Begin typing your search above and press return to search.

ట్రెండీ స్టోరి: దేశ‌భ‌క్తి- వార్ డ్రామాలంటే జ‌నాల‌కు ఎందుకు అంత పిచ్చి?

త‌దుప‌రి ర‌ణ్ వీర్ సింగ్- ఆదిత్యా ధ‌ర్ జోడీ నుంచి రానున్న సీక్వెల్ మూవీ `దురంధ‌ర్ 2` పైనా అంద‌రి దృష్టి కేంద్రీకృత‌మై ఉంది.

By:  Sivaji Kontham   |   6 Feb 2026 8:30 AM IST
ట్రెండీ స్టోరి: దేశ‌భ‌క్తి- వార్ డ్రామాలంటే జ‌నాల‌కు ఎందుకు అంత పిచ్చి?
X

ఇటీవ‌లి కాలంలో వ‌రుస పెట్టి బార్డ‌ర్ వార్- దేశ‌భ‌క్తి నేప‌థ్య సినిమాలొస్తున్నాయి. ఎన్.ఐ.ఏ స్పై ఆప‌రేష‌న్ నేప‌థ్య సినిమాల ఉధృతి పెరిగింది. అలాగే యుద్ధ‌భూమిలో విరోచిత పోరాటంలో మ‌ర‌ణించిన వీర సైనికుల జీవిత‌క‌థ‌లు ప్ర‌జ‌ల్ని ఎంతో ఉత్కంఠ‌కు గురి చేస్తున్నాయి. ట్రెండ్ చూస్తుంటే దేశ‌భ‌క్తి సినిమాల‌కు మంచి టైమ్ వ‌చ్చింద‌ని అర్థ‌వుతోంది.

విక్కీ కౌశ‌ల్- ఆదిత్యాధ‌ర్ జోడీ `యూరి -ది స‌ర్జిక‌ల్ స్ట్రైక్స్`తో అసాధార‌ణ విజ‌యం అంటే ఎలా ఉంటుందో రుచి చూపించారు. దేశ‌భ‌క్తి, యుద్ధ తంత్ర నేప‌థ్యంపై తీసిన ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఘ‌న‌విజ‌యం సాధించ‌డ‌మే గాక దేశ‌విదేశాల‌లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. ఆ త‌ర్వాత `స్కై ఫోర్స్` యుద్ధ విమానాలు, దేశం కోసం పోరాటంపై సినిమా చ‌ర్చ‌ల్లోకొచ్చింది.

ఇటీవ‌లే ర‌ణ్ వీర్- ఆదిత్యాధ‌ర్ కాంబినేష‌న్ దేశ‌భ‌క్తి, స్పై ఆప‌రేష‌న్ నేప‌థ్యంలో రూపొందించిన `దురంధ‌ర్`తో రికార్డులు తిరగ‌రాసారు. ఈ సినిమా 1000కోట్ల క్ల‌బ్ లో చేర‌డ‌మే గాక‌, చాలా రికార్డుల‌ను బ్రేక్ చేసి హిందీ సినిమాకి జ‌వ‌జీవాల‌ను నింపింది. దీంతో దురంధ‌ర్ 2 పై ప్ర‌జ‌ల్లో స‌ర్వ‌త్రా ఉత్కంఠ నెల‌కొంది.

ఇంత‌లోనే ఇప్పుడు బార్డ‌ర్ 2తో స‌న్నీడియోల్ బంప‌ర్ హిట్టు కొట్టారు. ఈ సీనియ‌ర్ హీరో బాక్సాఫీస్ వ‌ద్ద అసాధార‌ణ వ‌సూళ్ల‌ను రాబ‌డుతుంటే అంద‌రూ నోరెళ్ల‌బెడుతున్నారు. దీనికి కారణం దేశ‌భ‌క్తి నేప‌థ్యం, బార్డ‌ర్ మొద‌టి పార్ట్ తో ప్ర‌జ‌ల‌కు ఉన్న ఎమోష‌న‌ల్ క‌నెక్ష‌న్. లేట్ ఏజ్ హీరో `బార్డ‌ర్ 2` ఏకంగా 400కోట్లు వ‌సూలు చేయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

ఇదిలా ఉంటే, ప్ర‌స్తుతం స‌ల్మాన్ ఖాన్ ఎంచుకున్న గాల్వాన్ లోయ వార్ డ్రామా స‌ర్వ‌త్రా ఉత్కంఠ‌ను పెంచుతోంది. `బ్యాటిల్ ఆఫ్ గ‌ల్వాన్` పేరుతో రూపొందిస్తున్న ఈ సినిమాపైనా గొప్ప ఆస‌క్తి నెల‌కొంది. అపూర్వ ల‌ఖియా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

దేశ‌భ‌క్తులు, వారి బ‌యోపిక్ ల‌పై ఎల్ల‌పుడూ ప్ర‌జ‌ల్లో గొప్ప ఆసక్తి ఉంది. ట్రెండ్ చూస్తుంటే వార్ డ్రామాలు, దేశ‌భ‌క్తి సినిమాల‌పై ప్ర‌జ‌ల‌కు విప‌రీత‌మైన ఆసక్తి ఉంద‌ని అర్థ‌మ‌వుతోంది.

తెలుగులో లైట్ తీస్కున్నారా?

