయబోతున్న విషయం తెల్సిందే. ఇటీవల పవన్‌ నటించిన హరి హర వీరమల్లు సినిమా వచ్చింది. ఆ సినిమా ఫలితంతో సంబంధం లేకుండా ఓజీ సినిమాకు విపరీతమైన బజ్ క్రియేట్‌ అవుతోంది. సినిమా గురించి అదుగో ఇదుగో అంటూ తెగ ప్రచారం జరుగుతోంది. సాహో వంటి స్టైలిష్‌ యాక్షన్ సినిమాను అందించిన దర్శకుడు సుజీత్‌ ఈ సినిమాను రూపొందించిన విషయం తెల్సిందే. గత రెండు మూడు ఏళ్లుగా ఈ సినిమా వరుస వాయిదాలతో నలిగి పోతున్న విషయం తెల్సిందే. ఎట్టకేలకు పవన్‌ వీలు కల్పించుకుని టైం ఇచ్చి మరీ సినిమాను పూర్తి చేయడంతో హడావిడిగా విడుదల చేస్తున్నారు.

ఉప ముఖ్యమంత్రి పవన్‌ కళ్యాణ్‌

సాధారణంగానే పవన్‌ కళ్యాణ్‌ రచ్చ రచ్చ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పవన్‌ ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అంతే కాకుండా ఓజీ వంటి ఓ మాస్ పవర్‌ ఫుల్‌ మూవీతో రాబోతున్నాడు. కనుక తమ అభిమాన నటుడికి ఏదైనా ప్రత్యేకంగా చేయాలి అనుకున్నారో ఏమో కానీ ఈ సినిమా విడుదల సమయంలో రచ్చ చేసేందుకు గాను ఏర్పాట్లు చేస్తున్నారు. విడుదలకు మరో రెండు వారాల సమయం మాత్రమే ఉన్న నేపథ్యంలో థియేటర్ల వద్ద హడావిడి మొదలు అయింది. ఈ సినిమా విడుదల సందర్భంగా పవన్‌ ఫ్యాన్స్‌ భారీ కటౌట్స్ను ప్లాన్‌ చేస్తున్నారు. ప్రతి హీరో ఫ్యాన్స్‌, నిర్మాతలు కటౌట్స్‌ను ఏర్పాటు చేయడం మనం చూస్తూ ఉంటాం. కానీ ఓజీ సినిమా థియేటర్‌ వద్ద ఉండబోతున్న కటౌట్‌లు చాలా స్పెషల్‌ అంటూ పవన్ ఫ్యాన్స్ బల్ల గుద్ది మరీ బరాబర్‌ చెబుతున్నారు.

కూకట్‌పల్లిలో భారీ కటౌట్‌ల ఏర్పాటు

హైదరాబాద్‌ కూకట్‌పల్లి విశ్వనాథ్‌ థియేటర్‌ వద్ద ఏకంగా 33 కటౌట్‌లను పవన్‌ కళ్యాణ్ అభిమానులు ఏర్పాటు చేయబోతున్నారు. పవన్‌ కళ్యాణ్‌ ఇప్పటి వరకు అన్ని సినిమాల్లో నటించలేదు. కానీ కొన్ని పొలిటికల్‌ కటౌట్‌లు, కొన్ని గెస్ట్‌ రోల్స్ పోషించిన కటౌట్‌లను ఏర్పాటు చేయబోతున్నారు. ఇప్పటి వరకు పవన్‌ నటించిన ప్రతి సినిమా నుంచి ఒక కటౌట్‌ను ఏర్పాటు చేయబోతున్నారు. జనసేనానిగా ఒక కటౌట్, ఉప ముఖ్యమంత్రిగా ఒక కటౌట్‌ ఇలా మొత్తంగా పవన్‌ కళ్యాణ్‌కి సంబంధించిన 33 కటౌట్‌లను ఏర్పాటు చేయడం ద్వారా పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకోబోతున్నారు. ఒక్క హీరోకు 33 కటౌట్‌లను ఇప్పటి వరకు ఏ ఒక్క హీరోకు లేదా హీరోయిన్‌కి అభిమానులు పెట్టలేదు. కనుక పవన్‌ ఓజీ సినిమా విడుదల సందర్భంగా ఫ్యాన్స్ పెట్టబోతున్న కటౌట్‌లు రికార్డ్‌ను నమోదు చేయబోతున్నారు.

ఓజీ సినిమాతో పవన్‌ రికార్డ్‌ ఖాయం

కొన్ని సంవత్సరాల క్రితం కన్నడ స్టార్‌ హీరో పునీత్‌ రాజ్‌ కుమార్‌ అభిమానులు 30 కటౌట్‌లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అదే రికార్డ్‌గా ఉంది. ఇప్పుడు ఆ రికార్డ్‌ను బ్రేక్ చేస్తూ పవన్‌ ఫ్యాన్స్ కొత్త రికార్డ్‌ క్రియేట్‌ చేయడం కోసం కటౌట్‌లను ఏర్పాటు చేస్తున్నారు. భారీ 33 కటౌట్‌లతో విశ్వనాథ్‌ థియేటర్‌ కలకలలాడబోతుంది. పవన్‌ కళ్యాణ్‌ మొదటి సినిమా నుంచి మొదలుకుని మొన్న విడుదలైన హరి హర వీరమల్లు, అలాగే ఓజీ సినిమాకు సంబంధించిన కటౌట్‌లను సైతం ఏర్పాటు చేయబోతున్నారు. ఈ కటౌట్‌ల ఆవిష్కరణకు మెగా ఫ్యామిలీ నుంచి ఒక యంగ్‌ హీరో హాజరు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. పవన్ ఓజీ సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందో అనే ఆసక్తి అందరిలోనూ కనిపిస్తుంది. మరి ఓజీ ఎలా ఉంటుందని మీరు భావిస్తున్నారు మాకు తెలియజేయండి.