పావలా శ్యామలను బయటకు పంపేసిన హోమ్ నిర్వాహకులు.. రంగంలోకి పోలీసులు!
అందుకే చాలామంది సెలబ్రిటీలు ఈ సామెతను చక్కగా ఫాలో అవుతుంటే.. మరికొంతమంది మాత్రం త్యాగాలు, దానధర్మాలు , జల్సాలు కారణంగా ఆ డబ్బును వృధా చేస్తూ.. చివరి దశలో దీనస్థితిలోకి వెళ్ళిపోతున్నారు.
By: Madhu Reddy | 10 Dec 2025 3:30 PM ISTదీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కబెట్టుకోవాలని పెద్దలు చెబుతూ ఉంటారు. అందుకే చాలామంది సెలబ్రిటీలు ఈ సామెతను చక్కగా ఫాలో అవుతుంటే.. మరికొంతమంది మాత్రం త్యాగాలు, దానధర్మాలు , జల్సాలు కారణంగా ఆ డబ్బును వృధా చేస్తూ.. చివరి దశలో దీనస్థితిలోకి వెళ్ళిపోతున్నారు. అందులో భాగంగానే ఇప్పటికే సావిత్రిని మొదలుకొని ఎంతోమంది సెలబ్రిటీలు ఎక్కువగా దానధర్మాలకు పోయి చివరి క్షణాలలో జీవితాన్ని చాలా దుర్బరంగా అనుభవించిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ కోవలోకి ప్రముఖ సీనియర్ నటి పావలా శ్యామల కూడా వచ్చి చేరారు.
నేతి శ్యామల అయిన ఈమె గణేష్ పాత్రో రచించిన 'పావలా' అనే నాటకంలో నటించి, తన నటనతో పావలా శ్యామలాగా మారిపోయింది. ఆ తర్వాత సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఈమె.. ఒక్క తెలుగులోనే దాదాపు 300కు పైగా చిత్రాలలో నటించి, భారీ పాపులారిటీ అందుకుంది. ఎక్కువగా కామెడీ జానర్ లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరించిన పావలా శ్యామల.. గత కొన్ని సంవత్సరాలుగా దయనీయ పరిస్థితిని ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. గతంలోనే ఈమె పరిస్థితి తెలుసుకున్న మెగాస్టార్ చిరంజీవి, పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ, మెగా మేనల్లుడు సాయి ధరంతేజ్, కరాటే కళ్యాణి లాంటి సెలబ్రిటీలు తమ వంతు ఆర్థిక సహాయం అందించిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు ఈమె పరిస్థితి మరింత దిగజారింది. పరిస్థితులు అనుకూలించకపోవడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుందట. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు ఆమెను మరో అనాధాశ్రమానికి తరలించినట్లు సమాచారం. అసలు విషయంలోకి వెళ్తే..గత కొన్ని సంవత్సరాలుగా ప్రముఖ నటి పావలా శ్యామల తన కూతురితో కలసి ఒక హోమ్ లో నివసిస్తున్నారు. అయితే వారి ఆరోగ్య పరిస్థితి క్షీణించడంతో కదలలేని స్థితికి చేరుకున్నారు. ఇక మంచానికే పరిమితం కావడంతో హోం నిర్వాహకులు సేవలు అందించలేమని,వారిని బయటకు పంపేశారట.
ఆదాయం లేక.. ఆధారం లేక నిరాశలో మునిగిపోయిన పావలా శ్యామల తన కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. అదే సమయంలో రోడ్డుపై అత్యంత దారుణ స్థితిలో ఉన్న వీరిని గమనించిన కార్ఖానా పోలీస్ స్టేషన్ సిబ్బంది ఈమెను గుర్తించి.. ఈ విషయాన్ని తిరుమలగిరి ఏసీపీ రమేష్ దృష్టికి తీసుకెళ్లారట. ఈమె పరిస్థితిని గమనించిన ఏసీపీ రమేష్ శ్యామలతో పాటు ఆమె కుమార్తెను కార్ఖానా పరిధిలోని ఆర్కే ఫౌండేషన్ హెల్త్ కేర్ సెంటర్లో చేర్పించినట్లు సమాచారం. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఎన్నో చిత్రాలలో నటించి ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచిన నటి పావలా శ్యామల దీనస్థితిని తలచుకొని ఎమోషనల్ అవుతున్నారు.
ఇదిలా ఉండగా మరొకవైపు ఆర్కే ఫౌండేషన్ సంస్థ ఫౌండర్ రామకృష్ణ శ్యామల తల్లి కూతుర్లకు ఆశ్రయం కల్పించి అన్ని సేవలు అందిస్తామని ప్రకటించారు. అనాథ వృద్ధులు ఎవరైనా ఉన్నా సరే తమ దృష్టికి తీసుకు రావాలని తెలిపారు.