కానీ తెలుగులో దేశ‌భ‌క్తి సినిమాలు కానీ, బార్డ‌ర్ నేప‌థ్య సినిమాలు కానీ ఇటీవ‌ల‌ అంత‌గా తెర‌కెక్క‌డం లేదు. రాజ‌మౌళి, సుకుమార్, సందీప్ వంగా లాంటి టాప్ డైరెక్ట‌ర్లు దేశ‌భ‌క్తి సినిమాల‌పై దృష్టి సారించ‌లేదు. దేశ‌భ‌క్తి, వారియ‌ర్ బ‌యోపిక్ ల పైనా దృష్టి సారించ‌లేదు. ప్ర‌స్తుత ట్రెండ్ ని గ‌మ‌నించడంలో తెలుగు ద‌ర్శ‌కులు విఫ‌ల‌మ‌య్యారా? అనే సందేహాలున్నాయి.

ఆరోజుల్లో మ‌నోళ్లు తీసారు:

నిజానికి 80లు, 90ల‌లో దేశ‌భ‌క్తి, తీవ్ర‌వాదం నేప‌థ్యంలో కొన్ని సినిమాలు టాలీవుడ్ లోను తెర‌కెక్కి విజ‌యం సాధించాయి. ఇటీవ‌లి కాలంలో ఇప్పుడున్న అగ్ర హీరోలు ఎవ‌రూ దేశ‌భ‌క్తి, బార్డ‌ర్ వార్ నేప‌థ్య‌ సినిమాల‌ను అస్స‌లు ట‌చ్ చేయ‌లేదు. గూఢ‌చారి, మేజ‌ర్ లాంటి సినిమాల‌తో న‌వ‌త‌రం హీరో అడివి శేష్ చ‌క్క‌టి ప్ర‌య‌త్నం చేసి విజ‌యం సాధించారు. శేష్ మాత్ర‌మే టాలీవుడ్ నుంచి ఇలాంటి ప్ర‌య‌త్నం చేయ‌డం ద్వారా గ‌ట్స్ ఉన్న హీరో అని నిరూపించాడు. అందుకే అత‌డి నుంచి రాబోతున్న `గూఢ‌చారి 2`పై గొప్ప‌ ఉత్కంఠ నెల‌కొంది.

ఆ సీక్వెల్ పైనే అంద‌రి దృష్టి:

త‌దుప‌రి ర‌ణ్ వీర్ సింగ్- ఆదిత్యా ధ‌ర్ జోడీ నుంచి రానున్న సీక్వెల్ మూవీ `దురంధ‌ర్ 2` పైనా అంద‌రి దృష్టి కేంద్రీకృత‌మై ఉంది. దురంధ‌ర్ ప‌రిశ్ర‌మ రికార్డుల‌ను వేటాడింది. అంత‌కుమించి సీక్వెల్ క‌థ‌తో వ‌స్తున్న దురంధ‌ర్ 2 రికార్డులు తిర‌గ‌రాస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఎందుకు అంత పిచ్చి?

దేశభక్తి సినిమాలపై ప్రజలకు అంత పిచ్చి ఎందుకు? అంటే ఎమోషనల్ కనెక్ట్ దీనికి కార‌ణం. మన దేశం కోసం ప్రాణాలర్పించిన వీరుల కథలు విన్నప్పుడు ప్రతి భారతీయుడిలోనూ ఒక రకమైన గర్వం, భావోద్వేగం కలుగుతాయి. యూరి లాంటి యుద్ధ తంత్ర క‌థ‌ను తెర‌పై కళ్లకు కట్టినట్లు చూపించడంతో నేటి యువతకు ఈ జోనర్ బాగా నచ్చింది. భారీ యుద్ధ సన్నివేశాలు, ఉద్రేకం పెంచే డైలాగులు థియేటర్లలో ప్రేక్షకులకు ఒక గొప్ప అనుభూతిని ఇస్తాయి. నిజ జీవితంలో ఇంటెలిజెన్స్ ఆప‌రేష‌న్ లు ఎప్పుడూ ఆస‌క్తిని పెంచుతాయి. ఈ త‌ర‌హా క‌థ‌తో దురంధ‌ర్ కూడా అంతే ఉత్కంఠ‌ను పెంచింది.

మ‌నోళ్లు అటు చూస్తున్నారు:

వార్ డ్రామాలు, దేశభక్తి సినిమాల పట్ల భారతీయులకు ఎప్పుడూ ఒక ప్రత్యేకమైన సెంటిమెంట్ ఉంటుంది. తాజాగా బాలీవుడ్ లో ఈ జాన‌ర్ బంప‌ర్ హిట్లు కొడుతుంటే, టాలీవుడ్ ద‌ర్శ‌క‌ర‌చ‌యిత‌లు, ప్ర‌ముఖ నిర్మాత‌లు కూడా నిశితంగా వీటిని ప‌రిశీలిస్తున్న‌ట్టు తెలుస్తోంది. త‌మిళంలో అమ‌ర‌న్ లాంటి క్లాసిక్ (దేశ‌భ‌క్తి మూవీ) తో శివ‌కార్తికేయ‌న్ కి గొప్ప గుర్తింపు వ‌చ్చింది. బాక్సాఫీస్ వ‌ద్ద భారీ విజ‌యం సాధించింది ఈ చిత్రం. అలాంటి మంచి క‌థ‌లు దొరికితే తెలుగులోను సినిమాలు తీసేందుకు కొంద‌రు రెడీగా ఉన్నారు. కానీ ఇంకా దీనిపై స‌రైన అప్ డేట్ రాలేదు!