ఆరోపణలు.. టాలీవుడ్ దర్శకుడు అరెస్ట్
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పవన్ సాధినేనిని అదుపులోకి తీసుకున్నారు.
By: M Prashanth | 26 Aug 2026 6:02 PM ISTటాలీవుడ్ దర్శకుడు పవన్ సాధినేనిని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ నటి ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో కేసు నమోదు చేసినట్లు సమాచారం. తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి మోసం చేశారని, వ్యక్తిగత జీవితానికి సంబంధించి కూడా తనను నమ్మించి తర్వాత దూరంగా ఉన్నారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ప్రస్తుతం ఆమె చేసిన ఆరోపణలుగానే ఉన్నాయి.
ఫిర్యాదు అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి పవన్ సాధినేనిని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు సమాచారం. ఈ కేసులో పూర్తి వివరాలు పోలీసుల నుంచి ఇంకా బయటకు రావాల్సి ఉంది. విచారణలో ఏం తేలుతుందన్నది కూడా చూడాల్సి ఉంది.
పవన్ సాధినేని ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత సావిత్రి, సేనాపతి వంటి సినిమాలతో పాటు పలు వెబ్ సిరీస్‌లకు కూడా దర్శకత్వం వహించాడు. సినిమా, ఓటీటీ ప్రాజెక్టులతో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న సమయంలో ఇప్పుడు ఈ కేసు ఎదురవడం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ప్రస్తుతం ఆయన దుల్కర్ సల్మాన్ హీరోగా ఆకాశంలో ఒక తార సినిమాను తెరకెక్కిస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న సమయంలోనే అరెస్ట్ వార్త బయటకు రావడంతో ఆ ప్రాజెక్ట్‌పై కూడా ఫోకస్ పడింది. అయితే సినిమా షూటింగ్ లేదా తదుపరి షెడ్యూల్స్‌పై దీని ప్రభావం ఏమైనా ఉంటుందా అనే విషయంలో ఇప్పటివరకు అధికారిక సమాచారం లేదు. ఇక నటి చేసిన ఆరోపణలు ప్రకారం, మరోవైపు పోలీసుల విచారణ కొనసాగుతోంది. పవన్ సాధినేని వైపు నుంచి స్పందన వస్తేనే ఈ వ్యవహారంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
