మాయమైన ఆస్కార్ దొరికిందిలా!
రష్యన్ దర్శకుడు పాసా తలంకిన్ కు వరించిన ఆస్కార్ అవార్డు మాయమవ్వడం అంతర్జాతీయ మీడియాలో ఎంత సంచలనమైందో తెలిసిందే.
By: Srikanth Kontham | 2 May 2026 11:32 PM ISTరష్యన్ దర్శకుడు పాసా తలంకిన్ కు వరించిన ఆస్కార్ అవార్డు మాయమవ్వడం అంతర్జాతీయ మీడియాలో ఎంత సంచలనమైందో తెలిసిందే. అవార్డు చేతికి అందినట్లే అంది అంతలోనే మాయమవ్వడంతో అంతా ఆశ్చర్యపోయారు. దీంతో పాషా తలంకిన్ తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అవార్డు మార్గ మధ్యలో మిస్ అయిందా? లేక ఎయిర్ పోర్టులో మిస్ అయిందా? అన్న దానిపై పెద్ద చర్చే జరుగుతోంది. ఈ నేపథ్యంలో తాజాగాలుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ సిబ్బంది ఎట్టకేలకు అవార్డును గుర్తించి అప్పగించడంతో ఉత్కంఠకు తెరపడింది.
ఘటన వివరాల్లోకి వెళ్తే..
దర్శకుడు పాషా తలంకిన్ తన ప్రయాణంలో భాగంగా విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఆయన లగేజీతో పాటు ఉన్న ఆస్కార్ అవార్డు అదృశ్యమైంది. తన జీవితకాల కష్టానికి దక్కిన ఆ గుర్తింపు కనిపించకుండా పోవడంతో ఆయన విమానయాన సంస్థ అధికారులను ఆశ్రయించారు. రవాణా సమయంలో ఎక్కడో ఒకచోట అది మిస్ అయి ఉండొచ్చని అధికారులు ప్రాథమికంగా భావించారు. సమాచారం అందుకున్న లుఫ్తాన్సా ఎయిర్‌లైన్స్ బృందం వెంటనే గాలింపు చర్యలు చేపట్టింది. విమా నాశ్రయాలలోని భద్రతా కెమెరాలను, లగేజీ స్కానింగ్ రిపోర్టులను క్షుణ్ణంగా పరిశీలించారు.
చివరకు ట్రాన్సిట్ పాయింట్ వద్ద ఆస్కార్ ప్రతిమను సురక్షితంగా గుర్తించారు. ప్రతిష్టాత్మకమైన అవార్డును బాధ్యతాయుతంగా వెతికి పట్టుకున్నందుకు దర్శకుడు ఎయిర్‌లైన్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా ప్రపంచంలో ఆస్కార్ అవార్డు అనేది ఒక కళాకారుడి కల. అలాంటి గౌరవప్రదమైన వస్తువు పోగొట్టుకోవడం అనేది మానసికంగా ఎంతో బాధను కలిగిస్తుంది. పాషా తలంకిన్ తన కెరీర్‌లో ఎంతో శ్రమించి సాధించుకున్న ఈ అవార్డు మళ్ళీ తన వద్దకు చేరడాన్ని ఓ అద్భుతంగా అభివర్ణించారు. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో నెటిజన్లు ఎయిర్‌లైన్స్ సిబ్బందిని అభినందిస్తున్నారు.
సాధారణంగా విమాన ప్రయాణాల్లో లగేజీలు మిస్ అవ్వడం చూస్తుంటాం. కానీ ఇలాంటి అమూల్యమైన అవార్డులు అదృశ్యమవ్వడం అరుదుగా జరుగుతుంటుంది. ఈ ఘటన నేపథ్యంలో ప్రయాణికులు విలువైన వస్తువుల భద్రత విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలనే చర్చ మొదలైంది. ఏదేమైనా? అంతర్జాతీయ దర్శకుడి ఆనందాన్ని తిరిగి చేర్చడంలో లుఫ్తాన్సా సిబ్బంది చూపిన చొరవ అభినందనీయం. ప్రస్తుతం పాషా తలంకిన్ తదుపరి ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ఆస్కార్ అవార్డు తిరిగి లభించడంతో ఆయన మళ్ళీ ఉత్సాహంతో పనిని కొనసాగిస్తున్నారు. కళాకారుల ప్రతిభకు దక్కిన ప్రతిఫలం ఎప్పటికీ వారి వద్దే ఉండాలని ఇలాంటి పొరపాట్లు పునరావృతం కాకూడదని సినీ అభిమానులు కోరుతున్నారు.
